అనిల్ అంబానీ మనీలాండరింగ్ కేసులో ఈడీ కీలక నిర్ణయం
తూర్పు గోదావరి జిల్లాలోని అసెట్స్ కూడా.. 
న్యూఢిల్లీ : రిలయన్స్ గ్రూప్ చైర్మెన్ అనిల్ అంబానీకి చెందిన రూ.3వేల కోట్ల పైగా విలువైన ఆస్తులను ఎన్ ఫోర్స్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తుల లిస్టులో ఆయన ఇంటితో పాటు పలు కమెర్షియల్ ప్రాపర్టీలు ఉన్నాయి. ఈ మేరకు ఈడీ అధికారిక వర్గాలు సోమవారం పలు వివరాలను వెల్లడించాయి. బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న ఆయన వాటిని వ్యాపారం కోసం ఉపయోగించకుండా మనీలాండరింగ్ ద్వారా వేరే ఖాతాలకు మళ్లించిన కేసులో ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది. అటాచ్ చేసిన అస్తుల్లో అనిల్ అంబానీకి చెందిన ముంబయిలోని ఆయన నివాసం, గ్రూప్ సంస్థల యాజమాన్యంలోని ఇతర నివాస, వాణిజ్య ఆస్తులు ఉన్నాయి. 
వీటికి సంబంధించి తాత్కాలిక ఉత్తర్వులను ఈడీ జారీ చేసింది. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు కోట్ల రూపాయల బ్యాంకు రుణాల మోసానికి పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో సీబీఐ తొలుత దర్యాప్తు చేపట్టింది. ఆ సంస్థ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దీనిపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. తాజాగా ఢిల్లీలోని మహారాజా రంజిత్‌సింగ్ మార్గ్‌లోని రిలయన్స్ సెంటర్‌కు చెందిన భూమి, నోయిడా, ఘజియాబాద్, ముంబయి, పూణే, థానే, హైదరాబాద్, చెన్నై, ఆంధ్రపదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న అనేక ఆస్తులు అటాచ్ చేసిన జాబితాలో ఉన్నాయి. ఈ అటాచ్ చేయబడిన ఆస్తుల విలువ సుమారు 3,084 కోట్లుగా ఉంటుందని అంచనా.
మనీలాండరింగ్ కేసు..
రిలయన్స్ హోం ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ వివిధ బ్యాంకుల నుంచి రుణం తీసుకుని వాటిని ఇతర ప్రయోజనాల కోసం మనీలాండరింగ్ చేశాకరని అనిల్ అంబానీపై ప్రధాన అరోపణలున్నాయి. దాదాపు రూ.17వేల కోట్ల మోసం జరిగిందని ఈడీ ప్రాథమిక అంచనా. ఈ విషయంలో తొలుత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనిల్ అంబానీని ఫ్రాడ్‌గా పేర్కొంది. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అంబానీని మోసకారిగా గుర్తించింది. 2017-19 మధ్య యెస్ బ్యాంకు 2,965 కోట్లు, మరోసారి 2,045 కోట్లను ఆ సంస్థలకు రుణంగా మంజూరు చేసింది. కాగా.. 2019 అవి నిరర్థక ఆస్తులుగా మారాయి. 
రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ 1,353 కోట్లు, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ 1984 కోట్లు బకాయి పడ్డాయి. దీంతో అసలు విషయం బయటికి రావడంతో సీబీఐ, ఈడీ సంస్థలు విచారణ చేపట్టాయి. రిలయన్స్ గ్రూప్ కంపెనీలు రుణాలను మళ్లించాయనే ఆరోపణలపై జులై 24న ముంబయిలోని 50 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసింది. ఈ కేసులో డైరెక్టర్లు సహ 25 మందిని ప్రశ్నించింది. ఆగస్టులో అనిల్ అంబానీని ఈడీ విచారించింది. ఈ కేసులో తాజాగా ఈడీ మరింత దూకుడు పెంచి.. అనిల్ అంబానీ వ్యాపార సంస్థలకు సంబంధించిన ఆస్తులను ఆటాచ్ చేసింది.
రూ.3వేల కోట్ల ఆస్తులు అటాచ్
- Advertisement -
- Advertisement -

                                    

