Tuesday, March 17, 2026
E-PAPER
Homeక్రైమ్నార్సింగిలో దారుణం

నార్సింగిలో దారుణం

- Advertisement -

– బాలికపై లైంగికదాడి, హత్య
– చాక్లెట్‌తో నమ్మించిన కామాంధుడు
– పోలీసుల అదుపులో నిందితుడు
నవతెలంగాణ గండిపేట్‌

రంగారెడ్డి జిల్లా నార్సింగిలో దారుణం చోటుచేసుకుంది. బాలికపై ఓ కామాంధుడు లైంగికదాడి చేసి, ఆపై ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నార్సింగ్‌ ఏసీపీ రమణగౌడ్‌, నార్సింగ్‌ సీఐ హరికృష్ణారెడ్డి మీడియాకు వెల్లడించారు. నార్సింగి పరిధిలో పలు లేబర్‌ క్యాంపులు ఉన్నాయి. ఈ క్యాంపులో ఉన్న ఓ దంపతులకు ఐదేండ్ల పాప ఉంది. ఆదివారం బాలికను ఇంటి వద్దే ఉంచి, కూలీకి వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూసే సరికి బాలిక కనిపించలేదు. బాలిక కోసం చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దాంతో రాత్రి 10గంటలకు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డీఐ రాజేష్‌, సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారు. మొత్తం నలుగురు ఎస్‌ఐలు వేరు వేరు బృందాలుగా ఏర్పడి.. బాలిక కోసం గాలింపు చేపట్టారు. చుట్టుపక్కల ఉన్న సీసీకెమెరాలను పరిశీలించిన పోలీసులకు కొన్ని టెక్నికల్‌ ఆధారాలు లభించాయి. ఓ వ్యక్తి బాలికను తీసుకెళ్లినట్టు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు విషయం బయట పడింది. బాలిక ఇంటికి సమీపంలో పుపాల్‌గూడ ప్రాంతానికి చెందిన తాపీ మెస్త్రీ బిస్వా ఓరా.. బాలికకు చాక్లెట్ల ఆశ చూపి తీసుకెళ్లాడు. లేబర్‌ క్యాంపుకు కిలో మీటర్‌ దూరంలో ఉన్న ప్రాంతంలో బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం ఈ విషయం కుటుంబ సభ్యులకు చెబుతుందని భావించి, అక్కడే గొంతు నులిమి, రాయితో మోదీ హత్య చేశాడు. నిందితుడు.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిందితుడిని తీసుకుని ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బాలిక కుటుంబ సభ్యులను పిలిపించి, ఆ మృతదేహం బాలికదేనని నిర్ధారణ చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. 24గంటల్లోనే కేసును చేదించిన పోలీసులను ఏసీపీ అభినందించారు. నార్సింగి పరిధిలో ఉన్న లేబర్‌ క్యాంపుల్లో వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 27 వేల మంది వలస కూలీలు ఉన్నారని ఏసీపీ తెలిపారు. సరైన భద్రత లేకపోవడంతోనే ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నామన్నారు. భవిష్యత్‌లో రక్షణా చర్యలు చేపడతామని, ఇప్పటికే సీసీ కెమెరాలు సైతం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు ఏసీపీ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -