ప్రతి రోజు పిల్లల సమాచారం తల్లిదండ్రులకు చేరవేత
హెచ్‌ఎంఆర్‌ఎస్‌తో బోధన, బోధనేతర సిబ్బందికి అన్ని సేవలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మీ పిల్లలు చాలా రోజుల నుంచి కాలేజీకి రెగ్యులర్‌గా రావడం లేదని లెక్చరర్లు చెబితే తల్లిదండ్రులు ఆశ్చర్యపోయే పరిస్థితి ప్రస్తుతం లేదు. ప్రతి రోజు ఇంటి నుంచి కాలేజీకంటూ వెళ్లి బయట తిరుగుతున్నారా? లేదా కాలేజీకి క్రమం తప్పకుండా వెళుతున్నారా? అనే విషయాన్ని తల్లిదండ్రులు ఇంటి నుంచే తెలుసుకుంటున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ముఖ గుర్తింపు (ఫేసియల్ రెకగ్నైజేషన్ సిస్టమ్) హాజరు తీసుకురావడంతో ఈ ఏడాది కాలేజీలకు రెగ్యులర్‌గా వస్తున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. డైరెక్టరేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెచ్చిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి. పకడ్బందీగా ప్రాక్టికల్స్, పరీక్షల నిర్వహణ, బోధన, బోధనేతర సిబ్బందికి అవసరమైన పాలనాపరమైన సేవలను సాంకేతిక సమాచార పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సులభంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ఇతర శాఖలు సైతం ఇలాంటి మార్పుల దిశగా ముందుకెళ్లేందుకు యోచిస్తున్నాయి.
రాష్ట్రంలో 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ముఖ గుర్తింపును (ఫేషియల్ రిక్నగైజేషన్) అమలు చేస్తున్నారు. దీంతో ఇంటి దగ్గర నుంచి కళాశాలకు బయలుదేరిన విద్యార్థులు నేరుగా కళాశాలలకే వస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ముఖ గుర్తింపు దాని ఆధారంగా కళాశాల నుంచి తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లకు వెళుతున్న సందేశం.. ఒక వేళ విద్యార్థి కళాశాలకు రాకపోతే ఆ సమాచారం తెలుగు/ఇంగ్లిషు భాషల్లో తల్లిదండ్రులకు వెళుతోంది. దాంతో తల్లిదండ్రులు తమ పిల్లలు కళాశాలకు వెళ్లింది? లేనిది? వెంటనే తెలుసుకోగలుగుతున్నారు. తాము కళాశాలకు వెళ్లేది, లేనిది పేరెంట్స్‌కు తెలుస్తుండటంతో కాలేజీ నుంచి బయటికి వెళ్లే విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల్లో 1,47,465 మంది విద్యార్థులున్నారు. వీరిలో ప్రతి రోజు 90 శాతానికి మంది కళాశాలలకు హాజరవుతున్నారు. విద్యార్థుల మాదిరే అన్ని కళాశాలలు, కార్యాలయాల్లోని బోధన, బోధనేతర సిబ్బంది హాజరును ముఖ గుర్తింపు తీసుకుంటున్నారు. దీంతో ఉద్యోగుల హాజరుశాతం మెరుగుపడడంతో పాటు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నట్టు అధికారులు గుర్తించారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్, సహకార, కేజీబీవీ, సంక్షేమ గురుకులాల పరిధిలోని కళాశాలల్లో గతంలో ప్రాక్టికల్స్ నిర్వహణ నామమాత్రంగా సాగేది. కానీ వాటిని కచ్చితంగా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రాక్టికల్స్‌లో పాల్గొనకపోతే విద్యార్థులకు ఆయా అంశాల్లో జ్ఞానం కొరవడి అది ఉన్నత చదువుల సమయంలో ఇబ్బందికరంగా మారుతుందనే విషయం సీఎం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో అన్ని కళాశాలల్లో ప్రాక్టికల్స్ పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఫైనల్ ఎగ్జామినేషన్ సమయంలోనూ ప్రాక్టికల్స్ విషయంలో ఏమాత్రం అలసత్వం చేయకూడదని సీఎం స్పష్టం చేశారు. ప్రాక్టికల్స్ నిర్వహణలో తీసుకువచ్చిన ఈ మార్పులతో రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని 10 లక్షలకుపైగా ఇంటర్ విద్యార్థులకు థియరీతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరుగుతోంది.
ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ గతంలో ఓ ప్రహసనంగా ఉండేది. పరీక్ష పేపర్ల తయారీ కేంద్రం నుంచి స్ట్రాంగ్ రూంకు, అక్కడి నుంచి జిల్లా కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్లకు అక్కడి నుంచి కళాశాలలకు తరలించేవారు. ఈ క్రమంలో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో పలుమార్లు లీకేజీల సమస్య ఉండేది. విద్యార్థులు తీవ్రంగా నష్టపోయేవారు. ఇప్పుడు తయారీ కేంద్రం నుంచి పరీక్ష నిర్వహణ కేంద్రం వరకు ప్రతి దశలో తరలింపునకు సంబంధించి వాహనానికి జీపీఆర్‌ఎస్ ఏర్పాటు చేసి దానిని మానిటరింగ్ చేస్తారు. అలాగే విద్యార్థులకు ఇచ్చే పరీక్ష పేపర్, బుక్‌లెట్‌పై కోడ్ ఏర్పాటు చేస్తారు. దీంతో ఏ దశలో ఎక్కడ అది తొలుత స్కాన్ అయింది వెంటనే తెలిసిపోతుంది. నీళ్లలో పడినా తడిచిపోని బుక్‌లెట్‌ను విద్యార్థులకు ఈ దఫా ఇవ్వనున్నారు. స్టూడెంట్స్ చెల్లించిన పరీక్షా ఫీజులు ఎప్పటికప్పుడు బోర్డుకు చేరేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మాడ్యూల్‌లో అప్‌డేట్ చేస్తున్నారు. ఎవరైనా విద్యార్థులు చెల్లించకపోతే సంబంధిత ప్రిన్సిపాల్ నుంచి ఆ విద్యార్థి తల్లిదండ్రులకు వెంటనే సమాచారం ఇచ్చే ఏర్పాటు చేశారు.నామినల్ రోల్స్‌ను ముందుగానే ప్రిన్సిపాల్స్ వద్దే కరెక్షన్స్ చేయించనున్నారు.
సిబ్బంది సేవలకు హెచ్‌ఆర్‌ఎంఎస్
బోధన, బోధనేతర సిబ్బందికి హెచ్‌ఎంఆర్‌ఎస్ ద్వారా మెరుగైన సేవలు అందుతున్నాయి. సిబ్బందికి ఉండే 14 రకాల సెలవులు, వాటి వినియోగంపైనా వారికి పూర్తి అవగాహన కల్పించారు. దీంతో సెలవు మంజూరు, రద్దు కూడా ఉన్నతాధికారులకు సులభంగా మారింది. అలాగే సిబ్బందికి జారీ చేసే వివిధ రకాల నిరభ్యంతరాల పత్రాల జారీ, ఇంక్రిమెంట్లు, స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు, రీయింబర్స్‌మెంట్ల, పింఛను చెల్లింపులకు సంబంధించి కళాశాలల సిబ్బంది, ప్రిన్సిపాల్, డీఐఈవో, ఆర్జేడీ నుంచి కమిషనర్ వరకు అంతా హెచ్‌ఆర్‌ఎంఎ సిబ్బందికి కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పింది. ఫైల్ ఏ దశలో ఎవరి దగ్గర ఆగిపోయిందో ఉన్నతాధికారులకు వెంటనే తెలుస్తున్నది. తదుపరి ఏం చేయాలనే దానిపై అటు సిబ్బందికి, ఇటు ఉన్నతాధికారులకు స్పష్టత వస్తోంది. సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలను కూడా ఉన్నతాధికారులు ఆన్‌లైన్‌లో పర్యవేక్షిస్తున్నారు. టీచింగ్ డైరీ ఆన్‌లైన్ చేశారు. ప్రతి రోజూ ప్రిన్సిపాల్స్ వాటిని పరిశీలించి అప్‌డేట్ చేస్తున్నారు. ఆ తర్వాత వాటిని రాష్ట్ర స్థాయిలోనూ పరిశీలిస్తున్నారు.
ముఖ గుర్తింపుతో పెరిగిన హాజరు శాతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



