Tuesday, October 7, 2025
E-PAPER
Homeజాతీయంసీజేఐపై షూతో దాడికి యత్నం

సీజేఐపై షూతో దాడికి యత్నం

- Advertisement -

సుప్రీంకోర్టులో బరి తెగించిన న్యాయవాది
ఖండించిన న్యాయవాద సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రముఖులు
న్యాయవాదిని సస్పెండ్‌ చేసిన బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్‌ గవాయ్‌పై న్యాయవాది రాకేశ్‌ కిషోర్‌ దాడికి యత్నించారు. సోమవారం ఉదయం ఓ కేసు విచారణ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. సీజేఐ బీఆర్‌ గవాయ్‌, న్యాయమూర్తి జస్టిస్‌ కే వినోద్‌ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం ఓ కేసు విచారి స్తున్న సమయంలో డయాస్‌ వద్దకు వెళ్లిన సదరు లాయర్‌.. తన స్పోర్ట్స్‌ షూ తీసి సీజేఐ పైకి విసిరేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది లాయర్‌ని అడ్డుకుని బయటకి లాక్కెళ్లింది. అనంతరం ఆయనను పోలీసులకు అప్పగిం చారు. ఆ సమయంలో ఆ న్యాయవాది ”సనాత నానికి జరిగే అవమానాన్ని మేము సహించం” అంటూ గట్టిగా అరిచారు. ఈ ఘటనతో కోర్టులో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. స్పందించిన సీజేఐ ఈ విషయం తనని ప్రభావితం చేయబోదని తెలిపారు. మిగతా లాయర్లు తమ వాదనలు కొనసాగించాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలతో ఎవరూ విచలితులు కావొద్దని చెప్పారు. దీనిపై తాము చలించడం లేదనీ, ఇలాంటి ఘటనలు తనను ప్రభావితం చేయలేవని సీజేఐ గవాయ్‌ స్పష్టం చేశారు. మరోవైపు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌తో పోలీసులు సమన్వయం చేసుకుని ఈ విషయంపై తదుపరి దర్యాప్తు జరుపుతు న్నారని ఆయా వర్గాలు తెలిపాయి. న్యాయ వాది చర్య వెనుక ఉన్న కచ్చితమైన ఉద్దేశ్యం గురించి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.

ఏం జరిగిందంటే..
కొన్ని రోజుల క్రితం సీజేఐ గవారు ఓ కేసులో చేసిన వ్యాఖ్యల వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఖజురహోలోని ఏడు అడుగుల విష్ణుమూర్తి విగ్రహాన్ని పున:ప్రతిష్టించాలని దాఖలు చేసిన కేసులో సీజేఐ గవాయ్‌ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ కేసును ఆయన డిస్మిస్‌ చేస్తూ.. ”విష్ణువుకు వీరభక్తుడిని అని చెప్పుకుంటున్నావు కదా… వెళ్లి ఆ దేవుడినే ప్రార్థించుకో.. అదో ఆర్కియా లజీ సైట్‌. దానికి ఏఎస్‌ఐ పర్మిషన్‌ అవసరం ఉంటుంది” అని ఆ కేసులో సీజేఐ వ్యాఖ్యానిం చారు. గవాయ్‌ చేసిన ఈ వ్యాఖ్యల పై సోషల్‌ మీడియాలో బీజేపీ, దాని అనుకూల సంస్థలు, పలు హిందూత్వ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రచారం చేశాయి. మతపరమైన భావాలను కించపరి చినట్టు ఆయనపై ఆరోపణలు చేశాయి. అయితే ఆ వివాదానికి ఆయన తనదైన శైలిలో ముగింపు పలికారు. రెండ్రోజులసీజేఐపై షూతో దాడికి యత్నం తరువాత ఓ కేసులో స్పందిస్తూ తాను ఏ మతాన్నీ అమర్యాదపరచలేదన్నారు. అన్ని మతాలనూ గౌరవిస్తాననీ, కేవలం సోషల్‌ మీడియాలోనే తన వ్యాఖ్యలు ప్రచారమైనట్టు ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం తరపున సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సీజేఐకి అండగా నిలిచారు. సోషల్‌ మీడియాల్లో కొన్ని సందర్భాల్లో ప్రతిచర్యలు భిన్నంగా ఉంటాయన్నారు.

సీజేఐపై దాడికి ఖండనలు
గవాయ్‌పై దాడికి యత్నించిన ఘటనను న్యాయవాద సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రముఖులు ఖండించారు. ఆలిండియా లాయర్స్‌ అసోసియేషన్‌ (ఐలు), సుప్రీంకోర్టు అడ్వకేట్స్‌ ఆన్‌ రికార్డ్‌ అసోసియేషన్‌ (ఎస్‌సీఏఓఆర్‌ఏ) తదితర సంఘాలు తీవ్రంగా ఖండించాయి. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే దీనిపై స్పందిస్తూ ‘ఈ బుద్ధిహీన చర్య సమాజాన్ని ద్వేషం, మతోన్మాదం ఎలా ముంచెత్తాయో చూపిస్తుంది’ అని విమర్శించారు. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఈ చర్య దురదృష్టకరం, ఖండించదగినదని అన్నారు. సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ ఈ ఘటనను వ్యవస్థపై దాడిగా అభివర్ణించారు.

స్వతంత్ర న్యాయవ్యవస్థపై బహిరంగ దాడి : ఐలు
సీజేఐపై జరిగిన దుస్సంఘటన స్వతంత్ర న్యాయవ్యవస్థపై జరిగిన బహిరంగ దాడిగా ఐలు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బికాస్‌ రంజన్‌ భట్టాచార్య, పీవీ సురేంద్రనాథ్‌లు అన్నారు. దీనిని వికృత మనస్తత్వం కలిగిన వ్యక్తి చేసిన చర్యగా పరిగణించలేమనీ, దేశంలో న్యాయ వ్యవస్థ, దాని స్వతంత్రత, న్యాయ సమీక్ష శక్తి, లౌకికవాద భావనపై కొన్ని వర్గాల నుంచి వ్యవస్థీకృతమైన, దుర్మార్గపు దుర్భాషల ప్రచారంలో భాగంగా దీనిని చూడాలని పేర్కొన్నారు. ఇది దేశ మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేస్తుందనీ, దేశంలో ”నాథురామ్‌ మనస్సు” పథాన్ని గుర్తు చేస్తుందని విమర్శించారు. ఈ చర్చను సహించలేమని, సమాజంలోని అన్ని వర్గాలు తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. దీన్ని న్యాయ వ్యవస్థపైనే కాకుండా రాజ్యాంగంపై కూడా జరిగిన దాడిగా అభివర్ణించారు. ఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు చేసి, నిందితుడు, ఆయన వెనుక ఎవరైనా వ్యక్తులు ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా ఖండిస్తూ నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు.

న్యాయవాదిని సస్పెండ్‌ చేసిన బీసీఐ
సీజేఐపై షూతో దాడికి యత్నించిన న్యాయవాది రాకేశ్‌ కిషోర్‌ను బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) సస్పెండ్‌ చేసింది. బీసీఐ చైర్‌పర్సన్‌, సీనియర్‌ న్యాయవాది కుమార్‌మిశ్రా మాట్లాడుతూ న్యాయవాది రాకేశ్‌ కిషోర్‌ చర్య కోర్టు గౌరవానికి విరుద్ధంగా ఉందనీ, ఆయన అడ్వకేట్స్‌ చట్టం-1961, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనల ప్రకారం వృత్తిపరమైన ప్రవర్తనా నియమాలను స్పష్టంగా ఉల్లంఘించారని తెలిపారు. సస్పెన్షన్‌ కాలంలో న్యాయవాది దేశంలోని ఏ కోర్టు, ట్రిబ్యునల్‌, అథారిటీలో వాదించేందుకు, ప్రాక్టీస్‌ చేయడంపై నిషేధం విధించినట్టు తెలిపారు. సస్పెన్షన్‌ చర్య ఎందుకు కొనసాగించకూడదో 15 రోజుల్లోపు వివరిస్తూ సమాధానమివ్వాలని షోకాజ్‌ నోటీస్‌ జారీ చేశారు. 48 గంటల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని బీసీఐ కోరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -