- ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి
- కార్పొరేషన్ల మాజీ చైర్మెన్‌లకు జాగృతి సభ్యుల హెచ్చరిక
నవతెలంగాణ – బంజారాహిల్స్
జాగృతి పేరుతో కవితపై చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని మాజీ కార్పొరేషన్ చైర్మెన్‌లను తెలంగాణ జాగృతి సభ్యులు హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జాగృతి క్రిస్టియన్ మైనార్టీ వింగ్ అధ్యక్షులు డేవిడ్ మాట్లాడుతూ.. జాగృతి అంటే కవిత.. కవిత అంటే జాగృతి అని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. మహిళ అని చూడకుండా ఆమెపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్న మాజీ కార్పొరేషన్ చైర్మెన్‌లు రాజీవ్‌సాగర్, మఠం బిక్షపతి, ఓయూ జేఏసీ నాయకులు అని చెప్పుకునే రాజారామ్ యాదవ్ ఆలోచించి వ్యాఖ్యలు చేయాలని సూచించారు. నాడు కేసీఆర్‌ను కలవాలంటే కవితక్క అవసరం వారికి ఏర్పడిందని, ఆ అవసరాన్ని కాస్త రాజకీయ ఆరంగేట్రానికి ఉపయోగించుకొని ఆమె పేరు చెప్పుకొని అడ్డగోలుగా సంపాదించి.. ఇప్పుడు ఆమెకే వ్యతిరేకంగా మాట్లాడటాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. లీగల్ సెల్ ప్రెసిడెంట్ నరేందర్ మాట్లాడుతూ.. ఏ జాగృతిలో మీరు సభ్యులుగా పని చేశారో దాని గురించి అనవసరంగా మాట్లాడటం మానుకోవాలన్నారు. తక్షణం కవితక్కకు క్షమాపణ చెప్పి రాజకీయ భవిష్యత్‌ను పదిలంగా ఉంచుకోవాలని సూచించారు. స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ రాముయాదవ్ మాట్లాడుతూ.. ఎవరి మెప్పో పొందటానికి ”వారు రాసిన కథలు ప్రజల్లో చర్చ జరిగేలా మాట్లాడితే మీ నివాసాన్ని ముట్టడించి మీతోనే అసలు నిజాలు, మీ వెనుక ఉన్న శక్తులు ఎవరో చెప్పేవరకు వదలబోం” అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు లలితా యాదవ్, నాయకులు మంచిల వరలక్ష్మీ, ఈగ సంతోష్, బొడ్డుపల్లి లింగం శివరాజ్ యాదవ్, కృష్ణ ముదిరాజు, నవీన్ గౌడ్, తేజ చౌదరి, మనోజ్ఞ గౌడ్, కృష్ణవేణి పాల్గొన్నారు.