'ది లాన్సెట్' కమిషన్ తాజా నివేదిక
న్యూఢిల్లీ : ఊబకాయం, మానసిక ఆరోగ్య సమస్యలు, చిన్నారుల్లో పోషకాహార లోపం నుంచి వాతావరణ మార్పులు, అణుయుద్ధం, కృత్రిమ మేధ (ఏఐ) దుర్వినియోగం వరకు.. ప్రపంచ మానవాళి భవిష్యత్తును ప్రభావితం చేసే 17 పెను ముప్పులను ‘ది లాన్సెట్’ కమిషన్ తన తాజా నివేదికలో వెల్లడించింది. అక్టోబర్ 11న బెర్లిన్‌లో ప్రారంభమైన ప్రపంచ ఆరోగ్య సదస్సులో ఈ నివేదికను విడుదల చేశారు. 204 దేశాలు, ప్రాంతాల్లోని పరిస్థితులను పరిశీలించిన కమిషన్.. ఇప్పటి నుంచే సమర్థమైన చర్యలు చేపడితే భవిష్యత్తులో భారీ స్థాయిలో ఆరోగ్య నష్టాలను నివారించవచ్చని పేర్కొంది.ఊబకాయం ప్రధాన ముప్పుల్లో ఒకటిగా నిలిచింది. దీనిని సమర్థంగా నియంత్రిస్తే 2100 నాటికి 2,310 కోట్ల ఆరోగ్యకర జీవిత సంవత్సరాల నష్టాన్ని నివారించవచ్చని అంచనా వేసింది. అనారోగ్యం, వైకల్యం, అకాల మరణాల కారణంగా కోల్పోయే ఆరోగ్యకర జీవిత కాలాన్ని డీఏఎల్‌వైగా పరిగణిస్తారు. యాంటీబయాటిక్ మందులను తట్టుకునే సూక్ష్మజీవులు, అధిక రక్తపోటు, ధూమపానం, వృద్ధాప్య సమస్యలు, ఆదాయ అసమానతలు, విద్యా లోపం కూడా తీవ్రమైన ముప్పులేనని నివేదిక వివరించింది. వీటికి తోడు మహమ్మారులు, యుద్ధాలు, అణు ఘర్షణలు, వాతావరణ మార్పులు, ఏఐ దుర్వినియోగం మానవాళికి పెను సవాళ్లుగా మారనున్నాయని హెచ్చరించింది. వీటన్నింటినీ విడివిడిగా కాకుండా సమగ్రంగా ఎదుర్కోవాల్సిన అవసరముందని వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ డైరెక్టర్, కమిషన్ సహ అధ్యక్షుడు క్రిస్టోఫర్ జె.ఎల్. ముర్రే స్పష్టం చేశారు.
వాతావరణ మార్పులతో మరింత ముప్పు
వాతావరణ మార్పులు అనేక ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రతరం చేస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు. చిన్నారుల్లో పోషకాహార లోపం, వాయు కాలుష్యం, ఊబకాయం, అధిక రక్తపోటు, మానసిక సమస్యలు, మహమ్మారులు, వృద్ధాప్య సమస్యలపై వాతావరణ మార్పుల ప్రభావం ఉంటుందని వివరించారు. ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.8 డిగ్రీల సెల్సియస్ స్థాయిలో పరిమితం చేయగలిగితే, 4.4 డిగ్రీలకు చేరే పరిస్థితితో పోలిస్తే 189 కోట్ల ఆరోగ్యకర జీవిత సంవత్సరాల నష్టాన్ని నివారించవచ్చని నివేదిక అంచనా వేసింది. ఆదాయ అసమానతల కారణంగా 2100 నాటికి 1,380 కోట్ల ఆరోగ్యకర జీవిత సంవత్సరాలు కోల్పోయే ప్రమాదముందని పేర్కొంది. ఇది 25 కోవిడ్ మహమ్మారుల ప్రభావంతో సమానమని వివరించింది. అణుయుద్ధాన్ని నివారించడం ద్వారా 13.3 కోట్ల మరణాలను, ఏఐ దుర్వినియోగాన్ని అడ్డుకోవడం ద్వారా 1,040 కోట్ల ఆరోగ్యకర జీవిత సంవత్సరాల నష్టాన్ని నివారించవచ్చని అంచనా వేసింది.
భారత్ కీలక పాత్ర పోషించాలి
ఆరోగ్య రంగంలో స్వల్పకాలిక లక్ష్యాలకే పరిమితం కాకుండా, భవిష్యత్తు ప్రమాదాలను ముందుగానే అంచనా వేసి చర్యలు చేపట్టాలని సౌమ్య స్వామినాథన్ సూచించారు. స్థానిక గణాంకాలను ఇతర రంగాల సమాచారంతో అనుసంధానించి, కృత్రిమ మేధ సాయంతో భవిష్యత్తు పరిస్థితులను అంచనా వేయాలని పేర్కొన్నారు. ముఖ్యంగా బలహీన వర్గాలకు ఆరోగ్య సేవలు అందేలా పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఏఐ భద్రత, మహమ్మారుల నివారణ, ఆరోగ్యంపై వాణిజ్య ప్రభావాలు వంటి అంతర్జాతీయ చర్చల్లో భారత్ నాయకత్వ పాత్ర పోషించాలని సూచించారు.
మూడు మార్గాల్లో ముందడుగు
పటిష్ఠమైన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించడం, టీకాలు, యాంటీబయాటిక్స్, ఊబకాయం చికిత్సలు, వాతావరణ సాంకేతికతలపై పరిశోధనలకు పెట్టుబడులు పెట్టడం, ముప్పులను క్రమం తప్పకుండా స్వతంత్రంగా అంచనా వేయడం ద్వారా ఈ సవాళ్లను ఎదుర్కోవచ్చని కమిషన్ సూచించింది. మానవాళి ఆరోగ్యకర భవిష్యత్తు కోసం ప్రభుత్వాలు ఇప్పటి నుంచే సమన్వయంతో చర్యలు చేపట్టాలని ‘ది లాన్సెట్’ సంపాదకుడు రిచర్డ్ హార్టన్ పిలుపునిచ్చారు.






కామెంట్‌లు (0)