యదేచ్చగా టేకు చెట్ల నరికివేత
పర్యవేక్షణ లోపంతో రెచ్చిపోతున్న స్మగ్లర్లు
అడవులు అంతరిస్తే పర్యావరణానికి ముప్పు,
ప్రకృతి వైపరీత్యాలతో భారీ నష్టాలు
నవతెలంగాణ – రామారెడ్డి
పచ్చని అడవిపై గొడ్డలి వేటు ఆగటం లేదు. విలువైన టేకు కలప అడవి దాటిపోతుంది. ఎన్ని చట్టాలు తెచ్చిన అధికారుల పర్యవేక్షణ కరువైతే, స్మగ్లర్లు అడవిలో రాజ్యమేలి, అక్రమంగా అటవి సంపాదన దోచుకుంటారు. 1980 అటవి సంరక్షణ చట్టం, ప్రధానంగా అటవీ భూములు, అటవీయేతర ప్రయోజనాల కోసం వినియోగించడాన్ని నియంత్రిస్తుంది. సంరక్షణ, వాటి జీవవైద్యాన్ని కాపాడడం, అటవీ నిర్మూలనను అరికట్టడం ఈ చట్టం ప్రధాన లక్ష్యం. 1988లో సవరించి, అడవుల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి తప్పనిసరి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2006, 2023లో చట్ట సవరణ చేసింది. అడవుల నరికివేతతో భూమి కోత కు గురి అవుతుంది. నదుల్లో అవశేషాలు పెరిగిపోతాయి.
ఆనకట్టల జీవిత కాలాన్ని తగ్గిస్తుంది. వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతుంది. వన్యప్రాణుల ఆవాసాలు తగ్గిపోయి వాటి మనుగడకు ముప్పు ఏర్పడి, జనావాసాలపై దాడి చేస్తాయి. పర్యావరణ సమతుల్యత అంతరించిపోతే వాతావరణంలో మార్పులు వచ్చి, జీవకోటి మనుగడకు ప్రమాదంగా మారనుంది. మొన్నటి కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం బీభత్సవం ఉదాహరణ. అడవులను కాపాడడానికి ప్రత్యేకంగా అటవీ శాఖను ఏర్పాటు చేసిన పర్యావేక్షణ లేక అడవులు అంతరించిపోతున్నాయి. కామారెడ్డి జిల్లాల వ్యాప్తంగా సుమారు 82,190.48 హెక్టార్లలో అటవీ భూములు ఉన్నాయి. జిల్లా విస్తీర్ణంలో దాదాపు 22.43% ఉంది. అటవీ ప్రాంతం నుండి వెదురు, బీడీ ఆకు, సీతాఫలాలు ఎక్కువగా లభిస్తాయి.
అడవిలో చిరుతపుల్లతో పాటు, ఎలుగుబంట్లు, నక్కలతో పాటు వన్యప్రాణులు జీవిస్తున్నాయి. రామారెడ్డి మండల పరిధిలోగల రెడ్డి పేటతో పాటు వివిధ గ్రామాల అటవీ పరిధిలో టేకు దుంపలు యదేచ్చగా అక్రమంగా కొట్టి తరలిస్తున్నారు. గత 20 నుండి 30 రోజుల క్రితం రెడ్డి పేట అడవి ప్రాంతంలో టేకు చెట్లను నరికి కల్పను తరలించారు. పర్యవేక్షించవలసిన అధికారులు ఇప్పటివరకు పర్యవేక్షించకపోవడం, చర్యలు తీసుకోకపోవడంపై పలు విమర్శలు వెలుబడుతున్నాయి. సొంత పొలంలో పెంచిన టేకు మొక్కను కొట్టాలంటే అటవీశాఖ అధికారుల అనుమతి కావాలి, అటవిలో యదేచ్చగా టేకు కల్పను తరలిస్తుంటే అధికారుల చోద్యం ఏమిటని పలువురు విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అటవీ సంపదను కాపాడవలసిన బాధ్యత ఉందని పలువురు కోరుతున్నారు.
ఎఫ్ డి ఓ రామకృష్ణను నవతెలంగాణ వివరణ కోరగా.. అనునిత్యం పర్యవేక్షణతో పాటు గస్తీకాస్తున్నాము. ఆర్డీవో, డి.ఎస్.పి, ఎఫ్ డి ఓ లో సమావేశం నిర్వహించాము. అక్రమంగా అడవి భూమి ఆక్రమణ, కలప, అడవి సంపద అక్రమంగా తరలించడం, పై అరికట్టడంపై చర్చించాం. సిబ్బంది కొరత ఉంది. రక్షణ కోసం పోలీసులను కోరాము. ఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.