నవతెలంగాణ – భిక్కనూర్ ( రాజంపేట్ )
విద్యార్థులు మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా మానసిక వైద్యాధికారి డా.రమణ తెలిపారు. రాజంపేట మండల కేంద్రంలోని కెజిబివి, భిక్కనూర్ మండలంలోని జంగంపల్లి గ్రామ శివారులో ఉన్న కెజిబివి పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు మానసిక సమస్యలపై, మాదక ద్రవాల వినియోగ ప్రభావంపై గురువారం వైద్య ఆరోగ్య,ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో అవగాహన కల్పించినట్లు మెడికల్ ఆఫీసర్ డా.విజయమహాలక్ష్మి, స్పెషల్ ఆఫీసర్ హారిప్రియ తెలిపారు. జిల్లా మానసిక వైద్యాధికారి డా.రమణ మాట్లాడుతూ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం బేధాలను, చికిత్స విధానాలను తెలియజేస్తూ విద్యార్థులకు టీనేజ్ వయస్సులో వచ్చే అవరోధాలను కూలంకుశంగా వివరించారు.
ప్రణాళిక బద్ధంగా విద్యార్థులు తమ చదువును కొనసాగించి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలని సూచించారు. విద్యార్థులకు వారి కుటుంబ సభ్యులకు మానసిక సమస్యలు ఉంటే వెంటనే ప్రభుత్వాసుపత్రిలో మానసిక వైద్యులను సంప్రదించాలని లేనియెడల టెలి మానస్ ఉచిత టోల్ ఫ్రీ 14416 ను సంప్రదించాలన్నారు.ఎక్సైజ్ SI దీపిక మాట్లాడుతూ టీనేజీ లో విద్యార్థులు మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారని, అటువంటి వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ బారినపడి చాలామంది యువత మానసిక సమస్యలకు గురయ్యారని తెలిపారు. ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు విషయాలు తెలిసినా, డ్రగ్స్ సమస్యల నుండి దూరం కావడానికి చికిత్స తీసుకోవాలన్న సమాచారాన్ని 1908 కు తెలియజేయాలని వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల స్పెషల్ ఆఫీసర్ శ్రీవాణి, జిల్లా సైకియాట్రిక్ సోషల్ వర్కర్ డా.రాహుల్ కుమార్, సూపర్ వైజర్ గంగమణి,జిల్లా సైకియాట్రిక్ సోషల్ వర్కర్ డా.రాహుల్ కుమార్,ఆరోగ్య కార్యకర్త శ్రీలక్ష్మి, మంజూర్, ఆరోగ్య కార్యకర్తలు నాగలక్ష్మి, ఉపాధ్యాయులు, పోలీసులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



