యావత్ దేశం ఐక్యంగా మతోన్మాద, మనువాదాన్ని అడ్డుకోవాలి : ఏఐఏడబ్ల్యూయూ ఆలిండియా ప్రధాన కార్యదర్శి బి వెంకట్
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీ.ఆర్. గవాయ్ పై జరిగిన దాడి రాజ్యాంగం, దేశంపై జరిగిన దాడిగా చూడాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) ఆలిండియా ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ అన్నారు. మతోన్మాదులు, మనువాదులు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయటంతో దేశ రాజ్యాంగాన్ని ఏమైనా చేయగలమనే ఉన్మాదానికి తెగించారని విమర్శించారు. అంగన్వాడీ అఖిల భారత సమావేశంలో వెంకట్ పాల్గొని మాట్లాడారు. బీ.ఆర్. గవాయ్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ ఘటన ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన ఒకవ్యకి చేసింది కాదని, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న మనువాద సంస్కతి, భావజాల ఆధిపత్యం నుండి జరిగిందిగా చూడాలని అన్నారు. మొక్కై వంగనదే, మానై వంగునా అన్నట్లుగా చీఫ్ జస్టిస్ భాద్యతలు చేపట్టిన వెంటనే మహారాష్ట్ర పర్యటనకు వెళ్లినప్పుడే ఫోటోకాల్ పాటించకుండా బీజేపీ ప్రభుత్వం అవమాన పరిచిందని గుర్తు చేశారు. అప్పుడే బీజేపీ నేతలపై చర్యలు తీసుకోని ఉంటే ఈ ఉన్మాదుడు ఇంతకు భరితెగించేవాడు కాదని అన్నారు.
మనువాదులు, ఆధిపత్య వర్గాలు తాము ఏమీ చేసిన ప్రభుత్వ అండ ఉందనే ధైర్యంతో విర్రవీగుతున్నారని విమర్శించారు. సిందూర్ ఘటన సమయంలో మధ్యప్రదేశ్ మంత్రి వ్యాఖ్యల విషయంలో బీజేపీ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించాయని విమర్శించారు. అందుకే ఇప్పుడు అత్యున్నత న్యాయాధికారిపైనే దాడి చేయటానికి కూడా మతోన్మాదులు, మనువాదులు వెనకాడలేదని విమర్శించారు. దేశంలో రోజురోజుకు దళితుల, సామాజిక తరగతుల ఉన్నతిని ఆదిపత్య భావజాలం కలిగిన ఉన్మాదులు సహించలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యావత్ సమాజం ఈ దాడిని ముక్త కంఠంతో ఖండించిచాలని అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఐత్యతతో మనువాదాన్ని, మతోన్మాద శక్తులను ఎదిరించి రాజ్యాంగాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు.