సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి ఆహ్వానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఈనెల 28 నుంచి 31 వరకు జరిగే మేడారం సమ్మక్క- సారక్క మహా జాతరకు హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి ఆహ్వానపత్రాన్ని మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు ఆలయ పూజారులు అందించారు. ఈ సందర్భంగా మేడారం మహా జాతర పోస్టర్‌ను సీఎం ఆవిష్కరించారు. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం మహా జాతర ఈనెల 28 నుంచి 31 వరకు జరుగుతుంది. తొలిరోజు ఈనెల 28న సాయంత్రం ఆరు గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మను, గోవింద రాజు, పగిడిద్ద రాజులను గద్దెపైకి తీసుకురావడంతో జాతర మొదలవుతుంది.
రెండో రోజు 29న సాయంత్రం ఆరు గంటలకు చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దె మీదకు తీసుకొస్తారు. ఈనెల 30న వన దేవతలకు భక్తులు తమ మొక్కులను చెల్లించే కార్యక్రమం ఉంటుంది. చివరి రోజు ఈనెల 31న సాయంత్రం ఆరు గంటల సమయంలో సమ్మక్క-సారలమ్మ దేవతలు, గోవింద రాజు, పగిడిద్ద రాజు దేవుళ్ల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. మేడారం జాతరకు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశమున్నది. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో మేడారం జాతర జరుగుతుంది. ప్రతి రెండేండ్లకు ఒకసారి ఈ జాతరను నిర్వహిస్తారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన పండుగ కావడం విశేషం.
ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలకు రండి
ఐనవోలు మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలకు రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఆలయ పూజారులు ఆశీర్వచనం అందించారు. ఈ జాతర ఈనెల 14న ప్రారంభమై ఏప్రిల్ 27న ముగుస్తుంది.
మేడారం మహాజాతరకు హాజరుకండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



