Sunday, March 8, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయందాడి - ప్రతిదాడి

దాడి – ప్రతిదాడి

- Advertisement -

రెండో వారానికి చేరిన యుద్ధం
– జనావాసాలపై ఇజ్రాయిల్‌, అమెరికా దాడులు
– ప్రతిగా గల్ఫ్‌ దేశాల్లోని అమెరికన్‌ సైనిక క్షేత్రాలపై విరుచుకుపడుతున్న ఇరాన్‌
– అమెరికాకు చెందిన అతిపెద్ద రాడార్‌ వ్యవస్థ ధ్వంసం
– మెహ్రాబాద్‌ ఎయిర్‌పోర్టుపై ఇజ్రాయిల్‌ దాడి
– ప్రతిగా సౌదీ ఎయిర్‌బేస్‌ను ధ్వంసం చేసిన టెహ్రాన్‌
– క్షిపణిదాడులతో దద్ధరిల్లుతున్న పశ్చిమాసియా


మధ్యప్రాచ్యంలో ఇరాన్‌-ఇజ్రాయిల్‌, అమెరికా దేశాల మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఈ యుద్ధం శనివారంనాటికి రెండో వారంలోకి ప్రవేశించింది. అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాల దాడుల్ని ఇరాన్‌ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. అదే సందర్భంలో ప్రతిదాడులతో ఆ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గల్ఫ్‌ దేశాల్లోని అమెరికన్‌ సైనికస్థావరాలే లక్ష్యంగా డ్రోన్లతో టెహ్రాన్‌ విరుచుకు పడుతోంది. ఆ ధాటికి గల్ఫ్‌ దేశాలు భీతిల్లుతున్నాయి. యుద్ధ విరమణ కోసం క్రమంగా అమెరికాపై వత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.

(నవతెలంగాణ – సెంట్రల్‌ డెస్క్‌)
పశ్చిమాసియాలో యుద్ధం జ్వాలలు మరింతగా ఎగిసిపడుతు న్నాయి. శనివారం కూడా క్షిపణుల దాడులతో దద్ధరిల్లాయి ఇరాన్‌ రాజ ధాని టెహ్రాన్‌, ఇస్ఫహా న్‌లపై ఇజ్రా యిల్‌ తాజాగా దాడులు జరిపింది. ఇజ్రాయిల్‌ వైమానిక దాడుల కార ణంగా టెహ్రాన్‌లోని ప్రధాన వాణిజ్య ఎయిర్‌పోర్టుల్లో ఒకటైన మెహ్రాబాద్‌ అంతర్జాతీయ విమానా శ్రయంలో భారీగా మంటలు వ్యాపిం చాయి. పేలుళ్ల ధాటికి విమానాశ్రయం రన్‌వేపై ఉన్న అనేక విమానాలు తగల బడ్డాయని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో పేలుడు శబ్దాలు వినిపించాయి. ఆకాశంలో దట్టమైన పొగలు అలముకున్నాయి. భూకంపం వచ్చినట్టు జనావాసాలు ఊగిపోయాయి. శుక్రవారం రాత్రంతా దాడులు జరుగుతూనే ఉన్నాయి. క్షిపణి స్థావరాలకు కేంద్రమైన కెర్మన్‌షా నగర పరిసరాల్లో కూడా పేలుళ్లు సంభ వించాయి. టెహ్రాన్‌, సెంట్రల్‌ ఇరాన్‌ లోని క్షిపణి లాంఛర్లు, ఇతర లక్ష్యాలపై తాజాగా 80 యుద్ధ విమానాలు దాడి చేశాయని ఇజ్రాయిల్‌ సైన్యం తెలిపింది. టెహ్రాన్‌లోని భూగర్భ సైనిక బంకర్‌ను యాభై జెట్‌ విమానాలు ధ్వంసం చేశాయని ఇజ్రాయిల్‌ రక్షణ దళం ప్రకటించింది. ఈ బంకర్‌ ఇరాన్‌ సుప్రీం నేత ఖమేనీకి చెందిన భవన సము దాయాల కింద ఉంది. కాగా ఇరాన్‌పై బాంబు దాడులను ముమ్మరం చేస్తానని అమెరికా హెచ్చరించింది. నిన్నటి వరకూ సైనిక స్థావరాలు, రాజకీయ కేంద్రాల పైనే దాడులు చేసిన ఇజ్రా యిల్‌, అమెరికా సేనలు ఇప్పుడు జనావాసాలు, పాఠశాలలు, ఆస్పత్రులను కూడా వదలడం లేదు. తమ దేశంలోని జనావాసాలపై దాడులు చేస్తున్నారని, ఇది యుద్ధ నేరాల కిందికే వస్తుందని ఐరాసలో ఇరాన్‌ రాయబారి అమిర్‌-సయీద్‌ ఇరావనీ భద్రతా మండలికి ఫిర్యాదు చేశారు. దేశాన్ని కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’లో భాగంగా అమెరికా ఇప్పటి వరకూ ఇరాన్‌లోని మూడు వేల లక్ష్యాలపై దాడులు జరిపింది. లెబనాన్‌లోని హెజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని బీరుట్‌లో ఇజ్రాయిల్‌ దాడులు కొనసాగుతున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సిందిగా ఇజ్రాయిల్‌ హెచ్చరిస్తోంది. బాంబు దాడులు ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకూ మూడు లక్షల మంది ప్రజలు ప్రాణభయంతో వేరే ప్రాంతాలకు చేరుకున్నారు.

ఇరాన్‌ భీకర దాడులు …గల్ఫ్‌లో తీవ్రమైన పోరు
మరోవైపు ఇరాన్‌ కూడా ఇజ్రాయిల్‌పై క్షిపణులతో విరుచుకుపడింది. టెల్‌ అవీవ్‌లో అనేక పేలుడు శబ్దాలు వినిపించాయి. దక్షిణ ప్రాంతం వైపు కూడా క్షిపణులు దూసుకొచ్చాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి తమ దేశంపై ప్రయోగించిన కనీసం ఐదు బాలిస్టిక్‌ క్షిపణులను గుర్తించామని ఇజ్రాయిల్‌ చెప్పింది. ఇరాన్‌ దాడులతో బెంబేలెత్తిపోతున్న వేలాది మంది ఇజ్రాయిలీలు షెల్టర్లలో కాలం గడుపుతున్నారు. జెరుసలేంలో కూడా పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయని ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు చెందిన పాత్రికేయులు తెలిపారు. గల్ఫ్‌ దేశాలలోని అమెరికా ఆస్తులపై దాడులను ఇరాన్‌ తీవ్రతరం చేసింది. గల్ఫ్‌లో ఓ చమురు ట్యాంకర్‌పై దాడి చేశామని ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ తెలిపారు. నిషేధాజ్ఞల గురించి నౌకా దళాలు పదే పదే చేసిన హెచ్చరికలను ‘ప్రైమా’ అనే ఆ నౌక పట్టించుకోలేదని చెప్పారు. సౌదీ అరేబియా, ఖతార్‌, యూఏఈ, బెహ్‌రైన్‌లపై ఇరాన్‌ దాడులు పెరగడంతో ప్రజలను అప్రమత్తం చేస్తూ సైరన్లు మోగించారు. అల్‌-ఖర్జ్‌లోని ప్రిన్స్‌ సుల్తాన్‌ వైమానిక స్థావరం వైపు వచ్చిన రెండు బాలిస్టిక్‌ క్షిపణులను అడ్డుకున్నామని సౌదీ అరేబియా తెలిపింది. షెబా చమురు క్షేత్రంపై ఇరాన్‌ ప్రయోగించిన ఆరు డ్రోన్లను కూడా నిలువరించామని చెప్పింది. ఖతార్‌పై కూడా డ్రోన్ల దాడి ఉధృతమైంది. ఇరాన్‌ ప్రయోగించిన పది డ్రోన్లలో తొమ్మిదింటిని కూల్చివేశామని ఖతార్‌ రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. యూఏఈపై ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. బహ్రెయిన్‌ రాజధాని మనామా, దుబాయిల్లో కూడా బాంబు పేలుళ్లు జరిగాయి. బహ్రెయిన్‌లో సైరన్లు మోగుతున్నాయి. ఇరాక్‌లోని బస్రాలో అమెరికాకు చెందిన కార్యాలయాలు, గిడ్డంగులపై డ్రోన్‌ దాడి జరగడంతో మంటలు వ్యాపించాయి. ఇరాన్‌ దాడులను ఎలా అడ్డుకోవాలన్న విషయంపై చర్చించేందుకు సౌదీ అరేబియా రక్షణ మంత్రి, పాకిస్తాన్‌ సైనిక దళాల అధిపతి సమావేశమయ్యారు.

ఇరాన్‌కు రష్యా ఇంటెలిజెన్స్‌ సాయం : అమెరికా
ఇరాన్‌ బేషరతుగా లొంగిపోని పక్షంలో ఆ దేశంతో చర్చలు జరపబోనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేసిన తర్వాత ఇజ్రాయిల్‌కు 151.8 మిలియన్‌ డాలర్ల విలువ కలిగిన ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మధ్యప్రాచ్యంలోని తమ సైనిక స్థావరాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్‌ సమాచారాన్ని ఇరాన్‌కు రష్యా చేరవేస్తోందని అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సేథ్‌ ఆరోపించారు. ఎవరు ఎవరితో మాట్లాడుతున్నదీ ట్రంప్‌నకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయంపై తామేమీ ఆందోళన చెందడం లేదన్నారు. కాగా మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న చట్టవిరుద్ధ దాడులను ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ ఖండించారు. ప్రాంతీయ పోరు అనేక ఇతర దేశాలకు కూడా పాకుతుండడంతో పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఉన్నదని ఆయన హెచ్చరించారు. ఇదిలావుండగా గత వారం రోజులుగా కొనసాగిన యుద్ధం కారణంగా మరణించిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇరాన్‌లో కనీసం 1,230 మంది, లెబనాన్‌లో 200 మంది చనిపోయారని అంచనా. ఆరుగురు అమెరికా సైనికులు కూడా మరణించారు.

పొరుగు దేశాలకు ఇరాన్‌ ‘సారీ’
పొరుగు దేశాలు తమపై దాడులు చేసిన పక్షంలో మాత్రమే ప్రతి దాడులు చేస్తామని ఇరాన్‌ తెలిపింది. పొరుగు దేశాలపై జరుపుతున్న దాడులకు ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ క్షమాపణలు చెప్పారు. ‘ఇరాన్‌ వైపు నుంచి జరిగిన దాడులకు పొరుగు దేశాలకు క్షమాపణలు చెబుతున్నా’ అని అన్నారు. ఆయా దేశాల నుంచి దాడులు జరగకపోతే ప్రతి దాడులు జరపరాదని, క్షిపణులు ప్రయోగించరాదని తాత్కాలిక నాయకత్వ మండలి నిర్ణయించిందని తెలిపారు. యుద్ధానికి ముగింపు పలకడానికి మధ్యవర్తిత్వం వహించేందుకు కొన్ని దేశాలు ముందుకు వచ్చాయనీ, అయితే ఘర్షణలు ప్రారంభించిన వారితోనే చర్చలు మొదలవ్వాలని ఆయన చెప్పారు. శనివారం ఆయన ఇరాన్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆధిపత్య శక్తులకు ఎక్కడా తలొగ్గేది లేదని తేల్చిచెప్పారు.

కుర్దిస్థాన్‌లోని వేర్పాటువాద గ్రూపులపై ఇరాన్‌ దాడులు
ఇరాక్‌లోని కుర్దిస్థాన్‌లో వేర్పాటువాద గ్రూపులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపామని ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ తెలిపారు. శనివారం ఉదయం మూడు ప్రాంతాలపై దాడులు జరిగాయని చెప్పారు. కుర్దిస్థాన్‌లోని వేర్పాటువాద గ్రూపులు ఇరాన్‌ ప్రాదేశిక సమగ్రతకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యకు పాల్పడినా అణచివేస్తామని హెచ్చరించారు.

నేడు అరబ్‌లీగ్‌ మంత్రుల సమావేశం
సభ్యదేశాలపై ఇరాన్‌ జరుపుతున్న దాడుల గురించి చర్చించేందుకు అరబ్‌ లీగ్‌ విదేశాంగ మంత్రులు ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నారు. కువైట్‌, సౌదీ అరేబియా, ఖతార్‌, ఒమన్‌, జోర్డాన్‌, ఈజిప్ట్‌ దేశాల అభ్యర్థన మేరకు ఈ భేటీ జరుగుతోంది.

అమెరికా దళాల కోసం ఎదురు చూస్తున్నాం : ఇరాన్‌ గార్డ్స్‌
హర్మూజ్‌ జలసంధిలో నౌకలకు రక్షణగా వచ్చే అమెరికా దళాల కోసం ఎదురు చూస్తున్నామని ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ తెలిపారు. జలసంధిలో ప్రయాణించే నౌకలకు రక్షణ కల్పించడానికి తమ నౌకా దళం సిద్ధంగా ఉన్నదంటూ అమెరికా ఇంధన మంత్రి చేసిన ప్రకటనపై రివల్యూషనరీ గార్డ్స్‌ ప్రతినిధి అలీ మహమ్మద్‌ నైనీ స్పందిస్తూ ‘నిర్ణయం తీసుకునే ముందు వారు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. 1987లో అమెరికా సూపర్‌ట్యాంకర్‌ బ్రిడ్జిటన్‌ మంటల్లో ఎలా చిక్కుకున్నదో, ఇటీవల చమురు ట్యాంకర్లపై ఎలా దాడులు జరిగాయో వారు గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది’ అని వ్యాఖ్యానించారు.

అమెరికాపై గల్ఫ్‌ దేశాల అసంతృప్తి
ఇరాన్‌పై యుద్ధం జరపబోతున్న విష యాన్ని అమెరికా తమకు ముందుగా తెలియజేయనందుకు గల్ఫ్‌ దేశాలు అసం తృప్తి వ్యక్తం చేశాయి. యుద్ధం వినాశ నానికి దారితీస్తుందంటూ తాము చేసిన హెచ్చరికలను అమెరికా పట్టించుకోలేదని మండిపడ్డాయి. దక్షిణ ఇరాన్‌లోని ఓ పాఠశాలపై జరిగిన దాడికి అమెరికాయే బాధ్యురాలని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక పరిశోధనలో తేలింది. ఖమేనీ వారసుడి ఎంపికలో తన ప్రమేయం ఉంటుందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రకటనను ఐరాసలో ఇరాన్‌ రాయబారి ఇరావనీ ఖండించారు. తమ ఆంతరంగిక వ్యవహారాలలో జోక్యం చేసుకునేందుకు ఎవరినీ అనుమతించబోమని తేల్చిచెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -