Friday, October 10, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఅయోధ్య, కాశీ వివాదాలు..చంద్రచూడ్‌ సంకేతాలు…

అయోధ్య, కాశీ వివాదాలు..చంద్రచూడ్‌ సంకేతాలు…

- Advertisement -

అయోధ్య, కాశీ సమస్యలు మళ్లీ రగులుకోవడం ఒక పెద్ద విపరీతం. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులతో ఈ సమస్యలు అలా అనిశ్చితంగా పక్కన పెట్టబడ్డాయి. అయోధ్యపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా మందికి అసలు అంతుపట్టలేదు. బాబ్రీ మసీదును నేరపూరితంగా విధ్వంసం చేసిన వారికి యాజమాన్యం అప్పగించడం, రామాలయ నిర్మాణం అనుమతించడం అందుకు కారణం. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ రామ మందిరం ప్రారంభోత్సవంలో న్యాయవ్యవస్థ ఇచ్చిన చెల్లుబాటును నొక్కిచెప్పారు. మేము అందుకు భిన్నంగా చెప్పవలసి వుంటుంది. ”సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది, కానీ న్యాయం చేయలేదు.”

అయితే ఇప్పుడు మాజీ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ ‘న్యూస్‌లాండ్రీ’కి చెందిన శ్రీవాత్సవ్‌ జైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మొత్తం సమస్యను తిరగదోడారు. సెప్టెంబరు 24నాటి ఆ ఇంటర్వ్యూ లో చంద్రచూడ్‌ ఇలా అన్నారు: ”పురావస్తు తవ్వకాల ద్వారా తగినంత సాక్ష్యాధారం లభించింది. ఇప్పుడు ఆ పురావస్తు తవ్వకాలకు సాక్ష్యంగా వుండే విలువెంత అన్నది పూర్తిగా వేరే ప్రశ్న. నేను నిజంగా చెప్పదలుచుకున్న విషయమంతా ఒక్కటే. పురావస్తు తవ్వకాల నివేదిక రూపంలో సాక్ష్యం వుంది”.

”ఇక్కడ వాదన ఒకటే. హిందువులు కూడా అపచారాలు చేయడం వంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడటం, అల్లర్లు సృష్టించడంతో ఆ(మసీదు) లోపలి ఆవరణ వివాదాస్పదమైంది. ముస్లింలు బయటి ఆవరణలో అలాంటివి చేయలేదన్నది నిజం. దాన్ని కూడా వారు విభేదించలేదు. కనక వారిని శిక్షించడానికి ఇది సరిపోతుంది. హిందు వులు పోరాటం చేస్తుంటే మీరు ఎదుర్కోలేదన్నది వాస్తవానికి ముస్లింలకు వ్యతిరేకమైన అంశంగా మారుతుంది. ఈ తీర్పును విమర్శనాత్మకంగా చదివితే ఇది అర్థమవుతుంది కదా” అని జైన్‌ వేసిన ప్రశ్నకు మాజీ సిజెఐ ఇచ్చిన వివాదాస్పద జవాబు ఇది. ”ఆవరణలో అపచారాలకు పాల్పడింది హిందువులు అని మీరు అంటున్నారంటే అసలు మొదట జరిగిన అపచారం అంటే మసీదు నిర్మాణం అనే ప్రాథమిక చర్య సంగతేమిటి? మీరు ఆ జరిగినవన్నీ మర్చిపోతారా? చరిత్రలో జరిగినవి మనం మర్చిపోదామా?”

తొలగిన ముసుగు!
న్యాయపరమైన ప్రకటనలు మరీ ముఖ్యంగా ఉన్నత న్యాయస్థానాల నుంచి వచ్చేవి అనేక పద విన్యాసాలతో కఠిన కోణాల పదును కనపడకుండా ముసుగు తెరలను కప్పిపెడుతుంటాయి. వాటిని రాసినవారు చెబితే తప్ప వాటిని మనం అర్థం చేసుకోవడం కాదు కదా అసలు వున్నాయన్నదే పసిగట్టలేం. అయోధ్య తీర్పు విషయంలో ఇది మరింత నిజం. ఈ ఇంటర్వ్యూలో జస్టిస్‌ చంద్రచూడ్‌ చెప్పింది తీర్పుకు పూర్తి తేడాగా వుంది, పురావస్తు తవ్వకాల నీవేదిక గురించి అందులో చెప్పింది వేరే. ”ఆ ప్రదేశంలో లభ్యమైన పురావస్తు శకలాలు, ఆ నిర్మాణం స్వభావం బట్టి అది హిందూ మత సంబంధమైనదని ఆ నివేదిక నిర్ణయానికి వచ్చింది (సున్నీ వక్ఫ్‌ బోర్డు అభ్యర్థించినట్టుగా). దాని దిగువన ఇస్లామిక్‌ కట్టడం వుండివుండ వచ్చుననే అవకాశాన్ని తిరస్కరించింది. అయితే ఎ.ఎస్‌.ఐ నివేదిక దానికి అప్పగించిన అతి ముఖ్యమైన భాగానికి సమాధానం ఇవ్వకుండా వదిలేసింది. మసీదు నిర్మించడం కోసం ఒక హిందూ ఆలయాన్ని ధ్వంసం చేయబడిందా అన్న ప్రశ్నకు మాత్రం అందులో సమాధానమివ్వలేదు. నిర్దిష్టమైన నిర్ధారణకు రాలేకపోయిన ఎ.ఎస్‌.ఐ అశక్తత ఖచ్చితంగా చాలా కీలకమైంది. అంతిమ విశ్లేషణలో మొత్తం సాక్ష్యాధారాల ప్రభావాన్ని అంచనా కట్టినప్పుడు తప్పక మనసులో వుంచుకోవలసిన సాక్షీభూత పరిస్థితి అది.” అని పేర్కొంది.

తీర్పుతో వివాదానికి బాట
ఆ ఉత్తర్వులో ఇంకా ఇలా వుంది: ఈ దశలో తప్పక చెప్పవలసిన మరో అంశం వుంది. ఈ యాజమాన్యం ఎవరిదనేది బేరీజు వేసిన పుడు దాన్ని పరిశీలించడం జరుగుతుంది. ఎ.ఎస్‌.ఐ నిర్ధారణల ఆధారంగానే యాజమాన్య హక్కును తేల్చడం సాధ్యమేనా అన్నదే ఆ ప్రశ్న. 450 ఏండ్ల కిందట 1528లో మసీదు నిర్మాణం అంతకు ముందున్న 12వ శతాబ్దికి చెందిన మత కట్టడంపైనే జరిగిందా అనేదానిపై తీసు కునే నిర్ణయమే యాజమాన్యం ఎవరికి చెందుతున్న ప్రశ్నకు సమాధానం చెబుతుంది. అది వేరే విషయం. యాజమాన్యం ఎవరిదనేది తేల్చే పని ఎ.ఎస్‌.ఐ పరిధిలోది కాదని మాత్రం ఇక్కడ చెబితే సరిపోతుంది. తీర్పునిచ్చే సమయంలో భూమిపై హక్కు ఎవరిదన్నది పరిశీలించినపుడే ఆలోచించి వాస్తవికమైన నిర్ధారణకు రావడం జరుగుతుంది”. కనుక ”పూరావస్తు తవ్వకాల ద్వారా తగినంత సమాచారం వుందని” జస్టిస్‌ చంద్రచూడ్‌ ఈ ఇంటర్వ్యూలో తేల్చి చెబుతున్నట్టు…మసీదు కట్టడానికి ఆలయాన్ని ధ్వంసం చేయబడిందనే నిర్ణయాత్మక నిర్ధారణకు అత్యు న్నత న్యాయస్థానం ఏ దశలోనూ రానేలేదు.

కాశీలో జ్ఞాన్‌వ్యాపి మసీదులో తవ్వకాలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు ధర్మాసనం ”ఒక మత కట్టడం ఏ తరహాకు చెందిందో పరిశోధిం చవచ్చు. కానీ మార్చడానికి లేదు” అని సిఫార్సు చేయడంలో అంతర్గతంగా దాగిన పచ్చి వైరుధ్యం కూడా ఇదే. జస్టిస్‌ చంద్రచూడ్‌ మాటల్లో నూ ఇందులోని మెజారిటీవాద అదే ధోరణిని కనుగొనవచ్చు. ప్రార్థనా ప్రదేశాల చట్టం నేపథ్యంలో అయోధ్య తప్ప మరే ఇతర మత ప్రదేశాన్ని న్యాయపరంగా సవాలు చేయడానికి అవకాశమే లేదు. అందువల్ల అత్యున్నత న్యాయస్థానం తీసుకున్న వైఖరివల్లనే వివాదాలకూ విద్వేషాలకు హింసాకాండకు బాట వేసినట్టయిందని చెప్పాలి.

రాజ్యంతో పాటే న్యాయం
న్యూస్‌లాండ్రీ ఇంటర్వ్యూ బయటికి వచ్చాక అంతా కల్లోలమైపోయింది. ఏమైనా ప్రజల్లో చర్చ జస్టిస్‌ చంచ్రూడ్‌ వ్యక్తిత్వం, పాత్రకే పరిమితమై పోయింది. మాజీ సిజెఐ భాగం పంచుకున్న అనేక ఇతర తీర్పులు, ప్రత్యేకించి ఆరెస్సెస్‌, బీజేపీకి రాజకీయంగా లాభం కలిగించిన తీర్పులు ప్రస్తావనకు వస్తున్నాయి. దురదృష్టవశాత్తూ ఈ పరిస్థితి అనివార్యమే. అయితే కేవలం ఆయనపై వ్యక్తిగత పరిశీలనకే పరిమితమైతే అది మొక్కలు చూస్తూ అడవిని మరిచి పోయిన చందమవుతుంది. భారత దేశంలో రాజ్యం ఎలాంటి మార్పులకు గురైందో మర్చిపోతే మహా ప్రమాదం తెచ్చు కున్నట్టే. ఆరెస్సెస్‌ నిర్దేశిత బీజేపీ పాలన కార్పొరేట్‌ కాషాయ బంధం పైనే ఆధారపడి నడుస్తున్నది. ఈ నూతన దిశ స్వభావ సిద్ధంగానే ఒక సంపూర్ణమైన మార్పునకు కారణమవుతుంది.

దానివల్ల లౌకిక ప్రజాస్వామిక రిపబ్లిక్‌ తీవ్రంగా హరించుకుపోయి దెబ్బ తింటుంది. రాజ్యం కేవలం కార్యనిర్వాహక, శాసనాధికారాలకే పరిమితమై వుండదు. న్యాయ వ్యవస్థ కూడా అందులో భగమే. అందుకనే రాజ్యాంగాన్ని మొత్తంగా లేకుండా చేయాలని తదేకంగా పని చేయడంతో పాటే న్యాయ వ్యవస్థపైనా ఆ ప్రభావం పడుతున్నది. న్యాయ వ్యవస్థను హిందూత్వ రథానికి అనుగుణంగా నడిపే ప్రయత్నాలు సాగుతున్నాయి. రిపబ్లిక్‌ సూత్రాలకూ, రాజ్యాంగ తత్వానికి అనుగుణంగా వెలువడిన కొన్ని ప్రసిద్ధమైన నిబద్ధ ఘట్టాలను మినహాయిస్తే అక్కడా వాటినుంచి వైదొలగడం జరుగుతున్నది. దురదృష్టవ శాత్తూ అయోధ్య తీర్పుగానీ, జ్ఞాన్‌వ్యాపి తీర్పుగానీ ఆ విధంగా రాజ్యాంగ సూత్రాలనూ ఆ ప్రాతిపదికన ఏర్పడిన ఈ దేశ చట్టాలను నిలబెట్టేవిగా లేవు.
(అక్టోబరు1 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -