నవతెలంగాణ-హైదరాబాద్ : అభిమానులమని నమ్మించి జబర్దస్త్ ఫేమ్ కొమురక్కపై ఎనిమిది మంది దాడి చేశారు. ఈ ఘటన కొమురక్క స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాలలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై లెనిన్ కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా బూర్గుల గ్రామ పరిధిలోని కాశిరెడ్డిగూడకు చెందిన శ్రీనాథ్.. కొమురక్క అసిస్టెంట్. ఉడిత్యాలలోని కొమురక్క ఇంట్లో గతంలో బంగారం చోరీకి గురైంది. ఈ విషయంలో శ్రీనాథ్‌ను నిలదీయగా.. నేరం అంగీకరించి, తిరిగి ఇస్తానని చెప్పాడు. ఎంతకూ ఇవ్వకపోవడంతో రెండు రోజుల కిందట కొమురక్క మరోసారి మందలించారు. మంగళవారం శ్రీనాథ్ స్వగ్రామంలోని స్నేహితులకు విషయం చెప్పాడు.
వంశీకృష్ణ, వికాస్, చంద్రశేఖర్, గోవా శివ, రామ్‌చరణ్, నరేష్, పోతుల శివ, కిశోర్ అదేరోజు రాత్రి 11 గంటలకు కొమురక్క ఇంటికొచ్చారు. తాము అభిమానులమని, ఫొటో దిగడానికి వచ్చామని నమ్మించారు. రామ్‌చరణ్ అనే వ్యక్తి కొమురక్క దగ్గరకు వెళ్లి.. శ్రీనాథ్‌ను ఎందుకు తిట్టావని వాగ్వాదం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో వంశీకృష్ణ రాయితో కొమురక్కపై దాడి చేస్తుండగా ఆమె సోదరుడు యాదయ్య అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈలోపు ఇతడిపై వికాస్ రాయితో దాడి చేశాడు. చంద్రశేఖర్ కర్రతో కొమురక్క కుడి చేతిని గాయపర్చాడు. అదుపు చేయడానికి వచ్చిన గ్రామానికి చెందిన రామును రాళ్లతో కొట్టారు. ఎప్పటికైనా చంపుతామని బెదిరించారు. స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేయగా.. నిందితులు ద్విచక్ర వాహనం వదిలేసి పరారయ్యారు. బుధవారం బాధితుల ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.



