అసుర్బ నిపాల్ పరిపాలకుడు, విద్యాదాత అస్సీరియా సామ్రాజ్యాన్ని పాలించిన శక్తివంతమైన రాజులలో అసుర్బ నిపాల్ ఒకరు. ఆయన పాలనాదక్షత, సైనిక విజయాలతో పాటు, చరిత్రలో ఆయన స్థానాన్ని సుస్థిరం చేసింది. ఆయనకు గల అపారమైన విద్యా ప్రకృతికి సంబంధించిన ఆసక్తి, జ్ఞాన సముపార్జనపై ఉన్న మక్కువ. ప్రాచీన మధ్యప్రాచ్యంలో జ్ఞానాన్ని వ్యవస్థీకృతం చేయడంలో ఆయన చేసిన కృషి అసాధారణమైనది.
నినేవె నగరంలో ఆయన స్థాపించిన గ్రంథాలయం కేవలం గ్రంథాల నిల్వ కేంద్రం మాత్రమే కాదు, చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ప్రణాళికాబద్ధంగా, వర్తమాన గ్రంథపట్టికలతో కూడిన ఒక గొప్ప విజ్ఞాన కేంద్రంగా వెలిసింది. ఈ గ్రంథాలయం రాజు జ్ఞానపిపాసకు, పాండిత్యభావనకు ప్రతీకగా నిలిచింది. ఆయనను శక్తివంతమైన పాలకుడిగానే కాక, ‘గ్రంథాలయ వ్యవస్థకు ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన విద్యాప్రియుడి’గా చరిత్రలో నిలిపింది.
వ్యవస్థీకృత సముపార్జన: ఆధునిక గ్రంథాలయ శాస్త్ర పునాది నినేవె గ్రంథాలయం ముఖ్య లక్షణం దాని వ్యవస్థీకృత స్థాపన (Systematic Foundation). అసుర్బ నిపాల్ కేవలం యాదృచ్ఛికంగా గ్రంథాలను సేకరించలేదు. ఆయన ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాడు. రాజు ఆజ్ఞ మేరకు, అస్సీరియన్ ‘లేఖకులు (Scribes)’ దేవాలయ గ్రంథాలయాల నుండి, ఇతర ప్రాంతాల నుండి, అన్ని శైలుల పాఠ్యాలను వెదికించి, సేకరించారు, ప్రతులు (Copies) తీశారు. ఇది నినేవె గ్రంథాలయంలోని పునాది సంగ్రహానికి (Core Collection) కొత్త పాఠ్యాలను చేర్చడానికి దారితీసింది. ముఖ్యంగా అశూర్, కలహ్ (కాల్హు), నినేవె వంటి ప్రధాన నగరాల నుండి విలువైన జ్ఞానాన్ని సమీకరించారు.
ఈ సముపార్జన పద్ధతి నేటి ‘కలెక్షన్ డెవలప్‌మెంట్’ (Collection Development) ప్రక్రియకు తొలి రూపంగా నిలుస్తుంది. ఇది ప్రాచీన కాలంలోనే వ్యవస్థీకృత సముపార్జన పద్ధతిని సూచిస్తుంది. లేఖకులు, గ్రంథాలను ఎంపిక చేసి, వర్గీకరించి, ప్రతులు తీయడంలో చూపిన కృషి, నినేవెను ఒక ప్రణాళికాబద్ధమైన సమాచార నిల్వ కేంద్రం (Information Repository) గా రూపొందించింది. ఈ గ్రంథాలయం చారిత్రక ప్రాముఖ్యత, అందులోని సుమారు 20,720 ఆస్సీర్ మట్టి పలకలు (Clay Tablets) విభిన్న శకలాలు ఇప్పటికీ బ్రిటిష్ మ్యూజియంలో భద్రంగా వుంది. ఈ సంఖ్య ఆనాటి గ్రంథాలయ కృషి పరిమాణాన్ని, దాని సంరక్షణా విలువను మనకు తెలియజేస్తుంది. ఈ విధంగా, అశ్వర్బానిపాల్ తన గ్రంథాలయం ద్వారా జ్ఞాన సంక్రమణ (Knowledge Transfer), మొదటి సూత్రం అయిన ‘సేకరణ’ (Acquisition)ను అత్యంత సమర్థవంతంగా అమలు చేశాడు.
విషయ వైవిధ్యం: ‘విజ్ఞాన డేటాబేస్’, జ్ఞాన విభజన నినేవె గ్రంథాలయం మరొక విశిష్టత. దాని విస్తతమైన విషయ పరిమాణ వైవిధ్యం (Diversity of Subject Matter). ఈ గ్రంథాలయం రాజు వ్యక్తిగత సాహిత్యాసక్తులను మాత్రమే కాక, రాజ్యాన్ని పాలించడానికి, నాగరికతను ముందుకు నడపడానికి అవసరమైన సమగ్ర జ్ఞానాన్ని భద్రపరిచింది. ఇది కేవలం ధార్మిక లేదా సాహిత్య అవసరాలకు మాత్రమే కాక, విద్యా, శాస్త్రీయ పరిశోధనల కోసం పనిచేసిందని రుజువు చేస్తుంది.
శకున శాస్త్ర గ్రంథాలు (Omen Texts): గ్రంథాలయంలోని ముఖ్యమైన పాఠ్యాలలో శకున శాస్త్ర గ్రంథాలు ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాయి. ఇవి ఆ కాలంలో రాజులకు, పండితులకు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో మార్గనిర్దేశం చేసేవి. ఈ గ్రంథాలు ప్రకృతిలోని సంఘటనల పరిశీలన (ఉదాహరణకు, ఎలుకలు లేదా పిల్లుల కదలికలు), మనుషులు, జంతువులు, మొక్కల లక్షణాలు, అలాగే సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాల చలనాలపై ఆధారపడిన ‘పూర్వ జ్యోతిష్య విధానాలను’ లిఖించాయి. రాజులకు భవిష్యత్తును అంచనా వేయడానికి, యుద్ధాలు, కరువుల వంటి వాటికి సిద్ధపడటానికి ఉపయోగపడిన ఈ పాఠ్యాలు, ఆ కాలపు ‘విజ్ఞాన డేటాబేస్’ (Knowledge Database) వలె పనిచేశాయి.
నిఘంటువులు జ్ఞాన విభజనలో మరొక కీలక వర్గం లెక్సికోగ్రఫీ గ్రంథాలు (నిఘంటువులు). ప్రాచీన మెసపొటేమియాలో వివిధ భాషల అవసరం దృష్ట్యా, ఇవి సుమేరియన్, ఆకడియన్, ఇతర భాషా పదాలను వ్యవస్థీకృత నిఘంటువుల రూపంలో సమకూర్చాయి. ఇవి లేఖకుల విద్యా వ్యవస్థలో, భాషా పరిజ్ఞాన పద్ధతుల అభివృద్ధికి కీలకంగా ఉండి, నేటి ‘భాషా నిఘంటు సేవలు”లాగా పనిచేశాయి. దీనితో పాటు అశ్వర్బానిపాల్ సేకరణలో విస్తత శ్రేణిలోని ఇతర పాఠ్యాలు కూడా ఉన్నాయి. మంత్రాలు, ప్రార్థనలు ఇవి ధార్మిక, రక్షణాత్మక అవసరాలను తీర్చేవి. పూజావిధులు (Rituals): దైవారాధన, ఉత్సవాల పద్ధతులు, నీతికథలు (Fables), సామెతలు సమాజంలో విలువలు, నైతికతను పెంపొందించడానికి ఉద్దేశించినవి. హ్యాండ్ బుక్స్, శాస్త్రీయ గ్రంథాలు వైద్యం, గణితం, ఖగోళ శాస్త్రం వంటి విషయాలపై అవగాహనను అందించేవి.
ప్రామాణిక, అప్రామాణిక పాఠ్యాలు: అధికారికంగా గుర్తించబడిన, సంప్రదాయేతర రచనలు రెండూ ఉన్నాయి. ఈ సమగ్రమైన సేకరణ నినేవె గ్రంథాలయాన్ని ఒక బహుళ పరిశోధన గ్రంథాలయం లక్షణాలకు తొలి ఉదాహరణగా నిలిపింది. సాంస్కృతిక స్మృతి భాండాగారం, ‘ప్రజ్ఞా కేంద్రం’ నినేవె గ్రంథాలయం కేవలం జ్ఞానాన్ని సేకరించడమే కాక, ‘ప్రాచీన మెసపొటేమియా’ అపారమైన ‘సాంస్కృతిక, సాహిత్య వారసత్వాన్ని’ భద్రపరచడంలో అత్యంత కీలక పాత్ర పోషించింది. ఈ గ్రంథాలయం ఒక సాంస్కృతిక స్మృతి భాండాగారం వలె పనిచేసింది. ప్రపంచ సాహిత్య సంరక్షణ ప్రాచీన మెసపొటేమియన్ల అత్యంత ముఖ్యమైన మహాకావ్యాలు (Epics), సృష్టి కథలు ప్రపంచానికి అందుబాటులోకి రావడానికి ప్రధాన కారణం నినేవె గ్రంథాలయం. ‘గిల్గమేష్ కావ్యం’ (Epic of Gilgamesh) మానవజాతి చరిత్రలోనే అత్యంత పురాతనమైన, సుప్రసిద్ధమైన ఈ కావ్యం, గ్రంథాలయంలో భద్రపరచబడినందువల్లే నేటికీ అందుబాటులో ఉంది. ఇర్రా ఇతిహాసం, యుద్ధం, విపత్తుపై వివరించేది. ఏటనా, అంజూ కథలు, రాజులు, దేవతల గురించిన పురాణ గాథలు.
ఈ పాఠ్యాల సంరక్షణ ద్వారా నినేవె మెసపొటేమియన్ నాగరికత ఆత్మను భవిష్యత్ తరాలకు అందించింది. అంతేకాక, ‘నిప్పూర్ పేదవాడి కథ’ వంటి జానపద గాథలు కూడా ఇక్కడ సేకరించబడ్డాయి. ఈ కథలు తరువాతి నాగరికతల మీద, ముఖ్యంగా బగ్దాద్‌లో అభివృద్ధి చెందిన ‘అరబియన్ నైట్స్’ కథలకు పూర్వగామిగా నిలిచాయి. తద్వారా జ్ఞాన సంక్రామణ మూడవ సూత్రం అయిన ప్రాచుర్యం కల్పించడంకు పరోక్షంగా దోహదపడింది. విశ్వవిద్యాలయ స్థాయి కేంద్రం గ్రంథాలయంలో ఉన్న హస్తపుస్తకాలు, శాస్త్రీయ గ్రంథాల సమక్షం, ఈ గ్రంథాలయం కేవలం రాజసమాజంలోని ఉన్నత వర్గాల కోసమో, ధార్మిక ప్రయోజనాల కోసమో మాత్రమే కాక, విశ్వవిద్యాలయ స్థాయి ‘ప్రజ్ఞా కేంద్రం’వలె పనిచేసిందని స్పష్టమవుతుంది. ఇది బహుళ విషయాలను, విద్యా అవసరాలను తీర్చే విధంగా ఉండడం వలన, జ్ఞానాన్ని సృష్టించే, విశ్లేషించే, సంరక్షించే లక్షణాలతో, నేటి పరిశోధనా గ్రంథాలయాల ఆదర్శానికి తొలి ఉదాహరణగా నిలిచింది.
అసుర్బ నిపాల్ వారసత్వం: గ్రంథాలయ శాస్త్ర పితామహుడు అసుర్బ నిపాల్ గ్రంథాలయం నిర్వహణ, విధానాలు ఆధునిక గ్రంథాలయ శాస్త్రానికి (Library Science) బలమైన చారిత్రక పునాదిని చూపాయి. స్వామ్య ముద్ర (Colophon), భద్రత గ్రంథాలయంలోని అనేక మట్టిపలకలపై రాజు స్వామ్య ముద్ర (Colophon/ Owners Seal) తో కూడిన శిలాశాసనాలు ఉండటం ఒక ముఖ్యమైన అంశం. ఈ ముద్ర గ్రంథాలయాన్ని అశ్వర్బానిపాల్ వ్యక్తిగత పర్యవేక్షణలో నిర్మించాడని, ఆయనకు గల జ్ఞానపిపాసకు, పాండిత్యభావనకు ప్రతీకగా నిలిచిందని తెలియజేస్తుంది. ఈ స్వామ్య ముద్ర సమాచార భద్రత, లిలిమూలాధికార గుర్తింపు (Source Authority) ను సూచిస్తుంది. ఇది నేటి ‘కాపీరైట్’ (Copyright) లేదా ‘ప్రొవెనెన్స్ ట్రాకింగ్’ (Provenance Tracking) వంటి అంశాలకు ప్రాచీన రూపంగా నిలిచింది.
ఈ విధంగా నినేవె గ్రంథాలయం జ్ఞాన సంక్రామణ మూడు ప్రధాన సూత్రాలను ఆచరించింది. సేకరణ భద్రపరచడం, భవిష్యత్ తరతరాలకోసం ప్రాచుర్యం కల్పించడం. ఈ వ్యవస్థీకృత సేకరణ, జాబితా, జ్ఞాన సంరక్షణకు అసుర్బ నిపాల్ చేసిన కృషి కారణంగా, చరిత్రకారులు ఆయనను కేవలం శక్తివంతమైన ఆస్సీర్ పాలకుడిగానే కాక, గ్రంథాలయ శాస్త్ర చరిత్రలో పితామహుడిగా గుర్తించడం సముచితం. నినేవె గ్రంథాలయం ప్రాచీన ప్రపంచంలో మానవ జ్ఞానాన్ని భద్రపరచడానికి, వ్యవస్థీకృతం చేయడానికి జరిగిన మొట్టమొదటి మహత్తర ప్రయత్నంగా నిలిచింది.
- డా|| రవికుమార్ చేగొని, 9866928327



