– కాంగ్రెస్ ఎన్నికల సమన్వయకర్తలుగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతున్నదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వేధింపులకు తెరతీసిందని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బులు పంచుతుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం చూసీ చూడనట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌కు ప్రజల నుంచి విస్తృత మద్దతు లభిస్తోందనే భయంతో దాడులు, బెదిరింపులకు పాల్పడుతోందని అన్నారు. మాజీమంత్రి మల్లారెడ్డిపై దాడిని ఖండించారు. మాజీమంత్రి హరీశ్‌రావు ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు. కోదాడలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మామిడి దివ్యను బురఖా వేసి నామినేషన్ ఉపసంహరణ చేయించి కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవం చేయడం ప్రజాస్వామ్య హత్యేనని చెప్పారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థులను బెదిరించి కాంగ్రెస్ కండువాలను కప్పడాన్ని ఖండించారు. ఎనిమిది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చారని గుర్తు చేశారు. అరెకపూడి గాంధీ కాంగ్రెస్ నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్తగా నియమించడం కాంగ్రెస్ ద్వంద్వ విధానానికి నిదర్శనమని విమర్శించారు. బుట్టంగారి మాధవరెడ్డికి బీఆర్‌ఎస్ టికెట్ అంశం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామనీ, సహేతుకమైన నిర్ణయం వస్తుందని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంటున్నది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డేనని అన్నారు. బీసీలు సంఘాలు ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడికి పిలుపునిస్తే అందులో పాల్గొనే మొదటి వ్యక్తిని తానేనని చెప్పారు.
రాష్ట్రంలో నిరంకుశ పాలన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



