– మద్యంమత్తులో భార్య, పిల్లలపై దాడి
– తల్లి, కొడుకు మృతి.. కొన ఊపిరితో కూతురు
నవతెలంగాణ-ఆమనగల్
కంటికి రెప్పలా కుటుంబాన్ని కాపాడాల్సిన ఇంటి పెద్ద.. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి రోకలి బండతో భార్య, ఇద్దరు పిల్లలపై దాడి చేశాడు. పాల్పడ్డాడు. ఘటనా స్థలంలోనే తల్లి, కొడుకు మృతిచెందగా.. కూతురు కొన ఊపిరితో ఉంది. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం పులిగోనిపల్లి తాండాలో సోమవారం రాత్రి జరిగింది. క్షణికావేశంలో నరమేధం సృష్టించిన ఈ ఘటన తాండాలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతారాంనగర్ తాండా గ్రామ పంచాయతీ పరిధిలోని పులిగోనిపల్లి తాండాకు చెందిన బాణావత్ రాందాస్‌నాయక్ ఆమనగల్ సూర్యలక్ష్మీ కాటన్ మిల్లులో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతని భార్య కవిత(32) కూలి పనికి వెళ్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేది. వారికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు సంతానం. ఇద్దరు కుమార్తెలు పావని, పవిత్ర ఆమనగల్ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. కుమారుడు, చిన్న కూతురు తల్లిదండ్రుల వద్ద ఉన్నారు. కాగా, రాందాస్ మద్యం తాగి తరచూ భార్యతో గొడవపడుతూ ఉండేవాడు. రోజు మాదిరిగానే సోమవారం రాత్రి రాందాస్ అతిగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. రాందాస్‌నాయక్ క్షణికావేశంలో భార్య, కుమారుడు హర్షిత్(6), కూతురు ప్రణీతపై రోకలి బండతో బలంగా బాదాడు. తీవ్రంగా గాయపడిన భార్య, కుమారుడు ఘటనాస్థలంలోనే మృతిచెందారు. ప్రణీత పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రాందాస్‌నాయక్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అదేవిధంగా తల్లి, కొడుకు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. మహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి, ఆమనగల్ సీఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రణీత వైద్య ఖర్చుల నిమిత్తం తన వంతు తక్షణ సహాయంగా బాధిత కుటుంబానికి ఏసీపీ జానకిరెడ్డి రూ.5వేలు అందజేశారు. మృతురాలి సోదరి చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
పులిగోనిపల్లితండాలో దారుణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



