Wednesday, February 25, 2026
E-PAPER
Homeజాతీయంలైంగిక వేధింపుల కేసులో జ్యోతిష్యుడికి 200 ఏండ్ల జైలు

లైంగిక వేధింపుల కేసులో జ్యోతిష్యుడికి 200 ఏండ్ల జైలు

- Advertisement -

తమిళనాడులో పోక్సో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు సంచలన తీర్పు
చెన్నై : లైంగిక వేధింపుల కేసులో ఓ జ్యోతిష్యుడికి పోక్సో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు 200 ఏండ్ల జైలు శిక్ష విధించింది. అలాగే, బాధితులకు రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే, 2021 నవంబర్‌లో శివగంగ జిల్లా మానగిరి ప్రాంతానికి చెందిన జ్యోతిష్యుడు రామకృష్ణన్‌ (52)ని ఓ మహిళ ఆశ్రయించింది. తన కుమారైలకు చదువులో పురోగతి లేదని, ఇందుకు ఏదైనా పరిష్కారం చూపాలని ఆయనను కోరింది. దీంతో రామకృష్ణన్‌ తన ఇద్దరు కూతుళ్లను తీసుకురావాలని సూచించడంతో నమ్మిన సదరు మహిళ వారిని ఆ జ్యోతిష్యుడి ఇంటికి తీసుకెళ్లింది.

బాలికలను గదిలోకి తీసుకెళ్లి!
ఆ జ్యోతిష్యుడు ఆ మహిళను వేరే గదిలో ఉండమని చెప్పి, తన ఇద్దరు కూతుళ్లను మరో గదికి తీసుకెళ్లాడు. అనంతరం అక్కడ ఆ బాలికలిద్దరిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని సదరు మహిళ ఆరోపించారు. అంతేకాక ఈ విషయాన్ని బయటపెడితే తల్లిదండ్రులకు కీడు జరుగుతుందని ఆ బాలికలను జ్యోతిష్యుడు బెదిరించాడని తెలిపారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. దీంతో తల్లిదండ్రులకు ఏమీ కాకూడదని భావించిన ఆ బాలికలు జరిగిన విషయం గురించి ఎవరికీ చెప్పలేదు.

ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి!
ఈ ఘటన జరిగి దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన జరిగిన సమయంలో ఆ ఇద్దరు బాలికల్లోని ఒకరి వయసు 18కాగా, ఇంకొకరి వయసు 14. గత కొంతకాలంగా బాలికలిద్దరికీ అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో వారిని పరీక్షించిన వైద్యులు బాలికలకు లైంగికంగా సంక్రమించే వ్యాధి వచ్చినట్టు తెలిపారు. ఇది విన్న వారి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పిల్లలిద్దరిని విచారించగా జ్యోతిష్కుడు చేసిన నిర్వాకం బయటపడింది. దీంతో బాలికల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పూజారిపై తిరుపత్తూరు ఉమెన్‌ పోలీస్‌ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

తీర్పు వెలువరించిన కోర్టు
శివగంగ జిల్లా పోక్సో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో ఈ కేసు సంబంధించి మంగళవారం విచారణ జరిగింది. జ్యోతిష్కుడు రామకృష్ణన్‌కు 200 ఏండ్ల జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధిస్తున్నట్టు జడ్జి గోకుల్‌ మురుగన్‌ తీర్పు వెల్లడించారు. అదేవిధంగా, బాధితులకు ఒక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

లైంగికదాడి కేసులో మరో వ్యక్తికి 20 ఏండ్ల జైలు శిక్ష
హర్యాలోని ఫతేహాబాద్‌లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఓ వ్యక్తికి ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు అదనపు సెషన్స్‌ జడ్జి సోమవారం తీర్పు వెల్లడించారు. అలాగే ఈ కేసులో నిందితుడికి రూ.1.70 లక్షల జరిమానా విధించారు. ”2024 నవంబర్‌ 13న తన కూతురు (14)పై లైంగికదాడి జరిగినట్టు బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు గత 10 నెలలుగా పాఠశాలకు వెళ్తున్న తన కుమార్తెను ప్రలోభపెట్టాడని, మూడు వారాల క్రితం పొలాల్లోకి తీసుకెళ్లి ఆమెపై దారుణానికి పాల్పడ్డాడని బాధితురాలి తండ్రి ఆరోపించారు. అంతేకాదు, బాధితురాలు ప్రతిఘటించినప్పుడు ఆమెను కొట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నారు” అని ఫతేహాబాద్‌ జిల్లా న్యాయవాది దేవేందర్‌ మిట్టల్‌ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -