Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఢిల్లీ సీఎంపై దాడి

ఢిల్లీ సీఎంపై దాడి

- Advertisement -

నిందితుడు జంతు ప్రేమికుడు
దర్యాప్తు సాగిస్తున్న పోలీసులు
బీజేపీ, ఆప్‌ల మాటల యుద్ధం
న్యూఢిల్లీ :
ప్రజల నుంచి ఫిర్యాదులు అందుకునేందుకు ప్రతీ వారం నిర్వహిస్తున్న ‘జన్‌ సున్‌వాయి’ కార్యక్రమంలో పాల్గొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై బుధవారం దాడి జరిగింది. సివిల్‌ లైన్స్‌లోని ముఖ్యమంత్రి అధికార నివాసం వద్ద ఈ కార్యక్రమం జరుగుతోంది. ఆ సందర్భంగా నిందితుడు దగ్గరగా వచ్చి ఏవో పత్రాలు అందించి ఒక్కసారిగా ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆమె చేతిని పట్టుకుని తన వైపునకు గుంజాడు. ఈ సందర్భంగా కొన్ని తోపులాటలు జరిగాయి. అక్కడున్న వారు వెంటనే ఆ వ్యక్తిని పట్టుకున్నారు. అనుకోని ఈ చర్యతో ముఖ్యమంత్రి దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. దాడి జరిపిన వ్యక్తిని పోలీసులు రాజేష్‌ భాయి ఖిమ్‌జీ భాయి సకారియా (42)గా పోలీసులు గుర్తించారు. రాజ్‌కోట్‌ నివాసి అని చెప్పారు. వెంటనే దర్యాప్తు చేపట్టారు. రాజ్‌కోట్‌లో గల నిందితుడి తల్లిని గుజరాత్‌ పోలీసులు ప్రశ్నించారు. తన కుమారుడు ఆటో రిక్షా డ్రైవర్‌ అని, జంతు ప్రేమికుడని, ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని ఆమె తల్లి చెప్పారు. వీధి కుక్కలపై ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల తన కుమారుడు తీవ్ర అసంతృప్తితో వున్నాడని ఆమె తెలిపారు. అందుకే నిరసన తెలియచేయడానికి ఢిల్లీకి వెళ్లాడని చెప్పారు. కాగా ఏం జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు సిసిటివి ఫుటేజీ చూస్తున్నారు. ఈ దాడి వెనుక గల ఉద్దేశ్యాలను తెలుసుకోవడానికి ఆ వ్యక్తిని ప్రశ్నిస్తున్నారు. పోలీసు కమిషనర్‌ ఎస్‌.బి.కె.సింగ్‌ నేరుగా సీఎం నివాసానికి వెళ్ళి మాట్లాడారు.
మా స్ఫూర్తిని దెబ్బతీయలేరు
”ఇది తనపై జరిగిన దాడి కాదని, ఢిల్లీకి, ప్రజలకు మంచిగా సేవలందించాలన్న తమ కృతనిశ్చయంపై జరిగిన పిరికిపంద దాడి” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇలాంటి దాడులు తన స్ఫూర్తిని దెబ్బతీయలేవని ఆమె పేర్కొన్నారు. దాడి జరిగిన వెంటనే తాను షాక్‌లో వుండిపోయానన్నారు. ఇప్పుడు బానే వుందని చెప్పారు. తన గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆమె ఎక్స్‌లో పోస్టు పెట్టారు. త్వరలోనే విధులకు హాజరవుతానని చెప్పారు. కాగా ఈ దాడిని బీజేపీ ఖండించింది. ముఖ్యమంత్రి తలకు స్వల్పంగా గాయమైందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ చెప్పారు. తలకు తేలికపాటి దెబ్బ తగిలింది. అంతేగానీ ఆమెను కొట్టారు, రాళ్ళు విసిరారు అని వస్తున్న వార్తలు నిరాధారమని చెప్పారు. రాజకీయాల్లో ఇలాంటి సంఘటనలు ఖండించదగినవని అన్నారు.
బీజేపీ వర్సెస్‌ ఆప్‌ !
ముఖ్యమంత్రిపై దాడి వ్యవహారం కాస్తా బీజేపీ, ఆప్‌ మధ్య గొడవగా మారిపోయింది. ముఖ్యమంత్రి డ్రామా ఆడుతున్నారని కిరారి ఆప్‌ ఎంఎల్‌ఏ అనీల్‌ ఝా విమర్శించారు. దాడి కథ సృష్టించడానికి ముఖ్యమంత్రే అక్కడ ఆ వ్యక్తిని పెట్టారని, అంతేగానీ దాడేమీ జరగలేదని ఝా అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ”ఇదేనా మీ అధికార వైఖరి? దాడేమీ జరగలేదు, ముఖ్యమంత్రి డ్రామా సృష్టించారని మీ ఎంఎల్‌ఏ అంటున్నారు. మీరెందుకు దాడిని ఖండించలేదు? ఇలాంటి చర్యల్లో పాల్గొన్న చరిత్ర మీకుంది కాబట్టి ఆప్‌ కుట్ర దీని వెనుక వుండవచ్చని నాకనిపిస్తోంది.” అంటూ ఢిల్లీ బీజేపీ కార్యదర్శి హరీష్‌ ఖురానా ఎక్స్‌లో పోస్టు పెట్టారు. దాన్ని ఆప్‌ చీఫ్‌ కేజ్రివాల్‌కు ట్యాగ్‌ చేశారు. రేఖాగుప్తా తనకు 27ఏండ్ల నుంచి తెలుసునని, తాను కూడా గతంలో బీజేపీలో వుండేవాడినని ఝా పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనకు ఒక సంఘటన గుర్తుకువస్తోందన్నారు. విద్యార్ధి సంఘానికి ఆమె అధ్యక్షురాలిగా,తాను ఉపాధ్యక్షుడిగా వున్నపుడు విదేశీ బ్యూటీ ఉత్పత్తులకు వ్యతిరకంగా నిరసన నిర్వహిస్తున్నామని, ఆసమయంలో ఆమె తన వెంట్రుకలను కొన్నింటిని కాల్చాల్సిందిగా తనను కోరిందని ఝా గుర్తు చేసుకున్నారు. అందాల ఉత్పత్తులను దగ్ధం చేస్తున్నపుడు తానుగాయపడినట్లు చూపేందుకే ఆమె అలా చేయమన్నారని, కాబట్టి ఆమెకు ఇలాంటివేమీ కొత్త కాదని ఝా చెప్పారు. ఆమెను, బీజేపీని నాటకాల కంపెనీ, చోర్‌ మేనేజర్‌గా ఆయన అభివర్ణించారు. దాడికి పాల్పడిన నిందితుడు ఆప్‌ గుజరాత్‌ ఎంఎల్‌ఏ గోపాల్‌ ఇటాలియా పక్కనే నిలుచున్న ఫోటోను బీజేపీ ఢిల్లీ ఎంఎల్‌ఏ హరీశ్‌ ఖురానా ఎక్స్‌లో పంచుకున్నారు. ఆ నిందితుడికి ఆప్‌తో సంబంధాలున్నాయని ఖురానా ఆరోపించారు. దానిపై ఆప్‌ తీవ్రంగా స్పందించింది. ఏఐని ఉపయోగించి ఈ ఫోటోను సృష్టించారని విమర్శించింది.
ఆప్‌ నేతల ఖండనలు
కేజ్రివాల్‌ ట్వీట్‌ చేస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో వివిధ రకాల అభిప్రాయాలు, విభేదాలు, వ్యతిరేకతలు అన్నీ ఆమోదయోగ్యమైనవే, కానీ హింసకు తావు లేదు, ఢిల్లీ పోలీసులు త్వరలోనే నిందితులపై తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిషి స్పందిస్తూ, రాజకీయాల్లో హింసకు తావు లేదన్నారు. అందువల్లే తాము ఈ దాడిని ఖండిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రికే రక్షణ లేకపోతే ఇక సాధారణ మహిళలకు రక్షణ ఏదని ప్రశ్నించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad