పి ఆర్ సి ప్రకటించి అమలు చేయాలి
ఉద్యోగ విరమణ ప్రయోజనాలు విడుదల చేయాలి
మార్చి 24న జిల్లా కేంద్రంలో నిరసన ప్రదర్శన
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
సమస్యల సాధనకు నిరసన ప్రదర్శన విజయవంతం చేయాలని టిపిటిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దుమాల రమానాధ్ రెడ్డి కోరారు. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ బడ్జెట్ను కేటాయించి ప్రకటిత విద్యా లక్ష్యాలను వమ్ము చేశారని, టీపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు దుమాల రమానాధ్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి విక్కుర్తి అంజయ్య లు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ…మొత్తం రాష్ట్ర బడ్జెట్ రూ.3,24,234 కోట్లలో కేవలం విద్యారంగానికి 26,674 కోట్లు కేటాయించారు. ప్రస్తుత బడ్జెట్ లో గత సంవత్సర కేటాయింపులకు కేవలం 0.63% మాత్రమే పెంచి కేటాయింపులను 8.23% కుదించారు.
విద్యా వ్యవస్థను సమూలంగా మారుస్తామని అట్టహాసంగా ప్రకటిస్తూ, ఉన్న స్కూళ్లను బలోపేతం చేయడం విస్మరించి ఇంటిగ్రేటెడ్ స్కూలంటూ, పబ్లిక్ స్కూలంటూ విద్యా కమీషన్ రిపోర్ట్ వచ్చిన తరుణంలో దిగువ స్థాయిలో విద్యా రంగానికి కేటాయింపులు జరపడం గర్హనీయం. ఈ బడ్జెట్ వల్ల విద్యారంగం మరింత కునారిల్లి పేదలు నాణ్యమైన విద్యను పొందలేని పరిస్థితులు ఉత్పన్న మవడమే కాకుండా, అరకొర వసతులతో ఉన్న పాఠశాల వ్యవస్థ, మరింత దుర్భర స్థితిలోకి నెట్టివేయబడుతుందనీ అన్నారు.
విద్యారంగ బలోపేతానికి కొఠారి కమీషన్ తో పాటుగా, అనేక మంది విద్యావేత్తలు, ఉపాధ్యాయ ఉద్యమ సంఘాలు బడ్జెట్ లో విద్యారంగానికి 30% కేటాయింపులు జరుపాలని దశబ్దాలుగా డిమాండ్ చేస్తున్నాయి. పాలక పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యారంగానికి 15% బడ్జెట్ను కేటాయిస్తామని హామీ పడుతూ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తామిచ్చిన మాటను సైతం నిలబెట్టుకోక పోవడం శోచనీయం. ముఖ్యమంత్రి విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతున్న మాటలకు చేతలకు పొంతన లేకుండా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పాలకుల నిర్లక్ష్యం వల్ల 2021-22 లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న 27 లక్షల విద్యార్థుల సంఖ్య నేడు 16 లక్షలకు పడిపోయిందన్నారు.
నాణ్యమైన విద్య, తరగతి గదుల నిర్మాణం, ఉపాధ్యాయుల నియామకం, భౌతిక వసతులు, సానిటేషన్, కంప్యూటర్, గ్రంథాలయాలు, స్పోర్ట్స్ ను తదితర విషయాల అభివృద్ధి మొత్తం బడ్జెట్ కేటాయింపుల పైననే ఆధారపడుతుందన్నారు. తెలంగాణ విద్యా కమిషన్ రిపోర్ట్ ప్రకారం అత్యంత నిర్లక్ష్యానికి గురికాబడ్డ విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వం ఈ బడ్జెట్లో విద్యారంగానికి 20 శాతం నిధులు కెటాయింపులు జరుపాలని, రిటైర్డ్ టీచర్ల పెన్షనరీ ప్రయోజనాల పెండింగ్ బిల్లులను ఏక మొత్తంలో విడుదల చేయాలని కోరారు.
టీచర్ల పెండింగు బిల్లులు, పీఆర్సీ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈనెల మార్చి 24న జిల్లా కేంద్రంలో టి పి టి ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు… ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దేవేందర్ జిల్లా కార్యదర్శి చకినాల రామచంద్రం వేములవాడ మండల అధ్యక్షులు బొజ్జ కృష్ణ, రూరల్ అధ్యక్షులు శ్రీనివాస్ చందుర్తి మండల అధ్యక్షులు సంజీవ్ , రుద్రంగి మండల అధ్యక్షులు బాలరాజు లు పాల్గొన్నారు.



