Friday, January 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రమాదాలను నివారిద్దాం

ప్రమాదాలను నివారిద్దాం

- Advertisement -

మరణాల రేటు తగ్గించడమే లక్ష్యం
ఈ ప్రయత్నం వల్ల ఒకరి ప్రాణం దక్కినా సంతృప్తే
విద్యార్థులు, ప్రజల భాగస్వామ్యంతో ప్రమాదాల నివారణకు కృషి
ఆర్టీసీలో జీరో ప్రమాదాలే లక్ష్యం..
30 ఏండ్లుగా ప్రమాదరహిత డ్రైవర్లకు సత్కారం : జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్‌

నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించి, మరణాల రేటును తగ్గించడమే లక్ష్యంగా విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతగా పనిచేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో ‘జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు- 2026’ (జనవరి 1 నుంచి 31 వరకు) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా మంత్రి స్వయంగా అధికారులకు హెల్మెట్‌ తొడిగి అవగాహన కల్పించారు. రోడ్‌ సేఫ్టీ పోస్టర్లు, వాహన స్టిక్కర్లు, విద్యార్థులకు అవగాహన పుస్తకాలను ఆవిష్కరించారు. యాదగిరిగుట్టలో జరిగిన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌నూ ఉదయం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి ఏటా సుమారు 26 వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా, 8 వేల మంది మరణిస్తున్నారని, ప్రతిరోజూ సగటున 22 మంది ప్రాణం కోల్పోవడం ఆవేదన కలిగిస్తోందని అన్నారు.

అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, రాంగ్‌ రూట్‌లో ప్రయాణం, మొబైల్‌ ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం ప్రమాదాలకు ప్రధాన కారణాలని వెల్లడించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంలో భాగంగా రవాణా శాఖ అధికారులు ప్రతి పాఠశాలకూ వెళ్లాలని ఆదేశించారు. ‘విద్యార్థుల ద్వారా వారి తల్లిదండ్రుల నుంచి ‘మేము రోడ్డు నిబంధనలు పాటిస్తాం’ అని హామీ పత్రంపై సంతకాలు తీసుకోవాలని సూచిం చారు. నిబంధనలు పాటించని వాహనాల లైసెన్సులను సస్పెండ్‌ చేస్తున్నామని, రవాణా శాఖ అధికారులు ట్రాఫిక్‌ చిల్డ్రన్‌ అవేర్నెస్‌ పార్క్‌ ఏర్పాటుపై నిర్లక్ష్యం వీడాలని హెచ్చరించారు. మన ప్రయత్నం వల్ల ఒక్క ప్రాణం దక్కినా సంతృప్తి ఉంటుందని, మీడియా కూడా దీనిపై విస్తృత అవగాహన కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రజలకు మంత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

4-ఈ విధానంతో ముందుకు..
ఈ ఏడాది ‘సడక్‌ సురక్ష – జీవన్‌ సురక్ష’ నినాదంతో.. ఎడ్యుకేషన్‌, ఇంజినీరింగ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఎమర్జెన్సీ (4-ఈ) అనే నాలుగు అంశాల ద్వారా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నట్టు మంత్రి తెలిపారు. రవాణా, ఆర్టీసీ శాఖలే కాకుండా కలెక్టర్లు, పోలీస్‌, ఆర్‌అండ్‌బీ, విద్యాశాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రమాదాలు జరిగే ‘బ్లాక్‌ స్పాట్స్‌’ను గుర్తించి తొలగించాలని ఆదేశించారు.

ఆర్టీసీ డ్రైవర్లకు అభినందనలు
ఆర్టీసీని ప్రజల ‘లైఫ్‌ లైన్‌’గా అభివర్ణించిన మంత్రి, 2026 నాటికి సంస్థ పాత బకాయిలు తీర్చి లాభాల బాటలో నడిచేలా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఆర్టీసీలో ‘జీరో యాక్సిడెంట్స్‌’ లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఆర్టీసీ కళాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో 30 ఏండ్లుగా ఏ ప్రమాదమూ చేయకుండా బస్సు నడుపుతున్న డ్రైవర్లను మంత్రి ఘనంగా సత్కరించారు. స్పెషల్‌ సీఎస్‌ వికాస్‌రాజ్‌ మాట్లాడుతూ.. వాణిజ్య వాహనాల కట్టడికి సాంకేతికతను వాడాలని, హెవీ వెహికల్‌ డ్రైవర్లకు ఎప్పటికప్పుడూ ఆరోగ్య పరీక్షలు, శిక్షణ ఇవ్వాలని సూచించారు. మెదక్‌ కలెక్టర్‌ మాదిరిగా అన్ని జిల్లాల్లోనూ బ్లాక్‌ స్పాట్స్‌ తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ కమిషనర్‌ ఇలాంబర్తి, జేటీసీలు ఎం.చంద్రశేఖర్‌ గౌడ్‌, సి.రమేష్‌, శివలింగయ్య, ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాస్‌, హెల్త్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ శ్రీధర్‌, యూనిసెఫ్‌ హెడ్‌ డాక్టర్‌ జీలం, స్టేట్‌ ఆర్టీఏ మెంబర్‌ నవీన్‌, జిల్లా ఆర్టీఏ సురేష్‌ లాల్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -