Wednesday, March 4, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపేదల భూముల ఆక్రమణకు యత్నం

పేదల భూముల ఆక్రమణకు యత్నం

- Advertisement -

బరితెగించిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థ
భూ ఆక్రమణను అడ్డుకున్న పేదలపై దాడికి యత్నం
ఆక్రమణదారులకు వత్తాసు పలుకుతున్న పోలీసులు
పోతిరెడ్డిపల్లిలో సర్వేనంబర్‌ 153/4, 153 /5లో ఆక్రమణలు
చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు

నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
పేదల కోసం కేటాయించిన అసైన్డ్‌ భూములపై రియల్‌ ఎస్టేట్‌ వశమవుతున్నాయి.. కొందరికి నయానోబయానో ఇచ్చి తీసుకుంటున్న రియల్‌ వ్యాపారులు.. ఆ పక్కనే ఉన్న ఇతరుల స్థలాలపై కన్నేసి ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారు. ఇదే కోవలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పేదలకు కేటాయించిన భూములను ఆక్రమించేందుకు రియల్‌ ఎస్టేట్‌ సంస్థ యత్నించడం కలకలం రేపింది. పోతిరెడ్డిపల్లి గ్రామంలో 2007లో ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదల కోసం సర్వే నెంబర్‌ 153/4, 153 /5, 153/ 24లలో రెండెకరాలు కేటాయించింది.

80 మందికి 80 గజాల చొప్పున రెవెన్యూ అధికారులు పట్టాలు కూడా ఇచ్చారు. స్థలం కేటాయించినప్పటికీ రోడ్లు, కరెంటు, నీరు, డ్రైనేజీ వంటి కనీస వసతులు లేకపోవడంతో పేదలు ఇక్కడ ఇండ్లు కట్టుకోలేకపోయారు. దీనికి తోడు ఈ స్థలాల్లోకి వెళ్లేందుకు దారి లేకపోవడంతో లబ్దిదారులు ఇండ్ల నిర్మాణాలు చేసుకోలేదు.పోతిరెడ్డిపల్లి నుంచి కోత్లాపూర్‌ గ్రామ శివారు వరకు విస్తరించి ఉన్న భూములకు ఎకరం ధర రూ.కోట్లల్లో పలుకుతున్నది. అదే విధంగా నేషనల్‌ హైవేకు ఆనుకుని ఉండటంతో పెద్ద పెద్ద రాజకీయ నాయకుల కన్నుపడింది.

రోడ్డు లేకపోవడంతో..
ప్రభుత్వం కేటాయించిన ఇండ్ల స్థలాల్లో నిర్మాణాలు చేసేందుకు రోడ్డు సౌకర్యం లేదు. దాంతో ఇండ్ల నిర్మాణాలు చేయలేదని లబ్దిదారులు తెలిపారు. ప్రస్తుతం ఈ భూములకు దగ్గరగా సంగారెడ్డి నుంచి కలివేముల వరకు 60 ఫీట్ల మేర 5.5 కిలోమీటర్ల వరకు రోడ్డు మంజూరైంది. ఇందుకు సంబంధించిన పనులు నడుస్తున్నాయి. దీంతో ఇక్కడ ఇండ్లు నిర్మించుకొవడానికి పట్టాలు పొందిన పేదలు సిద్ధమయ్యారు. అంబేద్కర్‌ కాలనీగా నామకరణం చేసుకొని తాత్కాలిక నిర్మాణాలు, గుడిసెలు వేసుకునే ప్రయత్నం చేశారు.

ఇంతలోపే టీజేఅర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఎంట్రీ ఇచ్చింది. ఈ భూమి తమదేనంటూ నిర్మాణాలు చేపడుతోంది. టీజేఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ వారం నుంచి ఈ స్థలంలో ప్లాట్లను చదును చేస్తోంది. టీజేఆర్‌ సిబ్బంది హద్దురాళ్లను తొలగిస్తోంది. ఇన్ని రోజులు కాపాడుకున్న తమ ప్లాట్లను టీజెఅర్‌ (తాటికొండ జానకీ రామ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) సంస్థ తమ హద్దులను తొలగించి కబ్జా చేసే కుట్ర చేస్తోందని పేదలు ఆరోపిస్తున్నారు. తమకు కేటాయించిన స్థలాన్ని రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నదని లబ్దిదారులు పనులను ఆడ్డుకున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

సివిల్‌ తగాదాల్లో పోలీసుల అత్యుత్సాహం..
పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూముల హద్దురాళ్లను తాటికొండ జానకీ రామ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ సంస్థ తొలగించి ఆక్రమణకు యత్నిస్తోంది. దీనిని పేదలు అడ్డుకుంటుండగా.. పోలీసులు మాత్రం రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు అనుకూలంగా ఎంట్రీ ఇవ్వడం అనుమానాలకు తావిస్తున్నది. తాటికొండ జానకీ రామ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ ఫిర్యాదు చేసిందనే కారణంతో అసలైన లబ్దిదారులను భూముల్లోకి రాకుండా అడ్డుకోవడం పట్ల పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులను వివరణ కోరగా పూర్తి వివరాలు పరిశీలించి నివేదికను కలెక్టర్‌కు అందిస్తామన్నారు.

పేదల ప్లాట్లు పేదలకు ఇవ్వాలి
కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలకు కేటాయించిన ప్లాట్లను వారికే ఇవ్వాలి. 2007లో అప్పటి ప్రభుత్వం పోతిరెడ్డిపల్లిలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇంటి జాగాలు ఇచ్చింది. అందులోకి వెళ్లేందుకు సరియైన రోడ్లు లేకపోవడంతో ఇండ్లు నిర్మించుకోలేదు. పట్టా సర్టిఫికెట్లు ఉన్న ప్రతి ఒక్కరూ అక్కడ ఇండ్లు నిర్మించుకునేందుకు సహకరించాలి. కబ్జాకు పాల్పడుతున్న వెంచర్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. -సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జి.జయరాజ్‌

మా ప్లాట్లను ఆక్రమించారు…
2007లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం మాకు ఇంటి జాగలు ఇచ్చింది. ఆ జాగలకు సంబంధించిన సర్టిఫికెట్టు కూడా ఉన్నాయి. ప్లాట్ల స్థలానికి వెళ్లేందుకు సరియైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఇండ్లు నిర్మించుకోలేదు. ఇప్పుడు మా స్థలాలను వెంచర్‌ యాజమాన్యం అక్రమంచుకుంటోంది. దానిని అడ్డుకుంటే మాపై దౌర్జన్యం చేస్తున్నారు. కిరాయి ఇంటిలో ఉంటూ జీవనం సాగిస్తున్నాం. మాకు ఇచ్చిన స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకుంటాం. అధికారులు సహకరించాలి. -లబ్దిదారుడు కుమ్మరి సంగమేష్‌

స్థలాన్ని కాపాడాలి
మాకు కాంగ్రెస్‌ ప్రభుత్వమే పట్టాలు ఇచ్చింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఉన్నది. మా స్థలాలకు పక్కనే ఉన్న రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఆక్రమించుకుని చదును చేస్తున్నది. మా ఇంటి జాగలు మాకు ఇప్పించి న్యాయం చేయాలి. పోలీసులు ఓ వైపు, వెంచర్‌ యాజమాన్యం ఓవైపు మాపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. -లబ్దిదారు యమున

పేదలపై కరుణించాలి..
ఇండ్లు లేని నిరుపేదలం. కిరాయి ఇండ్లల్లో ఉంటూ బతకడం కష్టం ఉంది. మాకు ప్రభుత్వం ఇండ్ల స్థలాలు ఇచ్చింది. కానీ ఇప్పుడు వెంచర్‌ యాజమాన్యం మా భూమి అంటూ మమ్మల్ని రానివ్వడం లేదు. మా వద్ద ప్లాట్లకు సంబంధించిన ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్లు ఉన్నాయి. వెంచర్‌ యాజమాన్యం పోలీసులను తీసుకొచ్చి బెదిరిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు మా ప్లాట్లను మాకు ఇప్పించాలి. లేనిచో ఆందోళన చేస్తాం. -కమలమ్మ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -