Saturday, December 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅవగాహనే క్యాన్సర్‌ వ్యాధికి అసలైన వ్యాక్సిన్‌

అవగాహనే క్యాన్సర్‌ వ్యాధికి అసలైన వ్యాక్సిన్‌

- Advertisement -

850 విద్యాసంస్థల్లో 2.8 లక్షల మంది యువత క్యాన్సర్‌ నివారణ ప్రతిజ్ఞ
వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదు

నవతెలంగాణ-బంజారాహిల్స్‌
క్యాన్సర్‌పై అవగాహన కల్పించడమే అసలైన నివారణ మార్గమని చాటిచెప్పేలా తెలంగాణా వ్యాప్తంగా 850కి పైగా విద్యాసంస్థల్లో 2.8 లక్షల మంది యువత క్యాన్సర్‌ నివారణ ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఈ అరుదైన కార్యక్రమం వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో అధికారికంగా నమోదైంది. హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్వర్యంలోని క్యాన్సర్‌ నివారణ కేంద్రం, తెలంగాణ ప్రభుత్వ సంస్థ తెలంగాణ అకాడమీ ఆఫ్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ సంయుక్తంగా శుక్రవారం ఈ భారీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఆన్‌లైన్‌ విధానంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు, యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించుకుని, ఇతరులకు కూడా అవగాహన కల్పించడం ద్వారా ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు తాము కృషి చేస్తామని ప్రతిజ్ఞలో పాల్గొన్న యువత స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని టాస్క్‌ సీఈఓ శ్రీకాంత్‌ సిన్హా ఉపన్యాసంతో ప్రారంభించారు. కార్యక్రమ లక్ష్యాలను వివరిస్తూ ప్రతిజ్ఞకు ముందుకొచ్చిన వారందరికీ ఆయన స్వాగతం పలికారు.

క్యాన్సర్‌ తీవ్రత, నివారణకు తీసుకోవాల్సిన చర్యలను డా.నిషా హరిహరన్‌ (సర్జికల్‌ ఆంకాలజిస్టు) ఉదాహరణలతో వివరించారు. ఆ తర్వాత ఆస్పత్రి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక నుంచి సీఈఓ డా. కె.కృష్ణయ్య 2.8 లక్షల మందితో ఒకేసారి క్యాన్సర్‌ నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షించిన వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు పాల్గొన్న వారి సంఖ్యను నిర్ధారించిన అనంతరం, జాయింట్‌ సెక్రటరీ డా.ఉల్లాజి ఎలియజార్‌ రికార్డు నమోదు చేస్తూ ప్రత్యేక మెమెంటోను టాస్క్‌, బసవతారకం సంస్థ బృందాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక మంచి ఉద్దేశంతో ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనడం తొలిసారి కావడం అభినందనీయమన్నారు. ట్రస్ట్‌ బోర్డు సభ్యులు జెఎస్‌ఆర్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ.. క్యాన్సర్‌ నివారణపై ఆస్పత్రి నిరంతరం దృష్టి సారించి ప్రజల్లో అవగాహన కల్పిస్తోందన్నారు. నివారణ చర్యలను చిన్నచూపు చూడకూడదని, వ్యాధి వచ్చిన తర్వాత బాధపడే కన్నా ముందే నివారించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు. డా. కె.కృష్ణయ్య మాట్లాడుతూ.. 25 ఏండ్లుగా క్యాన్సర్‌ నివారణ అవగాహన కోసం ఆస్పత్రి కృషి చేస్తోందని, త్వరితగతిన వ్యాధి గుర్తింపునకు ప్రత్యేక నిర్ధారణ శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -