ఏడుగురు మృతి
అబుజా : ఆదివారం ఈస్టర్ నాడు నైజీరియాలోని రెండు చర్చిలపై దుండగులు దాడులు జరపగా ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి అవోన్ జిల్లా కౌన్సిలర్ మార్క్ బావా తెలిపిన వివరాల ప్రకారం.. మొదట నైజీరియాలో ప్రసిద్ధి చెందిన ఎసిడబ్ల్యు చర్చి, సెయింట్ అగస్టిన్స్ కాథలిక్ చర్చిలను గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చుట్టుముట్టారు. చర్చికి వచ్చిన వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల వల్ల ఏడుగురు మృతి చెందారు. గ్రామీణ ప్రాంతాల్లో టెలికమ్యూనికేషన్ల మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడం వల్ల భద్రతా దళాలకు త్వరగా ఈ ఘటనకు సంబంధించిన సమచారం అందలేదు. దీంతో దుండగులు రెచ్చిపోయారు.
ఈ ఘటనపై నైజీరియా కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ (సిబిసిఎన్) విచారం వ్యక్తం చేసింది. కాగా, ఈ ఘటనపై సిబిసిఎన్ అధ్యక్షుడు మాథ్యూ మ్యాన్-ఓసోన్డాగోసో విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన జరగడానికి పేలవమైన పాలన కారణమని ఆయన తీవ్రంగా ఆరోపించారు. స్వార్థం, బంధుప్రీతి, మతతత్వం, దేశ ఉమ్మడి శ్రేయస్సుపట్ల నిజమైన నిబద్ధత లేకపోడమే ఈ పరిస్థితి కారణమని ఆయన విమర్శించారు. నైజీరియాలోని మధ్య, వాయువ్య ప్రాంతాలలో నిరంతరం మతపరమైన దాడులు జరుగుతూనే ఉంటాయి. సాహెల్ ప్రావిన్స్‌లోని ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధం ఉన్న గ్రూపుల చర్యల వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.



