ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అమెరికా,ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు సరఫరా, భారతదేశంలో పెట్రో ఉత్పత్తుల అందుబాటుపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పశ్చిమాసియాలో అమెరికా,ఇరాన్ మధ్య యుద్ధం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారతదేశం అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారతదేశం రిఫైనరీ విషయంలో నాలుగో స్థానం, ఎగుమతుల విషయంలో ఐదో స్థానంలో ఉందని తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతిలో మూడో స్థానంలో ఉన్నప్పటికీ పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలతో భారతదేశానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బందేమీ లేదని వెల్లడించారు.
దేశంలో పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం వంటి పెట్రోలియం ఉత్పత్తులు, క్రూడ్ ఆయిల్ నిల్వలు సరిపడినంతగా ఉన్నాయని పేర్కొన్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిననాటి నుంచి దేశంలో ఇంధన భద్రతకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ (మంగళూరు, పాదూర్, విశాఖపట్టణం లోని వ్యూహాత్మక ఇంధన నిల్వలు) పెంచుకోవడంతోపాటుగా దేశీయంగా చమురు ఉత్పత్తి, ఇథనాల్ బ్లెండింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు. దీని కారణంగా గత కొన్నేండ్లుగా దేశంలో ప్రజలకు పెట్రోల్ ఉత్పత్తులు అందుబాటులో ఉంచడంతోపాటుగా అంతర్జాతీయంగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా..దేశీయంగా ధరలు పెరగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో భారతీయులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో భారతదేశ ఎగుమతులు, దిగుమతులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, షిప్పింగ్ పోర్ట్స్ మంత్రిత్వ శాఖ, పెట్రోలియం మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో కలిసిన ఒక వివిధ మంత్రిత్వ శాఖల బృందాన్ని ఏర్పాటుచేసిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పెట్రోలియం మంత్రిత్వ శాఖ 24/7 కంట్రోల్ రూమ్ చేసి దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా, నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపారు.
అందుబాటులో పెట్రో ఉత్పత్తులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



