ఎర్ర, నల్ల మట్టి మిశ్రమంతో పిచ్ సిద్ధం
కొత్త పిచ్‌పైనే భారత్, వెస్టిండీస్ నాల్గో టీ20
నవతెలంగాణ-హైదరాబాద్ :
భారత్, వెస్టిండీస్ టీ20 సిరీస్ భారీ స్కోర్ల ధమాకాతో సాగుతోంది. రాంచి, ఇండోర్‌లో పరుగుల వరద పారగా ఇరు జట్ల బౌలర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో టీ20 సిరీస్ సవాల్ హైదరాబాద్‌కు చేరుకుంది. ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్లకు వేదికగా నిలిచే హైదరాబాద్‌లో భారత జట్టు సైతం అత్యధికంగా 297 పరుగులు బాదింది. సిరీస్ విజయంపై భారత్, సిరీస్ సమం చేసేందుకు వెస్టిండీస్ సిద్ధమవుతుండగా నాల్గో టీ20 బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరుగనుంది. అయితే, 15 ఏండ్లలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తొలిసారి ఉప్పల్ పిచ్‌లను మార్చింది. ఇటీవల నూతన పిచ్‌లను తయారు చేశారు. భారత్, వెస్టిండీస్ నాల్గో టీ20 మ్యాచ్‌కు కొత్త పిచ్‌ను కేటాయించారు. దీంతో సహజంగానే, కొత్త పిచ్ ఎలా స్పందిస్తుంది? గతంలో మాదిరి భారీ స్కోర్ల ధమాకా అందిస్తుందా? బ్యాట్‌కు, బంతికి సరసమైన పోటీ ఉండేలా చూస్తుందా? అనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది.
గతంలో అన్నీ భారీ స్కోర్లే!
హైదరాబాద్‌లో సహజంగా ఎర్రమట్టి పిచ్‌లు ఉంటాయి. ఇవి బ్యాటింగ్‌కు అనుకూలం. ఉప్పల్‌లో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఎర్రమట్టి పిచ్‌లపైనే సన్‌రైజర్స్ బ్యాటర్లు పరుగుల వరద పారించారు. 2024 బంగ్లాదేశ్‌తో టీ20లో భారత్ ఇక్కడ ఏకంగా 297 పరుగుల రికార్డు చేసింది. టెస్టు ఆడే దేశాల్లో ఇదే అత్యధిక టీ20 స్కోరు. ఇక 2025 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ అత్యధికంగా 286 పరుగులు చేసింది. 200, 250 ప్లస్ స్కోర్లకు లెక్క లేదు!.
ఎర్ర, నల్ల మట్టితో పిచ్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉప్పల్ స్టేడియంలో పిచ్‌లతో పాటు అవుట్‌ఫీల్డ్‌ను సైతం ఆధునీకరించాలని నిర్ణయించింది. అందులో భాగంగా తొలుత కొత్త పిచ్‌లను తయారు సిద్ధం చేసింది. 15 ఏండ్లలో పిచ్‌లను మార్చటం ఇదే ప్రథమం. గతంలో ఎర్ర మట్టి పిచ్‌లు ఉండగా.. తాజాగా ఎర్రమట్టి, నల్ల మట్టి మిశ్రమంతో పిచ్‌లను తయారు చేశారు. అయితే, మిశ్రమ పిచ్‌లో అధిక శాతం ఎర్రమట్టి ఉంటుంది. సహజంగానే ఎర్రమట్టి పిచ్ అనుకూలతలు ఈ పిచ్‌లోనూ ఉంటాయి. నల్ల మట్టి పిచ్ స్వభావం సైతం తోడవుతుంది. మిశ్రమ మట్టి పిచ్‌పై మంచి పేస్, బౌన్స్ లభిస్తుంది. బంతిపై మెరుపు తగ్గాక (బంతి పాతబడిన తర్వాత) పరుగుల వేట బ్యాటర్లకు సులువుగా మారుతుంది. ఈ పిచ్‌లపై సైతం 200 ప్లస్ పరుగులు అలవోకగానే నమోదవుతాయి!. భారత్‌లో ఎక్కువ స్టేడియాల్లో నల్ల, ఎర్ర మట్టి పిచ్‌లు మాత్రమే ఉన్నాయి. అహ్మదాబాద్‌లో 2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్‌ను మిశ్రమ మట్టి పిచ్‌పై ఆడించారు. తాజాగా ఉప్పల్ స్టేడియంలోనూ మిశ్రమ మట్టి పిచ్ అందుబాటులోకి రానుంది.






కామెంట్‌లు (0)