నవతెలంగాణ – ఆలేరు రూరల్
మండలంలోని ఆలేరు మహిళా సమాఖ్య భవనంలో జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ) ఆధ్వర్యంలో ఉద్యమ్ రిజిస్ట్రేషన్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఈడీసీ మేనేజర్ కుమ్మరికుంట్ల రంజిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. వ్యాపారం ప్రారంభించాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, దీని ద్వారా ప్రభుత్వం అందించే పలు రకాల సబ్సిడీలు, రుణ సౌకర్యాలు మరియు ఇతర ప్రోత్సాహకాలు పొందవచ్చని వివరించారు. కార్యక్రమం అనంతరం అక్కడికక్కడే కొంతమంది అభ్యర్థులకు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేసి మార్గదర్శనం చేశారు. అనంతరం లీడ్ బ్యాంక్ ఆఫీసర్ వంశీ మాట్లాడుతూ బ్యాంకింగ్ వ్యవస్థలో రుణాల మంజూరు విధానం, బ్యాంకులు పాటించే నిబంధనలు, అలాగే ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ప్రాముఖ్యతపై వివరంగా చర్చించారు. బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఎంతో అవసరమని తెలిపారు.
అదేవిధంగా ఏపిఎం సత్యనారాయణ మాట్లాడుతూ మహిళలు సహా స్వయం ఉపాధి చేపట్టాలనుకునే ప్రతి ఒక్కరూ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఈడీసీ ఆధ్వర్యంలో సుమారు 50 మందికి ఉచితంగా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేసి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈడీసీ అసిస్టెంట్ మేనేజర్ మహేష్,సీసీ ఆనంద్,సరస్వతి,గొలనుకొండ నర్సింహ రెడ్డి, మహిళలు మరియు ఇతరులు పాల్గొన్నారు.




