Saturday, July 26, 2025
E-PAPER
Homeజాతీయంముమ్మాటికీ ప్రజాస్వామ్యంపై దాడి

ముమ్మాటికీ ప్రజాస్వామ్యంపై దాడి

- Advertisement -

ఎస్‌ఐఆర్‌ను వెనక్కి తీసుకోవాలి : పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రతిపక్షాల నినాదాల హౌరు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

బీహార్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)ను వెనక్కి తీసుకోవాలని పార్లమెంట్‌ ఉభయ సభల్లో నినాదాల హౌరెత్తాయి. ఇదిముమ్మాటికి ప్రజాస్వామ్యంపై దాడి అంటూ అధికారపక్షాన్ని నిలదీశారు. దీంతో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నాలురోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే వాయిదా పడ్డాయి. ప్రతిపక్ష ఎంపీల నిరసనలు కొనసాగడంతో సమావేశాలో గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయి. సభా కార్యకలాపాలకు తీవ్ర అవరోధం ఏర్పడడంతో రాజ్యసభ, లోక్‌సభ శుక్రవారానికి వాయిదా పడ్డాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. దీంతో వెంటనే ప్రతిపక్ష సభ్యులు బీహార్‌లో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ఓటర్ల జాబితాపై చర్చను నిర్వహించాలని ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేబూని ప్రతిపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి, ఈసీకి వ్యతిరేకంగా నినాదాలతో హౌరెత్తించారు. వాయిదా తీర్మానాలపై చర్చించాలని డిమాండ్‌ చేశారు. బీహార్‌ ఓటర్ల జాబితా సవరణపై చర్చకు పట్టుబట్టారు. స్పీకర్‌ ఓం బిర్లా ప్లకార్డులు ఉపయోగించడం, సభలోని వెల్‌లలోకి దూసుకెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రవర్తన పార్లమెంటరీకి విరుద్ధమని, ప్రజా ధనాన్ని వృధా చేయాలనే ఉద్దేశ్యాన్ని ప్రదర్శించిందని ఆయన అన్నారు. అయినప్పటికీ ఎంపీలు తమ ఆందోళన కొనసాగించారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో నిమిషాల్లోనే మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా వేశారు. అయితే తిరిగి ప్రారంభమైన సభలో అదే పరిస్థితి కొనసాగింది. దీంతో సభను నిమిషాల్లోనే శుక్రవారానికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. ప్రతిపక్ష సభ్యుల నిరసనల మద్యే రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్‌ హరివంశ్‌ నారాయణ్‌ నిబంధన 267 కింద సభ్యులు సమర్పించిన నోటీసులను అనుమతించడానికి నిరాకరించారు. గురువారం రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేస్తున్నందున సభా కార్యకలాపాలు కొనసాగించడానికి అనుమతించాలని సభ్యులను డిప్యూటీ చైర్మెన్‌ సభ్యులను కోరారు. రాజ్యసభలో పదవీ విరమణ చేసిన సభ్యులకు వీడ్కోలు పలికారు. ఎం. మొహమ్మద్‌ అబ్దుల్లా, ఎన్‌. చంద్రశేఖరన్‌, ఎం. షణ్ముగం, వైకో, పి. విల్సన్‌ ల పదవీకాలం ముగియడంతో సభలో తమ అనుభవాలను సభతో పంచుకున్నారు. అనంతరం ప్రతిపక్ష సభ్యులు నిరసన కొనసాగించారు. ప్యానల్‌ చైర్మెన్‌ భువనేశ్వర్‌ కలిత సముద్రపు వస్తువుల రవాణా బిల్లుపై మాట్లాడాలని అన్నాడీఎంకే సభ్యులు ఎం. తంబిదురైకి సూచించారు. ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ”ఎస్‌ఐఆర్‌ను వెనక్కి తీసుకోండి” అని నినాదాలు చేశారు. నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష సభ్యులను మాట్లాడటానికి అనుమతి నిరాకరించారు. సభలో మాట్లాడటానికి అవకాశం కావాలంటే, వెళ్లి తమ స్థానాల్లో కూర్చోవాలని సూచించారు.

పార్లమెంట్‌ ఆవరణంలో ప్రతిపక్షాలు ఆందోళన
పార్లమెంట్‌ ఆవరణలో ఇండియా బ్లాక్‌ ఎంపీలు ఆందోళనకు దిగారు. గురువారం పార్లమెంట్‌ మకరద్వారం వద్ద బీహార్‌లో కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివ్యూ (ఎస్‌ఐఆర్‌) పేరుతో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు. ప్లకార్డులు చేతపట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీ సహా డీఎంకే, టీఎంసీ, ఆర్‌జేడీ, ఎన్‌సీపీ, సీపీఐ(ఎం), ఎస్‌పీ, సీపీఐ, జేఎంఎం తదితర ఇండియా బ్లాక్‌ ఎంపీలు పాల్గొన్నారు.


మోసం చేయడానికి ఈసీ అనుమతిస్తుంది 100 శాతం రుజువు చూపిస్తా
ఈ తప్పుల నుంచి మీరు తప్పించుకోలేదు పార్లమెంట్‌ ఆవరణలో మీడియాతో రాహుల్‌ గాంధీ
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మోసం చేయడానికి అనుమతిస్తుందని ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. గురువారం పార్లమెంట్‌ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. కర్నాటకలోని ఒక నియోజకవర్గంలో ఈసీ చీటింగ్‌ చేయడానికి అనుమతించిందని, అందుకు సంబంధించిన 100 శాతం ఆధారం తమ వద్ద ఉందని పేర్కొన్నారు. కర్నాటకలో తాము ఒక నియోజకవర్గాన్ని పరిశీలించగా, వేల సంఖ్యలో అర్హత లేని కొత్త ఓటర్లను ఎన్నికల సంఘం జాబితాలో చేర్చినట్టు గుర్తించామని అన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. కొన్ని నియోజకవర్గాల్లో కొత్త ఓటర్లు 45, 50, 60, 65 వే ల మంది వరకు ఉంటున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఓటర్ల తొలగింపు, ఓటర్ల చేరిక, 18 ఏండ్లకు పైబడిన కొత్త ఓటర్లు విషయంలో జరుగుతోందని, తాము వారిని పట్టుకున్నామని అన్నారు. ”90 శాతం కాదు, 100 శాతం రుజువు చూపిస్తాం” అని అన్నారు. బీహార్‌లో కూడా ఇప్పుడు ఇదే విధమైన మోసానికి ఈసీ పాల్పడుతోందని ఆరోపించారు. రాజ్యాంగబద్ద సంస్థ అయిన ఈసీ స్వతంత్రంగా తన పని తాను చేయడం లేదని విమర్శించారు. ఎన్నికల సంఘానికి ఒక సందేశం పంపాలనుకుంటున్నానని, ఈ తప్పుల నుంచి మీరు తప్పించుకోలేరని స్పష్టం చేశారు. ఒకవేళ మేం తప్పించుకుంటామనుకుంటే అది మీ (ఈసీ) పొరపాటేనని, ఎందుకంటే తాము మీ గురించి వస్తామని హెచ్చరించారు. తప్పు చేసిన ఏ ఒక్క అధికారిని వదలిపెట్టమని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -