గాయంతో వాషింగ్టన్ సుందర్ అవుట్
ముంబయి : భారత జట్టుకు గాయాల బెడద కొనసాగుతుంది. న్యూజిలాండ్‌తో వైట్‌బాల్ సిరీస్ ఆరంభానికి ముందు తిలక్ వర్మ గాయం బారిన పడగా.. వడోదరలో తొలి వన్డే ముంగిట వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ పంత్ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. తాజాగా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ సైతం గాయంతో జట్టుకు దూరమయ్యాడు. న్యూజిలాండ్‌తో వడోదర వన్డేలో ఆడిన వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ వేస్తుండగా పక్కటెముకల నొప్పితో బాధపడ్డాడు. ఐదు ఓవర్లలో 27 పరుగులు ఇచ్చిన వాషింగ్టన్ సుందర్ ఆ తర్వాత మైదానం వీడాడు. ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చి కెఎల్ రాహుల్‌తో కలిసి గెలుపు భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు. మ్యాచ్ అనంతరం వైద్య పరీక్షల్లో వాషింగ్టన్ సుందర్ ఎడమవైపు దిగువ పక్కటెముకల గాయానికి గురైనట్టు తేలింది. దీంతో న్యూజిలాండ్‌తో వైట్‌బాల్ సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరమయ్యాడు. వన్డే సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లకు వాషింగ్టన్ సుందర్ స్థానంలో యువ బ్యాటర్ ఆయుశ్ బదోనిని జట్టులోకి తీసుకున్నారు. ఈ మేరకు బీసీసీఐ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
తొలి పిలుపు!
ఆయుశ్ బదోని (26) లిస్ట్-ఏ క్రికెట్‌లో 27 మ్యాచ్‌లు ఆడాడు. 36.47 సగటుతో ఓ సెంచరీ, ఐదు అర్థ సెంచరీలు సాధించాడు. ఆయుశ్ బదోని ప్రధానంగా బ్యాటింగ్‌పైనే ఫోకస్ చేస్తాడు. ఇటీవల ఆఫ్ స్పిన్‌తో పార్ట్‌టైమ్ బౌలర్‌గానూ రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సీజన్ విజయ్ హజారే ట్రోఫీలో మూడు ఇన్నింగ్స్‌ల్లో 22 ఓవర్లు వేసిన బదోని.. 19.75 సగటు, 3.59 ఎకానమీతో 4 వికెట్లు పడగొట్టాడు. దేశవాళీ క్రికెట్‌లో బదోని ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తుండగా.. ఐపీఎల్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ తరఫున ఆడుతున్నాడు. భారత చీఫ్ కోచ్ గౌతం గంభీర్ ఐపీఎల్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌కు మెంటార్‌గా, ఢిల్లీ రంజీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. భారత్, న్యూజిలాండ్ రెండో వన్డే బుధవారం రాజ్‌కోట్‌లో జరుగనుండగా.. ఆఖరు వన్డే ఇండోర్‌లో ఆదివారం జరుగుతుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో కొనసాగుతుంది.



