నవతెలంగాణ – పాలకుర్తి
వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకునేందుకు నిర్వహణ కమిటీ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని పాలకుర్తి ఎస్ఐ దూలం పవన్ కుమార్ సూచించారు. మంగళవారం ఎస్సై పవన్ కుమార్ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా గ్రామాల్లో ఏర్పాటు చేసే వినాయక మండపాల అనుమతుల కోసం పోలీస్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో వినాయక మండ పాలను ఏర్పాటు చేస్తే గ్రామపంచాయతీ కార్యదర్శి తో పాటు ప్రైవేటు వ్యక్తుల అనుమతులు తీసుకోవాలన్నారు. ఉత్సవాల సందర్భంగా డీజే లను ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పాఠశాల సమయాల్లో నిర్వాహకులు సౌండ్ సిస్టమును వాడరాదని సూచించారు. పూజా సమయంలో మాత్రమే సౌండ్ సిస్టం వాడాలన్నారు. వినాయక చవితి మండపాల వద్ద ఉత్సాహ కమిటీ సభ్యులు అందుబాటులో ఉండాలని, పోలీసుల తనిఖీ నిరంతరం ఉంటుందని తెలిపారు. గొడవలకు పాల్పడితే ఉత్సాహ కమిటీ సభ్యులే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. శాంతియుతంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలు జరుపుకునే విధంగా ప్రజలు సహకరించాలని సూచించారు.
వినాయక చవితి ఉత్సవాలకు అనుమతులు తీసుకున్న రసీదులను చూపిస్తే ఉచితంగా విద్యుత్ సరఫరా ఉంటుందని విద్యుత్ శాఖ అర్బన్, రూరల్ ఏఈలు ఆవిరినేని రణధీర్, బోయిని సత్తయ్యలు తెలిపారు. అనుమతుల రసీదులు చూపించిన వెంటనే విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తారని తెలిపారు. ఇలాంటి అనుమతులు లేకుండా విద్యుత్ వల్ల ప్రమాదాలు జరిగితే విద్యుత్ శాఖకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వినాయక మండపాల వద్ద ఇనుప స్తంభాలు, ఇనుప కర్రలు ఉండరాదని విద్యుత్ తో ప్రమాదాలు ఏర్పడతాయని తెలిపారు. పేలిన వైర్లు లేకుండా నిర్వహణ కమిటీ చర్యలు చేపట్టాలని సూచించారు.