కివీస్‌ను నిలబెట్టిన నికోల్స్, ఫిలిప్స్
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 243/5
భారత్, కివీస్ తొలి టెస్టు తొలి రోజు
బేసిన్ రిజర్వ్‌లో భారత్, కివీస్ తొలి టెస్టు. పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా ఇన్నింగ్స్ మూడో బంతికే వికెట్ల వేట మొదలెట్టాడు. యువ పేసర్లు అన్షుల్ కాంబోజ్, ఆకాశ్ దీప్ సైతం పేస్, స్వింగ్‌తో వికెట్ల వేట కొనసాగించారు. దీంతో తొలి సెషన్లోనే 70 పరుగులకే న్యూజిలాండ్ 5 వికెట్లు కోల్పోయింది. రెండో సెషన్లో ఆతిథ్య జట్టు ఆలౌట్ అనివార్యమే అనిపించింది. కానీ, ఇక్కడే కథ మలుపు తిరిగింది. హెన్నీ నికోల్స్ (113 నాటౌట్), గ్లెన్ ఫిలిప్స్ (94 నాటౌట్) ఆరో వికెట్‌కు అజేయంగా 173 పరుగులు జోడించి కివీస్‌ను నిలబెట్టారు. టాప్ లేపినా.. భారత్ తొలి రోజు ఆటను అర్థ సంతృప్తిగానే ముగించింది.
నవతెలంగాణ-వెల్లింగ్టన్
భారత పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా (3/52), అన్షుల్ కాంబోజ్ (1/57), ఆకాశ్ దీప్ (1/33) తొలి సెషన్లో నిప్పులు చెరిగినా.. తర్వాతి రెండు సెషన్లలో న్యూజిలాండ్ నిలదొక్కుకుంది.28.2 ఓవర్లలో 70 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకున్న న్యూజిలాండ్‌ను హెన్రీ నికోల్స్ (113 నాటౌట్, 221 బంతుల్లో 14 ఫోర్లు), గ్లెన్ ఫిలిప్స్ (94 నాటౌట్, 182 బంతుల్లో 13 ఫోర్లు) ఆదుకున్నారు. ఆరో వికెట్‌కు ఈ జోడీ అజేయంగా 173 పరుగులు జోడించారు. దీంతో భారత్‌తో తొలి టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి రోజు ఆట ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్‌లో 82 ఓవర్లలో 5 వికెట్లకు 243 పరుగులు చేసింది. తొలి సెషన్లో 4 వికెట్లతో భారత్ దుమ్మురేపినా.. తర్వాతి రెండు సెషన్లలో న్యూజిలాండ్ పైచేయి సాధించింది.
ఆరంభం అద్భుతం
టాస్ నెగ్గిన భారత్ పచ్చికతో కూడిన బేసిన్ రిజర్వ్ పిచ్‌పై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. జశ్‌ప్రీత్ బుమ్రా మూడో బంతికే వికెట్ పడగొట్టి అదిరే ఆరంభం అందించాడు. కెప్టెన్ టామ్ లేథమ్ (0)ను బుమ్రా బౌల్డ్ చేశాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే (4)ను అన్షుల్ కాంబోజ్ వికెట్ కీపర్ క్యాచ్‌తో సాగనంపాడు. రచిన్ రవీంద్ర (15)ను ఆకాశ్ దీప్.. డార్లీ మిచెల్ (1)ను బుమ్రా అవుట్ చేశారు. దీంతో 21 ఓవర్లలోనే న్యూజిలాండ్ 52 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. తొలి సెషన్లో పేస్, స్వింగ్‌తో భారత పేసర్లు మూకుమ్మడి దాడి చేశారు. న్యూజిలాండ్ బ్యాటర్లు పేస్, స్వింగ్‌కు సమాధానం ఇవ్వలేక వికెట్లు ఇచ్చేశారు. లంచ్ విరామం తర్వాత టామ్ బ్లండెల్ (5) సైతం బుమ్రా ఓవర్లో వికెట్ కోల్పోయాడు. అప్పటికి న్యూజిలాండ్ స్కోరు 28.2 ఓవర్లలో 5 వికెట్లకు 70 పరుగులు. ఇక న్యూజిలాండ్ ఆలౌట్ అనివార్యమే అనిపించింది.
ఆ ఇద్దరు ఎదురించారు
పచ్చిక పిచ్‌పై బంతి వికెట్‌కు ఇరువైపులా స్వింగ్ అవుతున్న వేళ హెన్నీ నికోల్స్ (113 నాటౌట్), గ్లెన్ ఫిలిప్స్ (94 నాటౌట్) కివీస్‌ను నిలబెట్టారు. హెన్రీ నికోల్స్ బంతి పిచ్ అయిన తర్వాత ఆగి ఆడుతూ, స్పష్టత ఉన్నప్పుడే డ్రైవ్ ఆడుతూ పరుగులు సాధించాడు. మరో ఎండ్‌లో గ్లెన్ ఫిలిప్స్ సైతం కుదురుకున్నాక పరుగుల వేట సాగించాడు. పరుగుల కష్టంగా వచ్చినా.. ఈ ఇద్దరూ సహనంతో బ్యాటింగ్ చేశారు. ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్‌లు ప్రయత్నించినా.. ఎటువంటి పొరపాటు చేయలేదు. హెన్రీ నికోల్స్ ఏడు ఫోర్లతో 100 బంతుల్లో అర్థ సెంచరీ సాధించగా.. గ్లెన్ ఫిలిప్స్ తొమ్మిది బౌండరీలతో 73 బంతుల్లో అర్థ సెంచరీ బాదాడు. వికెట్ ఇవ్వకుండా లంచ్ సెషన్‌ను ముగించిన ఈ జోడీ.. ఆఖరు సెషన్లో సైతం పైచేయి సాధించారు. హెన్రీ నికోల్స్ 12 ఫోర్లతో 188 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఫిలిప్స్ సైతం సెంచరీకి చేరువైనా.. తొలి రోజు ఆటలో 82 ఓవర్లు మాత్రమే సాధ్యపడ్డాయి. ఆరో వికెట్‌కు 53.4 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన నికోల్స్, ఫిలిప్స్ 173 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 300 పరుగులు చేసినా.. ఈ పిచ్‌పై అది భారీ స్కోరుగా పరిగణించవచ్చు.
సిరాజ్, జడేజా బెంచ్‌కు
బుమ్రా తర్వాత భారత జట్టులో ప్రధాన పేసర్ మహ్మద్ సిరాజ్. వన్డేల్లో అవకాశం ఇవ్వకుండా సిరాజ్‌ను బెంచ్‌కు పరిమితం చేసిన జట్టు మేనేజ్మెంట్.. అనూహ్యంగా తొలి టెస్టులో అతడిని ఆడించలేదు. స్పిన్ ఆల్‌రౌండర్ సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజాను కాదని వాషింగ్టన్ సుందర్‌ను తీసుకున్నారు. పేస్ ఆల్‌రౌండర్‌ను సైతం కాదని స్పెషలిస్ట్ పేసర్‌ను ఎంచుకున్నారు.
స్కోరు వివరాలు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ : టామ్ లేథమ్ (బి) బుమ్రా 0, డెవాన్ కాన్వే (సి) పంత్ (బి) కాంబోజ్ 4, హెన్నీ నికోల్స్ నాటౌట్ 113, రచిన్ రవీంద్ర (సి) పంత్ (బి) ఆకాశ్ దీప్ 15, డార్లీ మిచెల్ (సి) జైస్వాల్ (బి) బుమ్రా 1, టామ్ బ్లండెల్ (సి) శుభ్‌మన్ (బి) బుమ్రా 5, గ్లెన్ ఫిలిప్స్ నాటౌట్ 94, ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం : (82 ఓవర్లలో 5 వికెట్లకు) 243.
వికెట్ల పతనం :1-2, 2-12, 3-51, 4-52, 5-70.
బౌలింగ్ : జశ్‌ప్రీత్ బుమ్రా 17-5-52-3, అన్షుల్ కాంబోజ్ 18-4-57-1, ఆకాశ్ దీప్ 15-5-33-1, ప్రసిద్ కృష్ణ 16-2-58-0, వాషింగ్టన్ సుందర్ 16-2-38-0.






కామెంట్లు (0)