Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeహెల్త్సహాయ సహకారాలు

సహాయ సహకారాలు

- Advertisement -

ఇతరులకు సహాయపడే తత్వం ఉండటం గొప్ప విషయం. అసలు ఒకరి కొకరు సహాయసహకారాలు లేకుండా సమాజంలో ఏదీ జరగదు. బాల్యం నుంచే ఈ తత్వం అలవడాలి. అందుకు స్కూళ్లలో ఉపాధ్యాయులు, ఇంటివద్ద తల్లిదండ్రులు, పరిసరాల్లో పెద్దలు స్ఫూర్తిగా నిలవాలి.
చాలా సందర్భాల్లో మీరు ఇతరులనుంచి సహాయం పొందుతుండవచ్చు. మరి మీరుగా ఇతరులకు సహాయం చేసారా? చేస్తున్నారా? ఈ ప్రశ్న వేసుకోవడం సహాయం పొందడం కంటే ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఇది మీలోని సహకార గుణాన్ని ప్రశ్నిస్తుంది. అసలు ఇతరులకు సహకరించాలని అనిపించాలనే గాని, ఆ ఆలోచన రావాలే గాని అనేక మార్గాలున్నాయి. అయితే మీ సహాయంలో స్వార్థచింతన వుండకూడదు. గర్వం అసలే ఉండకూడదు. స్వార్ధ చింతన, గర్వంతో చేసే పనులు, సహాయం ఏ మాత్రం ఉపయోగపడవు. తోటివారికి, పోనీ మీ తోటివిద్యార్థికే సహాయం చేయాలనిపిస్తే మనస్ఫూర్తిగా చేయాలి. అంతేగాని అతను లేదా ఆమె అడిగిందని చేయకూడదు. ఎందుకంటే సహాయ సహకారాల్లోనే స్నేహం ఉత్పన్నమవుతుంది. అభిమానం పొందగలగుతారు. ఇతరులూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు.
తరగతి గదిలో తోటివారికి సబ్జెక్టు విషయంలో, నోట్సు సాయం చేయడంతో మొదలు పెట్టి స్కూలు ఆవరణలో మంచి స్నేహితులను పెంపొందించుకోవడం, పరిసరాల పరిశుభ్రత విషయంలో సహకరించడం అలవాటు చేసుకోవాలి. అలానే క్రమంగా అన్ని అంశాల్లోనూ ఒకరికొకరు సహకరించుకోవడం అనేది ఏమిటన్నది పిల్లలకు అర్ధమవుతుంది. వారూ ఆ మార్గం అనుసరించడానికి చిన్న ప్రయత్నం చేస్తారు. అదే జీవితంలో తొలిఅడుగులో కీలకం. అదే మంచి మనిషిగా ఎదిగేందుకు దోహదపడుతుంది. ఇతరులకు ఎంతగా సహకరిస్తే అంతగా వారి నుంచి అభిమానం పొందుతారు.
ఇతరులకు సాయపడటం అంటే మీకు తెలిసినదాన్ని మరోసారి సాధన చేయడంగా భావించండి. అందువల్ల ఈ విషయంలో వెనకంజ వేయవద్దు. మీకు తగిన స్థాయిలో, వీలయినంతగా ప్రోత్సహించడం, సహకరించడం విద్యార్ధి దశనుంచే అలవర్చుకోవాలి. ముఖ్యంగా చదువు విషయంలో మీరు పెద్ద క్లాసు పిల్లల సహాయం అందితే అందిపుచ్చుకోవాలి. తిరస్కరించవద్దు. అలా చిన్న క్లాసువారికి అవసరసమయంలో తోడ్పడాలి.
అలాగే ఇంటి దగ్గర, ఇంటి పరిసరాల్లో మీకంటే చిన్న తరగతి పిల్లలకు సబ్జెక్టు పరమైన సమస్యలు పరిష్కరించడానికి సహకరించండి. అంతకంటే గొప్ప సహాయం మరొకటి వుండదు. అలాగే మీకు రాని దాన్ని గురించి వారిని అడిగి తెలుసుకోండి. ఇతరుల ఇబ్బందులు గ్రహించి కూడా సహకరించవచ్చు. అది ఎంతో తప్తిని ఇస్తుంది. మీరూ ఎంతో గౌరవం పొందుతారు. అందరూ మీరంటే అభిమానిస్తారు. దాని కోసం ఇలా చేయండి…
మీకంటే చిన్న తరగతులవారికి చదవడం, రాయడంలో సహకరించండి.
అసైన్మెంట్ల విషయంలో మీరూ సహాయం పొందవచ్చు.
మీకు వచ్చిన సబ్జెక్టును ఇతరులకు బోధించండి.
స్కూలు బయట, ఇంటివద్ద, పరిసరాల్లో పెద్దలకు తోడ్పడండి.
చిన్నపాటి పనులు చేస్తూ తల్లిదండ్రులకూ సహకరించండి.
సహాయం చేయడం, పొందడంలో ఎంతో నేర్చుకుంటారు. ఇతరులతో ఎలా వుండాలి, ఎలా ప్రవర్తించాలి, ఇతరులు కూడా సమస్యల్ని ఎదుర్కొంటున్నారన్న ఎరుక కలుగుతుంది. స్కూలు, కాలేజీ ఆ తర్వాత జీవితంలో అనేక సందర్భాల్లో సహాయసహకారాలు ఇచ్చిపుచ్చుకోవడంలో ఆదరాభిమానాలు పొందడం, ఎంతో సమాచారాన్ని తెలుసుకోవడంతో పాటు స్నేహభావం, సంతప్తి ఉంటుంది. పరిస్థితుల ప్రభావం, విద్యార్ధి దశలో మీరు ఎదుర్కొనే అడ్డంకులు, ఇబ్బందులను మీరు అధిగమించిన అనుభవాలు జీవితంలో ఎంతో ఉపకరిస్తాయి.
డా|| హిప్నో పద్మా కమలాకర్‌,
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌,
హిప్నో థెరపిస్ట్‌

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad