ఎస్‌ఎయు విద్యార్థిపై సామూహిక లైంగిక దాడి
న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. డబుల్ ఇంజిన్ బిజెపి ప్రభుత్వ ఏలుబడిలో అఘాయిత్యాలు, ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా దక్షిణాసియా విశ్వవిద్యాలయం (ఎస్‌ఎయు) విద్యార్థిపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత విద్యార్థి ఆదివారం నుంచి కనిపించడం లేదని సహచరులు ఎస్‌ఎయు యాజమాన్యానికి సమాచారం అందించినా..పట్టించుకోలేదు. చివరికి ఆమెను సోమవారం విశ్వవిద్యాలయ ప్రాంగంణంలోనే గాయాలతో గుర్తించారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని తెలుసుకున్న విద్యార్థులు ఎస్‌ఎయు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వద్ద మంగళవారం ఆందోళన చేపట్టారు.
యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యహరించారని, పోలీసులకు సమాచారం ఇవ్వడంలో జాప్యం చేశారని విద్యార్థులు వాపోయారు. ఈ ఘటనపై మైదాన్ గర్హి పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని డిసిపి (సౌత్) అంకిత్ చౌహాన్ తెలిపారు. ఢిల్లీలో ఈ ఏడాది ఆగస్టులో ఒక ప్రైవేటు స్విమ్మింగ్ పూల్ వద్ద తొమ్మిదేళ్ల వయస్సు ఉన్న ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అదే నెలలో 24 ఏళ్ల మహిళకు మత్తు మందు ఇచ్చి కొంతమంది వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఢిల్లీలో వరుసగా చోటుచేసుకుంటన్న అఘాయిత్యాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.