– రైతు సంఘం సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి
– భూభారతిపై అవగాహనా సదస్సు
నవతెలంగాణ – చండూరు
భూభారతి చట్టం ప్రకారం అసైన్డ్ భూములు, ఇండ్ల స్థలాలకు హక్కులు కల్పించాలని ఏఐకేఎస్ సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. నల్లగొండ జిల్లా గట్టుప్పల మండల కేంద్రంలో సోమవారం రైతు సంఘం జిల్లా నాయకులు చాపల మారయ్య అధ్యక్షతన నిర్వహించిన ”భూభారతి చట్టం”పై అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడారు. సాదాబైనామాల దరఖాస్తులకు ఇచ్చిన గడువు డిసెంబర్ 2023 వరకు పొడిగించాలని, భూభారతి రూల్స్ ప్రకారం షెడ్యూల్ బిలో చెప్పినట్టు వారసత్వ పట్టాలకు ఎలాంటి ఫీజులూ వసూలు చేయొద్దని అన్నారు. పార్ట్-2 కింద 18 లక్షలా 48 వేల ఎకరాలకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని కోరారు. గ్రామస్థాయిలో రెవెన్యూ ఆఫీసర్లను నియమించి, వాస్తవ భూమి సాగుదారుల పేర్లు రికార్డులో నమోదు చేయాలన్నారు. రెవెన్యూ వ్యవస్థలను త్వరితగతిన పునరుద్ధరించాలని కోరారు. రైతాంగం పోరాటాలు, ఆందోళనలు చేస్తున్నా భూ సమస్యలు పరిష్కారం కావడం లేదని, సమగ్ర భూసర్వే జరగక సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి, భూభారతి వాటి నిబంధనల్ని లోతుగా విశ్లేషిస్తే ఇంకా చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ధరణిలో ఉన్న లోపాలను అధిగమించామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. భూభారతిలోని లోపాలను సరిచేయాలన్నారు. గట్టుప్పల మండలంలో ఇండ్ల స్థలాల కోసం పట్టాలు ఇచ్చిన భూములను గత ప్రభుత్వం పల్లె వనాల పేరుతో ఆక్రమించుకుందని తెలిపారు. ఆ ఇండ్ల స్థలాలను పాత పట్టాదారులకే ఇవ్వాలని, ఇండ్ల నిర్మాణానికి రూ.ఐదు లక్షల చొప్పున మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం, జిల్లా నాయకులు చాపల మారయ్య, కర్నాటి మల్లేశం, సాగర్ల మల్లేష్, జెర్రిపోతుల ధనుంజయ, మిర్యాల భరత్, వరికుప్పల ముత్యాలు, కర్నాటి సుధాకర్, పగిళ్ల శ్రీనివాస్, వేముల లింగస్వామి, కర్నాటి వెంకటేశం, పగిళ్ల యాదయ్య,పెద్దగాని నరసింహ, ముసుకు బుచ్చిరెడ్డి, పబ్బు మారయ్య, బండారి కృష్ణయ్య, ఈరటి వెంకటయ్య, నరసింహ, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ తదితరులు పాల్గొన్నారు.
అసైన్డ్ భూములు, ఇండ్ల స్థలాలకు హక్కులు కల్పించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES