Magazines

వరుణుడు వచ్చినా.. మనదే పైచేయి

3 గంటల క్రితం

india win
avatar
balaji

ప్రచురించబడింది నవం 08, 2026 | 3 నిమిషాల చదవడం

రెండో వన్డేలో కివీస్‌పై 
భారత్‌ గెలుపు

నిప్పులు చెరిగిన పేసర్‌ గుర్నూర్‌
ఛేదనలో రాణించిన శ్రేయస్‌, రాహుల్‌


వెల్లింగ్టన్‌ (న్యూజిలాండ్‌) : వరుసగా రెండో వన్డేకు వరుణుడు అంతరాయం కలిగించినా... టీమ్‌ ఇండియా వరుసగా రెండో మ్యాచ్‌లో పైచేయి సాధించింది. వర్షం పలుమార్లు ఆటకు ఆటంకం కలిగించిన మ్యాచ్‌లో ఓవర్లు, లక్ష్యాన్ని సవరించినా.. పూర్తి మ్యాచ్‌ సాధ్యపడలేదు. డక్‌వర్త్‌ లూయిస్‌ స్టెర్న్‌ పద్దతిలో భారత్‌ లక్ష్యాన్ని 26 ఓవర్లకు 110 పరుగులుగా తేల్చగా.. అప్పటికే 113/7 పరుగులు చేసిన భారత్‌ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్‌ 2-0తో ముందంజ వేసింది. ఛేదనలో శ్రేయస్‌ అయ్యర్‌ (30, 46 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), కెఎల్‌ రాహుల్‌ (26 నాటౌట్‌, 38 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) సహా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (23, 28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అంతకముందు పేసర్‌ గుర్నూర్‌ బరార్‌ (4/30) నాలుగు వికెట్ల ప్రదర్శనకు తోడు అన్షుల్ కాంబోజ్‌ (2/25), అకిబ్‌ నబి (2/31), అక్షర్‌ పటేల్‌ (2/28) విజృంభించారు. దీంతో ఆతిథ్య న్యూజిలాండ్‌ 41 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో డార్లీ మిచెల్‌ (55, 104 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో మెరువగా, కెప్టెన్‌ మిచెల్‌ శాంట్నర్‌ (31, 36 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) ఆకట్టుకున్నాడు. భారత యువ పేసర్‌ గుర్నూర్‌ బరార్‌ 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'గా నిలిచాడు. భారత్‌, న్యూజిలాండ్ మూడో వన్డే మంగళవారం హామిల్టన్‌లో జరుగనుంది.

చిన్నదే.. అయినా అతికష్టంగా!

భారత్‌ లక్ష్యం 135 పరుగులు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (23) జెమీసన్‌ ఓవర్లో ఇబ్బంది పడినా రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశాడు. మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (0) జాకబ్‌ డఫ్ఫీకి గోల్డెన్‌ డక్‌గా దొరికిపోగా.. విరాట్‌ కోహ్లి (7)ని సైతం డఫ్పీ వెనక్కి పంపాడు. రోహిత్‌ శర్మ, శ్రేయస్‌ అయ్యర్‌ (30) మూడో వికెట్‌కు విలువైన భాగస్వామ్యం నమోదు చేశారు. జెమీసన్‌ ఓవర్లో రోహిత్‌ శర్మ వికెట్‌ కోల్పోగా.. అక్షర్‌ పటేల్‌ (7)ను మాథ్యూ ఫిషర్‌ సాగనంపాడు. ఈ దశలో 47/4తో భారత్‌ కష్టాల్లో చిక్కుకుంది. శ్రేయస్‌ అయ్యర్‌, కెఎల్‌ రాహుల్‌ (26 నాటౌట్) భారత్‌ను గట్టెక్కించేలా వేగంగా పరుగులు జోడించారు. శ్రేయస్‌ అయ్యర్‌ను జెమీసన్‌ అవుట్‌ చేయటంతో భారత్‌ కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. నమన్‌ ధీర్‌ (12), అన్షుల్‌ కాంబోజ్‌ (1)లు సైతం అవుట్‌ కాగా భారత్‌ 111/7తో నిలిచింది. భారత ఇన్నింగ్స్‌కు అప్పటికే వర్షం అంతరాయం కలిగించగా లక్ష్యాన్ని 37 ఓవర్లలో 133 పరుగులుగా తేల్చారు. 26 ఓవర్లలో భారత్‌ 113/7తో ఉండగా వర్షం అంతరాయం కలిగించింది. మళ్లీ ఆట సాగే అవకాశాలు లేకపోవటంతో అంపైర్తు మ్యాచ్‌ ఫలితాన్ని డక్‌ వర్త్‌ లూయిస్‌ స్టెర్న్‌ పద్దతిలో తేల్చారు. డిఎల్‌ఎస్‌ ప్రకారం 26 ఓవర్లలో 110 పరుగులు టార్గెట్‌ కాగా.. భారత్‌ అప్పటికే ముందంజలో నిలిచింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో కైల్‌ జెమీసన్‌ (3/35), జాకబ్‌ డఫ్ఫీ (3/35) ఆకట్టుకున్నారు.

విజృంభించిన గుర్నూర్‌

వర్షం అంతరాయంతో మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌కు చేసిన ఆతిథ్య న్యూజిలాండ్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. 53 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌కు డార్లీ మిచెల్‌ (55), మిచెల్‌ శాంట్నర్‌ (31) మూడంకెల స్కోరు అందించారు. గుర్నూర్‌ బరార్‌, అన్షుల్‌ కాంబోజ్‌, అకిబ్‌ నబి, అక్షర్‌ పటేల్‌ వికెట్ల వేటలో విజృంభించారు. టిమ్‌ సీఫర్ట్‌ (0), విల్‌ యంగ్‌ (6), హెన్నీ నికోల్స్‌ (11), టామ్‌ లేథమ్‌ (7), గ్లెన్‌ ఫిలిప్స్‌ (0)లు భారత పేస్‌కు దాసోహం అయ్యారు. డార్లీ మిచెల్‌, మిచెల్‌ శాంట్నర్‌లు ఆరో వికెట్‌కు అర్థ సెంచరీ భాగస్వామ్యంతో కివీస్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. టెయిలెండర్లు నాథన్‌ స్మిత్‌ (3), కైల్‌ జెమీసన్‌ (7), బ్లెయిర్‌ టిక్‌నర్‌ (2)లు తోకముడచటంతో కివీస్‌ 41 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది.

స్కోరు వివరాలు

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ : 134/10 (డార్లీ మిచెల్‌ 55, మిచెల్‌ శాంట్నర్‌ 31, గుర్నూర్‌ బరార్‌ 4/31, అక్షర్‌ పటేల్‌ 3/28, అన్షుల్‌ 2/31)

భారత్‌ ఇన్నింగ్స్‌ : 113/7 ( శ్రేయస్‌ అయ్యర్‌ 30, కెఎల్‌ రాహుల్‌ 26, రోహిత్‌ శర్మ 23, కైల్‌ జెమీసన్‌ 3/35, జాకబ్‌ డఫ్ఫీ 3/35)


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్