దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) మరోసారి రక్తంతో తడిసింది. ఇది కేవలం ఒక క్యాంపస్‌పై జరిగిన భౌతికదాడి కాదు. ఇది స్వేచ్ఛాలోచనపై జరిగిన దాడి. ప్రశ్నించే గొంతుకలపై కురిసిన కర్రల వర్షం, సమానత్వం అనే రాజ్యాంగ ఆశయంపై వేసిన కత్తిపోటు. జెఎన్‌యు ఎప్పుడూ భిన్న భావజాలాల సంగమంగా ఉండేది.
కానీ, నేడు అది భిన్న స్వరాలను ముసుగులు ధరించిన మూకలు వేటాడి వేధించే యుద్ధక్షేత్రంగా మార్చింది. ఈ దౌర్జన్యం అకస్మాత్తుగా పుట్టుకొచ్చింది కాదు, ఇది విద్యా సంస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బతీసే ఒక దీర్ఘకాలిక కుట్రలో భాగం. శాంతియుత నిరసన తెలుపుతూ, యూజీసీ నిబంధనల ప్రకారం కుల వివక్షను అరికట్టాలని, అణగారిన వర్గాల హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థులపై అర్ధరాత్రి వేళ దాడి జరగడం వెనుక లోతైన ప్రణాళిక కనిపిస్తోంది.
వీసీ వైఖరి వ్యవస్థాగత అణచివేత
ఈ దాడి కేవలం ఆ క్షణంలో జరిగిన ఘర్షణ కాదు. కొన్నిరోజులుగా విద్యార్థులు క్యాంపస్‌లో కుల వివక్షకు వ్యతిరేకంగా, అప్రజాస్వామిక బహిష్కరణలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. వైస్ ఛాన్సలర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిత్ ఫిబ్రవరి 16న దళిత, శ్రామికవర్గాల మేధో సామర్థ్యాన్ని తక్కువ చేస్తూ చేసిన వ్యాఖ్యలు వెెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. కానీ, వీసీ విద్యార్థి సంఘాలపై కఠిన ఆంక్షలు, విద్యార్థులపై బహిష్కరణలు, పరిపాలనా నిర్ణయాల్లో పారదర్శకత లేకపోవడం, ఒకే వర్గానికి కొమ్ముకాయడం ఇవి క్యాంపస్‌లో విభేదాలను పెంచాయి.
ఒక వీసీగా క్యాంపస్‌లో సమతుల్యతను కాపాడటం, భిన్నాభిప్రాయాలను సమన్వయం చేయడం బాధ్యతగా ఉండాలి. కానీ ఒకే వర్గం వైపు కొమ్ముకాస్తూ ఉద్రిక్తతను పెంచే చర్యలకు విసి కారణంగా ఉంది. సోమవారం తెల్లవారుజామున 1:30 గంటలకు ముసుగులు ధరించి, ఇటుకలు, రాళ్లు, కర్రలతో వచ్చిన ఏబీవీపీ, బయటి నుంచి వచ్చిన శక్తులు ఈ వ్యవస్థాగత హింసను భౌతిక హింసగా మార్చాయి నిరసన నిరసన తెలుపుతున్న విద్యార్థుల వేదిక వద్ద విద్యార్థులు శాంతియుతంగా చర్చిస్తున్న సమయంలో, వీధిదీపాలు ఆపివేసి మరీ దాడికి పాల్పడ్డారన్న వార్తలు భీతిని కలిగిస్తున్నాయి.
రాజ్యం అండతో క్యాంపస్‌లో ఉన్మాదం
ఈ దాడిలో పోలీసులు, వర్సిటీ సెక్యూరిటీ (ఎఐఎస్) పాత్రపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గతంలో 2020లో జరిగిన దాడుల తరహాలోనే, ఇప్పుడు కూడా గూండాలు స్వేచ్ఛగా రాళ్లు రువ్వుతుంటే సెక్యూరిటీ సిబ్బంది మౌనంగా ఉండిపోయారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇది కేవలం భద్రతా వైఫల్యం కాదు, ఇది ‘స్టేట్ స్పాన్సర్డ్ (రాజ్య అండదండలతో కూడిన) అణిచివేత. చర్చల్లో వాదనతో నిలబడలేని వారు మాత్రమే చీకటిలో ముసుగులు వేసుకుని దాడులు చేస్తారు.
ముసుగులు ధరించడం వారి పిరికితనానికి, వారు చేస్తున్నది చట్టవిరుద్ధమని వారికి తెలుసుననడానికి నిదర్శనం. విద్యార్థిలోకాన్ని శత్రువులుగా చూస్తూ, వారిపై క్రిమినల్ శక్తులను ఉసిగొల్పడం ద్వారా క్యాంపస్ రాజకీయాలను కాషాయరంగుతో పూత పూయాలని చూస్తున్నారు. అర్థరాత్రి వేళ వీధి దీపాలు ఆపివేసి మరీ దాడి చేశారంటే, అది యూనివర్సిటీ యంత్రాంగం, పోలీసుల పరోక్ష సహకారం లేకుండా సాధ్యం కాదు. 2020లో జరిగిన దాడుల తరహాలోనే, ఇప్పుడు కూడా పోలీసులు ముసుగు గూండాలకు ‘సేఫ్ పాసేజ’ కల్పించడం గమనార్హం. ఢిల్లీ పోలీసుల కళ్లముందే విద్యార్థుల తలలు పగులుతుంటే, వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న ‘అదృశ్య హస్తం’ ఎవరిదో ఎవరికైనా అర్థమవుతుంది.
ఇది కేవలం విద్యార్థి సంఘాల మధ్య గొడవ కాదు. ఇది రాజ్యం తన అనుబంధ సంస్థలైన ఏబీవీపీ, సంఫ్‌ు పరివార్ శక్తుల ద్వారా విద్యార్థి లోకంపై చేస్తున్న యుద్ధం. పోలీసుల పాత్రపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హింస జరుగుతున్నప్పుడు భద్రతా వ్యవస్థ ఎందుకు నిర్వీర్యంగా కనిపించింది? గతంలో 2020లో జెఎన్‌యులో జరిగిన దాడులపై విచారణలు సాగినా, ప్రధాన నిందితులపై గట్టి చర్యలు తీసుకోలేకపోవడం ఒక ప్రమాదకర సంకేతం ఇచ్చింది దాడిచేసినా తప్పించుకోవచ్చన్న నమ్మకం. అదే సంస్కృతి పునరావృతమవుతోందనే అనుమానం సహజంగా బలపడింది.
జెఎన్‌యులో కషాయమూకల వ్యూహం!
ముసుగులు ధరించడం అనేది ఏబీవీపీ, సంఫ్‌ు పరివార్ శక్తుల పిరికితనానికి అతిపెద్ద సాక్ష్యం. నిజం వైపు నిలబడే దమ్ము లేని వారు, తమ చర్యలను సమర్థించుకోలేని వారు మాత్రమే ముఖాలు దాచుకుని దాడులు చేస్తారు. జెఎన్‌యును చంపాలని, విద్యార్థుల్లో భయవాతావరణం సృష్టించి వారిని ప్రశ్నించకుండా మౌనంగా ఉంచాలని చూస్తున్న ఈ నయా ఫాసిస్టు శక్తులు ఒక విషయాన్ని మర్చిపోతున్నాయి. జెఎన్‌యు అంటే కేవలం భవనాలు కాదు, అదొక తిరుగుబాటు, చర్చోపచర్చల కేంద్రం.
ఎమర్జెన్సీ కాలంలో నియంతలనే వణికించిన ఈ గడ్డపై, ఇలాంటి చిల్లర గూండాయిజం పనిచేయదు. జెఎన్‌యులో విద్యార్థులను నియంత్రించేందుకు వ్యూహం మూడు రూపాలలో కొనసాగుతుదని అర్థమవుతోంది. 1.కోర్సుల ఫీజులను పెంచి జెఎన్‌యు వరకు రాకుండా చేయడం, ఫెలోఫిషిప్‌ల నిలుపుదల. 2. అడ్మినిస్ట్రేషన్ విద్యార్థి హక్కులను నియంత్రిచి ప్రజాస్వామ్య వాతావరణం లేకుండా విద్యార్థి సంఘాల ఎన్నికలపై ఆంక్షలు విధించడం. నిరసనలు లేకుండా ప్రశ్నించకుండా పరిమితులు విధించడం. 3.భయపెట్టి విద్యార్థులపై భౌతికదాడులు చేయడం పోలీస్ కేసులు, క్యాంపస్ రస్టికేషన్ చేయడం. ఇది కాషాయమూకల సమగ్ర ప్రణాళికగా కనిపిస్తోంది.
విద్యార్థుల లాంగ్‌మార్చ్
ఎస్‌ఎఫ్‌ఐ, ఇతర అభ్యుదయ విద్యార్థి సంఘాలు ఈ దమనకాండను నిరసిస్తూ ఫిబ్రవరి 26న చేసిన ‘లాంగ్‌మార్చ్’ దేశవ్యాప్త చర్చకు దారితీసింది.కానీ, విద్యార్థులు చేసిన లాంగ్ మార్చ్‌పై వి.సి. పోలీసులతో ఉక్కపాదం మోపింది. లాఠీచార్జీ చేసి విద్యార్థులను తీవ్ర గాయాలు చేసింది. పద్నాలుగు మందిని అక్రమంగా అరెస్టు చేసి దేశద్రోహులను బంధించినట్లు తీహార్ జైలకు తరలించింది. ఇది కేవలం జెఎన్‌యు విద్యార్థుల సమస్య మాత్రమే కాదు. ఇది దేశంలోని విద్యాసంస్థల భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న. విద్యాసంస్థల్లో శాస్త్రీయ దృక్పథం, సామాజిక న్యాయం స్థానంలో మతపరమైన ఉన్మాదాన్ని, గూండాయిజాన్ని ప్రతిష్టించాలనే ప్రయత్నాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. కర్రలు, కత్తులు, దాడులు ఆలోచనలను చంపలేవు, రాళ్లు ప్రశ్నలను పగలగొట్టలేవు అని చరిత్ర నిరూపించింది.
ఎమర్జెన్సీ కాలంలోనూ తలవంచని జెఎన్‌యు గడ్డపై, నేడు గూండాయిజంతో భయపెట్టాలని చూడటం కాషాయమూకల అవివేకం. ఇది భారత విద్యావ్యవస్థను కాషాయీకరణ నుండి కాపాడుకునే అంతిమ పోరాటం. వీసీ శాంతిశ్రీ రాజీనామా చేయాలి, విద్యార్థులపై వేసిన అక్రమ బహిష్కరణలు రద్దు కావాలి, దాడులకు పాల్పడిన గూండాలను జైలుకు పంపాలి. లేనిపక్షంలో, ఈ ఉద్యమ సెగ ఢిల్లీ వీధుల నుండి దేశంలోని ప్రతి కుగ్రామానికి విస్తరిస్తుంది. కర్రలు ఆలోచనలను చంపలేవు, రాళ్లు ప్రశ్నలను పగలగొట్టలేవు. చదువుతో పాటు పోరాటాన్ని ఆయుధంగా మార్చుకున్న ఎస్‌ఎఫ్‌ఐ, జెఎన్‌యు విద్యార్థి లోకం ఈ యుద్ధంలో అంతిమంగా విజయం సాధిస్తుంది. ఈ ఘటన ప్రజాస్వామ్యానికి ఓ హెచ్చరిక. అందుకే విద్యార్ధి సమాజం మాత్రమే కాదు, అధ్యాపకులు, మేధావులు, పౌరసమాజం కూడా స్పందించాల్సిన సమయమిది.
టి.నాగరాజు
9490098292



