వీసీ తక్షణమే రాజీనామా చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు
నవతెలంగాణ – ముషీరాబాద్
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో విద్యార్థులు, అధ్యాపకులపై జరిగిన అమానుష దాడిని ఎస్‌ఎఫ్‌ఐ తీవ్రంగా ఖండిస్తోందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. నాగరాజు తెలిపారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అండతోనే క్యాంపస్‌లలో ఏబీవీపీ గూండాలు స్వైరవిహారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముసుగులు ధరించి విద్యార్థినుల హాస్టళ్లలోకి చొరబడి ఇనుప రాడ్లతో దాడి చేయడం పిరికిపంద చర్య అని అన్నారు. ప్రశ్నించే గొంతుకను హింసతో అణచివేయలేరని, విద్యార్థి లోకం ఈ దాడులను ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం. మమత మాట్లాడుతూ.. విద్యార్థులు ఎన్నికల్లో తమ విద్యార్ధి సంఘాన్ని, తమ ప్రతినిధులను ఎన్నుకున్నారన్నారు. అలాగే వైఖరిని ప్రశ్నించినందుకు వారిని క్యాంపస్ నుంచి బహిష్కరించడం దుర్మార్గపు చర్య అని అన్నారు. తక్షణమే వారిపై బహిష్కరణ ఎత్తివేయాలని, లేకపోతే దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ జిల్లా కార్యదర్శి అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. క్యాంపస్‌లో గంటల తరబడి హింస జరుగుతున్నా, పోలీసులు చూస్తూ ఉండిపోయారని, యూనివర్సిటీ యంత్రాంగం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించిందని అన్నారు. విద్యార్థులకు కనీస రక్షణ కల్పించలేని వీసీకి ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని, ఆయన వెంటనే వైదొలగాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కార్తీక్, రమేష్, భగత్, శ్రీమాన్, ఆంజనేయులు, ప్రవీణ్, అశ్వాక్ పాల్గొన్నారు.
జేఎన్‌యూ విద్యార్థులపై దాడి హేయమైన చర్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



