ప్రియమైన వేణు గీతికకు
నాన్న! ఉగాది పండగకు నీ దగ్గర లేకపోవడం చాలా బాధనిపించింది. గతంలోలా ప్రయాణాలు చేయలేకపోతున్నాను. సరే ఎక్కడ ఉన్నా నువ్వు ఉగాది పచ్చడి తింటే చాలు అనుకున్నాను. నీకు అందేలా చేసాను. ‘ఉగాది పచ్చడి తిన్నాను అమ్మా’ అన్నావు. చాలా సంతోషం నాన్నా. సరే నాన్న ఇక అసలు విషయానికి వస్తున్నా.. కిందటి ఉత్తరంలో పసిపిల్లల విషయంలో తీసుకోవలసిన జాగ్రతలు చెప్పాను. ఈ ఉత్తరంలో పిల్లల పెంపకం గురించి చెప్తా. పసితనం నుండి పెద్ద పిల్లలు అయ్యే వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను.
పసిపిల్లల విషయంలో చాలా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. సమయానికి పాలు పట్టడం, నిద్ర పుచ్చడం, వాళ్ళు పక్క బట్టలు తడిపితే వెంటనే మార్చడం లాంటివి చేయాలి. ఒక 6 నెలల తర్వాత వాళ్ళు పాకడం, దొరికినవి నోట్లో పెట్టుకోవడం చేస్తూ ఉంటారు. కొందరు తల్లులు పిల్లలు ఆడుకోవడానికి పెన్సిళ్లు, పెన్నులు ఇస్తుంటారు. ఎప్పుడూ పిల్లలకు పదునైన వస్తువులు ఇవ్వకూడదు. వాళ్లకు తెలియదు కదా. ఒక్కో సారి కంట్లో పొడుచుకోవడం, లేదా ఎక్కడన్నా గుచ్చు కోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే రెప్ప వేయకుండా వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి.
అలాగే పసి పిల్లలను చూడటానికి బంధువులు, స్నేహితులు ఇంటికి వస్తారు. ముందుగా వాళ్ళను శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కుని రమ్మనాలి. ఆ తర్వాతనే పిల్లలను వారికి అందించాలి. ఎన్నో జాగ్రత్తలు, శుభ్రత పాటించాలి నాన్న. వీటికి ఎంతో సహనం, ఓపిక అవసరం. చంటి పిల్లలను పెంచడం కొంత కష్టం అనిపించినా, ఆ పెంచడంలోని మాధుర్యాన్ని, అనుభూతిని అనుభవించాలి. తల్లి బిడ్డ బోసి నవ్వులు చూడగానే తన కష్టం అంతా మర్చిపోతుంది నాన్న. అది తల్లిగా నువ్వు అనుభవిస్తేనే, ఆ అనుభూతి నీకు అర్ధం అవుతుంది. నీ బోసి నవ్వులు ఇప్పటికీ నా కళ్లల్లో మెదులుతూ ఉంటాయి. అవన్నీ మధుర జ్ఞాపకాలు నాన్న. ఉంటాను చిట్టి తల్లి.
శ్రద్ధ అవసరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



