బీహార్‌లో ఓటర్ల జాబితా ప్రక్షాళన వెనుక కుట్ర
ఓటర్ల జాబితా పారదర్శకతపై పార్లమెంటులో చర్చ జరపాలి
ముస్లింలను చేర్చారని బీసీ బిల్లుపై బీజేపీ వ్యతిరేకత
ప్రజాసమస్యలను వదిలేసి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పరస్పర విమర్శలు : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-సూర్యాపేట
బీహార్‌లో ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో ఆర్‌ఎస్‌ఎస్ మతతత్వ సిద్ధాంతాలను అమలు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తమ్మినేని వీరభద్రం అన్నారు. దేశంలో మతతత్వ రాజకీయాలతో పౌరుల హక్కులను కాలరాసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని విమర్శించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్టార్ బ్యాంకెట్ హాల్‌లో జరుగుతున్న కేవీపీఎస్ రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు గురువారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి హాజరైన తమ్మినేని అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గతంలో పౌరసత్వ చట్టం మార్పుల పేరుతో మైనార్టీలను దేశం నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేసిందని, తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ప్రయత్నాన్ని మానుకుందని గుర్తు చేశారు. ఇప్పుడు ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో మరోసారి కుట్రకు పాల్పడుతోందని, బీహార్‌లో జరుగుతున్న ఈ కుట్ర రేపు దేశం మొత్తం వ్యాపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా సవరణ పారదర్శకతపై పార్లమెంటులో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో హిందూ, ముస్లింల మధ్య తగాదాలు పెంచుతోందన్నారు. ముస్లింలను బీసీ లెక్కల్లో చేర్చారని రాష్ట్రంలో 42 శాతం బీసీ బిల్లు అమలును ఒకపక్క వ్యతిరేకిస్తూనే.. మరోపక్క బీహార్ ఎన్నికల్లో లబ్ది కోసమే దేశవ్యాప్త బీసీ జనగణనకు బీజేపీ అంగీకరించిందని విమర్శించారు.
అంబేద్కర్ రాజ్యాంగంతో ప్రస్తుతం బడుగులకు కలుగుతున్న కొద్దిపాటి ప్రయోజనం కూడా అందకుండా చేయాలని రిజర్వేషన్లపై సమీక్ష జరపాలంటోందని అన్నారు. బీజేపీ సిద్ధాంతాలతో బడుగులకు ఉద్యోగ, ఆర్థిక ప్రయోజనాలు దూరమయ్యే ప్రమాదం ఏర్పడనుందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సీఎం రేవంత్‌రెడ్డి డబ్బులు లేవంటున్నారని విమర్శించారు. డబ్బులు లేవని ముందే తెలిసినా ఎందుకు హామీలిచ్చారని ప్రశ్నించారు. హామీల అమలును తప్పించుకునేందుకు కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా కార్ రేస్ అంటూ రోజుకో టికెట్ లేని సినిమా చూపిస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలను వదిలిపెట్టి ఫోన్ ట్యాపింగ్ పేరుతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయని అన్నారు. దేశద్రోహుల కోసం చేయాల్సిన ఫోన్ ట్యాపింగ్‌ను ప్రతిపక్షాలు, అసమ్మతి వాదులపై ప్రయోగిస్తున్నారని తెలిపారు. రాబోయే కాలంలో బడుగుల హక్కుల సాధనకు, అభ్యున్నతికి సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు, జిల్లా కార్యదర్శి కోట గోపి, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ పాలడుగు నాగార్జున తదితరులు ఉన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాల అమలుకు యత్నం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES