నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి మండలంలోని చిన్నమల్లారెడ్డి గ్రామంలో వైఆర్జి సిఎఆర్ఇ (YRG CARE) లింక్ వర్కర్ స్కీమ్ ఆధ్వర్యంలో హెచ్ఐవి నివారణపై మంగళవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డిఆర్పి (DRP ) సుధాకర్ గ్రామ పాలకవర్గ సంఘం సభ్యులతో కలిసి ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ భీమాయల లక్ష్మీ రాజు, ఉప సర్పంచ్ స్వప్న లక్ష్మీనారాయణ, పంచాయతీ కార్యదర్శి రాజేందర్, పల్లె దవాఖాన ఎం ఎల్ హెచ్ పి ( MLHP ) డా. నీరంజన్, ఆరోగ్య సిబ్బంది తదితరులు హాజరయ్యారు. గ్రామ పంచాయతీ పరిధిలో హెచ్ఐవి నిర్మూలనకు లింక్ వర్కర్ స్కీమ్‌తో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని, హెచ్ఐవి తో జీవిస్తున్న వారికి సామాజిక మరియు ప్రభుత్వ పరమైన సహాయం అందేలా చూడాలని సూచించారు.
అలాగే ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. గ్రామాల్లో హెచ్ఐవి నిర్మూలనలో యువత ముందుకు రావాలని, ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో యువత పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. వై ఆర్ జి సి ఎ ఆర్ ఇ లింక్ వర్కర్ స్కీమ్ ద్వారా అందిస్తున్న సేవలను కార్యవర్గ సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు ప్రతి వార్డులో గోడలపై అవగాహన వ్రాతలు రాయించడం, 1097 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉండేలా చేయడం, ప్రజలు హెచ్ఐవి పరీక్షలకు ముందుకు వచ్చేలా ప్రోత్సహించడం వంటి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వై ఆర్ జి సి ఎ ఆర్ ఇ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలపై వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వై ఆర్ జి సి ఎ ఆర్ ఇ లింక్ వర్కర్, స్కీమ్ డి ఆర్ పి సుధాకర్, జోనల్ సూపర్వైసర్ జ్యోతి, లింక్ వర్కర్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



