సరళీకరణ, మతోన్మాద విధానాలపై పోరాడేలా కార్మికవర్గాన్ని చైతన్యపర్చాలి : సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షులు డాక్టర్ కె.హేమలత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
లేబర్‌కోడ్‌లతో పర్మినెంట్ ఉద్యోగాల మీద దాడి జరుగుతున్నదనీ, కేంద్ర ప్రభుత్వంపై యువత, ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని పక్కదారి పట్టించేందుకు మోడీ సర్కారు మతోన్మాద భావజాలాన్ని ప్రచారం చేయిస్తున్నదని సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షులు డాక్టర్ కె.హేమలత విమర్శించారు. మోడీ సర్కారు అనుసరిస్తున్న సరళీకరణ, మతోన్మాద విధానాలపై పోరాడేందుకు కార్మికవర్గాన్ని చైతన్యపర్చాలని సీఐటీయూ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో రెగ్యులర్ పాఠశాలలో ఆమె మాట్లాడారు. యువ కార్మికులను చైతన్యపర్చడానికి పాఠశాల నిర్వహించడం అభినందనీయమన్నారు. అఖిల భారత మహాసభల్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి వారం మూడు రోజుల పాటు క్లాసులు నిర్వహించడం బాగుందన్నారు. కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్‌లను పూర్తిస్థాయిలో అమలు చేసి, కార్మికవర్గాన్ని, దేశ కార్మికోద్యమాన్ని బలహీనపరచాలని చూస్తున్న ఈ సమయంలో యువ కార్యకర్తలను సంఘటితం చేయడం కోసం జాతీయ స్థాయిలో యంగ్ వర్కర్స్ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో కూడా రాష్ట్రస్థాయి స్టీరింగ్ కమిటీ ఏర్పడి పని చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను సమర్థవంతంగా ఎదుర్కోవటంలో యువ కార్మికులు ముఖ్యమైన పాత్ర పోషించాలన్నారు. అందుకు తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్వహిస్తున్న రెగ్యులర్ పాఠశాల ఒక సాధనంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకే సంస్థలో పనిచేస్తున్న పర్మినెంట్, నాన్ పర్మినెంట్ పేరుతో కార్మికుల మధ్య ప్రభుత్వం సృష్టిస్తున్న అంతరాలను, వారి హక్కులను కాలరాస్తున్న తీరును దాని వెనుక ఉన్న రాజకీయాలను యువ కార్మికులు, కార్యకర్తలు సరైన రీతిలో అర్థం చేసుకోవాలన్నారు. కార్మికులను చైతన్యపర్చి సంఘటితపరచడం తక్షణ కర్తవ్యమని చెప్పారు. క్షేత్రస్థాయి వరకు వివిధ అంశాలపై కార్మికవర్గానికి తర్ఫీదునివ్వాలని సూచిం చారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, రాష్ట్ర కార్యదర్శులు పద్మశ్రీ, కాసు మాధవి, రాష్ట్ర కార్యదర్శి, యంగ్ వర్కర్స్ స్టీరింగ్ కమిటీ కన్వీనర్ పుప్పాల శ్రీకాంత్ పాల్గొన్నారు.
లేబర్‌కోడ్‌లతో పర్మినెంట్ ఉద్యోగాలపై దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



