– నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని వివిధ గ్రామాల ఆటో డ్రైవర్లు, యూనియన్ నాయకులతో ట్రాఫిక్ రూల్స్ నియమ నిబంధనల గురించి మంగళవారం జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సలహాలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లు ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలు తప్పక పాటించాలని అన్నారు. లేని పక్షంఓ చట్టపరమైన చర్యలు తప్పవని డ్రైవర్లను ఈ సందర్బంగా ఆయన హెచ్చరించారు. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు ఆటోకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పేపర్లు, ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఇతర పేపర్లు తప్పక అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు.
ఆటోలు ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తగా నడిపించాలని సూచించారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తే కఠినమైన చట్టాలు ఉపయోగిస్తామని తెలిపారు. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని అన్నారు. నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని, ఎట్టి పరిస్థితిలో ఎవరికి ఉపేక్షించడం అనేది ఉండదని చెప్పారు. మండలంలోని పలు గ్రామాలలో కాలం చెల్లిన ఆటోలు కొన్ని ఉన్నాయని అన్నారు. వాటిని వీలైనంతవరకు రీప్లేస్ చేసుకుని, కొత్త వాహనాలను కొని నడిపించుకోవాలని సూచించారు. ఆటోలలో అదనపు సీట్లు పెట్టుకోవద్దని, సౌండ్ బాక్సులు వంటివి గంభీరంగా శబ్దాలు వచ్చేవి ఉండకూడదని తెలియజేశారు. గడువు అయిపోయిన వాహనాలు తోలితే ఆంక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎస్సై తో పాటు, జుక్కల్ మండల ఆటో యూనియన్ నాయకులు, పలు గ్రామాలలో ఆటోలు నడిపిస్తున్న డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.



