కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో సహకార ఫెడరలిజం గురించి పేర్కొన్నదే కాని ఆచరణలో రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తిని, సాంప్రదాయాల్ని ధ్వంసం చేయడం దారుణమైన విషయం. రాష్ట్ర ప్రథమ పౌరునిగా, రాజ్యాంగ పరిరక్షకునిగా వ్యవహరించాల్సిన గవర్నర్లు ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా వ్యవహరిస్తుండడం సిగ్గుచేటు. కేరళ, తమిళనాడు అసెంబ్లీల్లో మంగళవారం గవర్నర్లు వ్యవహరించిన తీరు రాజ్యాంగ స్ఫూర్తిని దిగజార్చేలా ఉంది. ఆ బాటలోనే కర్నాటక గవర్నర్ కూడా నడుచుకుంటానని బుధవారం నాడు ప్రకటించడం విస్మయకరం. ఏదైనా రాష్ట్ర ఎన్నికలలో బీజేపీయేతర పార్టీలకు మెజార్టీ సీట్లు లభిస్తే వారిని అధికారంలోకి రానీయ కుండా కమలనాథులే గద్దెనెక్కేలా చేయడంలో గవర్నర్లను పావులుగా వాడడం మోడీ- షా పాలనలో సర్వసాధారణమైపోయింది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను వివిధ రూపాల్లో ఇబ్బందుల పాల్జేయడానికి గవర్నర్లే పనిముట్లు కావడం మరో విషాదం. ముఖ్యంగా ఉన్నత విద్యారంగంలో మనువాద భావజాలాన్ని వ్యాపింపజేయడానికి, విశ్వవిద్యాలయాల్లో విద్వేష వాతావరణాన్ని విస్తరింపజేయడానికీ ఇటీవల లోక్‌భవన్‌లుగా పేరు మార్చుకున్న రాజ్‌భవన్‌లే వేదికలు కావడం విచారకరం.
కేరళ ఆర్థిక సంక్షోభ పరిస్థితులకు కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత ధోరణే కారణమంటూ అక్కడి ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం గవర్నరు ప్రసంగ పాఠంలో స్పష్టంగా పేర్కొనగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆ భాగాన్ని చదవకుండా కత్తెర వేశారు. రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన ప్రసంగ కాపీలో ముఖ్యమైన అంశాలను విస్మరించి .. తన స్వీయ వ్యాఖ్యానాలు చేర్చి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానపర పత్రమైన గవర్నరు ప్రసంగ పాఠం చదివేది గవర్నరే అయినా ..రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన ప్రసంగాన్నే ఆయన చదవాలన్నది రాజ్యాంగ నియమం. అర్లేకర్ ఈ రాజ్యాంగ నియమాన్ని ఉల్లంఘించారని గుర్తించిన వెంటనే ముఖ్యమంత్రి పినరయి విజయన్ గవర్నరు చేసిన ప్రసంగ పాఠాన్ని సరిదిద్దాల్సి వచ్చింది. ఆర్థిక సంక్షోభం, పెండింగ్ బిల్లులు వంటి అంశాలను ప్రసంగ పాఠంలో ఉన్నా.. ఆ భాగాన్ని గవర్నర్ విస్మరించి స్వీయ భాషణలు వినిపించారు. సమాఖ్య విధానం, రాజ్యాంగ విలువలను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తున్న కారణంగా కేరళ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులు చాలా కాలంగా పెండింగ్‌లో పెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించ వలసివచ్చిన విషయం విదితమే! కేరళపై కేంద్ర వివక్షకు నిరసనగా ముఖ్యమంత్రితో సహా పాలక కూటమి నేతలు తిరువనంతపురంలో ఇటీవల భారీ ధర్నా కూడా చేపట్టారు.
తమిళనాడు అసెంబ్లీలోనూ దాదాపు ఇదే తరహా వివాదస్పద ఘటన చోటుచేసుకున్నది. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దానిస్థానంలో తీసుకొచ్చిన విబిజి ఆర్‌ఎఎంజిని వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నరు ప్రసంగ పాఠంలో చేసిన డిమాండ్‌ను చదవాల్సి వస్తుందని ఏకంగా సభ నుంచే గవర్నరు రవి వాకౌట్ చేశారు. వరుసగా నాలుగో ఏడాది ఆయన ఇటువంటి దుస్సంప్రదాయాన్ని కొనసాగించడం గర్హనీయం. తమిళనాడు అసెంబ్లీలో గవర్నరు ప్రసంగానికి ముందు తమిళతల్లి గీతం..ప్రసంగం ముగించాక జాతీయ గీతం ఆలపించడం ఆనవాయితీ. కానీ ఈ సాంప్రదాయానికి భిన్నంగా తన ప్రసంగానికి ముందుగానే జాతీయగీతం ఆలపించాలని సభాపతిని గవర్నరు కోరడంతో ఆయన సభా సాంప్రదాయాల ప్రకారం తమిళతల్లి గీతం ఆలపిస్తారని గుర్తుచేశారు. ఆ సాకుతో గవర్నరు సభ నుంచి వెళ్లిపోయారు. సభా సాంప్రదాయాలను పదేపదే గవర్నర్లు ఉల్లంఘిస్తున్న ఉదంతాలు పెరుగుతున్న నేపథ్యంలో శాసనసభలో గవర్నరు ప్రసంగ సాంప్రదాయాన్నే రద్దు చేయాల్సిన అవసరం ఉందన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ వ్యాఖ్యలు ఆలోచింపదగినవి. ప్రజలెన్నుకున్న శాసన సభను, మెజార్టీ సాధించిన పార్టీ లేదా కూటమి పాలనను పూర్వపక్షం చేస్తున్న గవర్నర్ల వ్యవస్థనే రద్దు చేయాలన్న డిమాండ్ కూడా సబబైనదే! అయితే, భారత రాజ్యాంగం ప్రవచించిన మౌలిక స్వరూపంలోని ఫెడరలిజాన్ని ధ్వంసం చేయబూనుకున్న కేంద్ర పాలకుల విధానాలను ప్రతిఘటించడం నేటి కర్తవ్యం.
సమాఖ్యపై దాడి!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



