Sunday, October 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంత్వరలో డీటీఆర్‌, ఫీడర్ల ఆటోమేషన్‌

త్వరలో డీటీఆర్‌, ఫీడర్ల ఆటోమేషన్‌

- Advertisement -

– కరెంట్‌ డిమాండ్‌ పెరుగుతోంది…ఏర్పాట్లు చేయండి
– త్వరలో అందుబాటులోకి ‘యాదాద్రి’
– వచ్చే ఏడాదిలో గరిష్టడిమాండ్‌ 19వేల మెగావాట్ల అంచనా
– ఈవీలకు మహర్దశ
– సింగరేణి ఉత్పత్తి లక్ష్యంరోజుకు 2.20 మిలియన్‌ టన్నులు
– ఆయా సంస్థల సీఎమ్‌డీలతో ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ సమీక్ష

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని డీటీఆర్‌లు, ఫీడర్లను త్వరలో ఆటోమేషన్‌ చేయనున్నట్టు ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ తెలిపారు. వచ్చే రబీ, వేసవి సీజన్లలో విద్యుత్‌ డిమాండ్‌ రికార్డు స్థాయిలో పెరుగుతుందనీ, దానికి తగినట్టు విద్యుత్‌ సంస్థలు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. శనివారంనాడిక్కడి మింట్‌ కాంపౌండ్‌లో దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణి సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌) ప్రధాన కార్యాలయంలో టీజీ ట్రాన్స్‌కో సీఎమ్‌డీ కృష్ణ భాస్కర్‌, జెన్‌కో సీఎమ్‌డీ హరీశ్‌, సింగరేణి కాలరీస్‌ సీఎమ్‌డీ ఎన్‌ బలరాం, ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌ సీఎమ్‌డీలు ముషారఫ్‌ ఫరూఖీ, వరుణ్‌రెడ్డి, రెడ్‌కో వీసీఎమ్‌డీ శ్రీమతి అనీల తదితర విద్యుత్‌ విభాగాల ఉన్నతాధికారులతో నవీన్‌మిట్టల్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా విభాగాల ఉన్నతాధికారులు పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్ల ద్వారా వివరాలు తెలిపారు. ఈ ఏడాది గరిష్ట డిమాండ్‌ 17,162 మెగావాట్లకు చేరిందనీ, 2026 నాటికి 19వేల మెగావాట్లకు చేరుతుందని అంచనా వేశామని చెప్పారు. ఈ నేపథ్యంలో రబీ సీజన్‌ ప్రారంభానికి ముందే అన్నిరకాల లైన్ల మరమ్మతులు, కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాట్లు వంటివి పూర్తి చేసుకోవాలని దిశానిర్దేశం చేసారు. వచ్చే ఏడాది విద్యుత్‌ డిమాండ్‌ పెరగనున్న నేపథ్యంలో దక్షిణ డిస్కం పరిధిలో 72, ఉత్తర డిస్కం పరిధిలో 31 నూతన సబ్‌స్టేషన్ల ఏర్పాటు, ట్రాన్స్‌కో పరిధిలో 181 ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్ల పరిధిలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచుతున్నామని చెప్పారు. అదనంగా దక్షిణ డిస్కంలో 8,384, ఉత్తర డిస్కంలో 5,280 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జెన్‌కో పరిధిలోని విద్యుదుత్పత్తి ప్లాంట్ల ఓవర్‌ హలింగ్‌ పనులు పూర్తిచేయాలని చెప్పారు. త్వరలో యాదాద్రి థర్మల్‌ పవర్‌స్టేషన్‌ లోని అన్ని యూనిట్లు అందుబాటులోకి వస్తాయనీ, దీనివల్ల 4వేల మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని వివరించారు. థర్మల్‌ ప్లాంట్లకు అవసరమైన బొగ్గు అందుబాటులో ఉండేలా సింగరేణి సంస్థ చర్యలు తీసుకోవాలని చెప్పారు. వినియోగదారులకు మరింత మెరుగైన పారదర్శకసేవలు అందించేందుకు ఎల్‌టీ 11 కేవీ నెట్‌వర్క్‌ స్థాయిలోని ట్రాన్సఫార్మర్లు, ఫీడర్ల నిర్వహణలో ఆటోమేషన్‌ విధానాన్ని అమల్లోకి తేవాలని సూచించారు. ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరానికి మాత్రమే పరిమితమైన స్కాడా తరహా సాంకేతికను గ్రామాలకు సైతం విస్తరింపజేయాలన్నారు. దక్షిణ డిస్కం పరిధిలో నిర్వహిస్తున్న ఫీడర్‌ ఔటేజ్‌ మేనేజ్‌మెంట్‌ మంచి ఫలితాలు ఇస్తున్నదనీ, దీన్ని అన్ని స్థాయిల్లో అమలు చేయాలని ఆదేశించారు. ఈవీ చార్జింగ్‌ స్టేషన్లకు ప్రభుత్వం భారీగా రాయితీలు ఇస్తున్నదనీ, వాటిని సద్వినియోగం చేసుకొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. దక్షిణ డిస్కం పరిధిలో ఈ-డ్రైవ్‌ సర్వేలో అక్టోబర్‌ 25 నాటికి 3,121 ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు స్థలాలు గుర్తించారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -