Tuesday, November 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅజహరుద్దీన్‌ నియామకం రాజ్యాంగ విరుద్ధం

అజహరుద్దీన్‌ నియామకం రాజ్యాంగ విరుద్ధం

- Advertisement -

– ముస్లిం ఓటర్లను ప్రభావితం చేసే చర్య : టీఆర్‌డీఎల్‌ అధ్యక్షులు కపిలవాయి దిలీప్‌కుమార్‌
హైదరాబాద్‌ : భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ అజహరుద్దీన్‌ను మంత్రిగా నియమించడం రాజ్యాంగ విరుద్ధమని, ఉప ఎన్నికల వేళ ఇది ముస్లిం ఓటర్లను ప్రభావితం చేసే చర్య అని తెలంగాణ రాష్ట్ర రాష్ట్రీయ లోక్‌ దళ్‌ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్‌ అన్నారు. హైదరాబాద్‌లో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..అజహరుద్దీన్‌ను మంత్రివర్గంలో తీసుకోవడమనేది భారత ఎన్నికల సంఘం విధానమైన ఫ్రీ అండ్‌ ఫెయిర్‌ ఎలక్షన్ల స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. తక్షణమే ఆయన నియామకాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇది జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో 1.2 లక్షల మంది ముస్లిం ఓటర్లను ప్రభావితం చేయడానికి ఉద్దేశించిన రాజకీయ చర్య అని విమర్శించారు. రాష్ట్ర గవర్నర్‌, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి జోక్యం చేసుకుని అజహరుద్దీన్‌ నియామకాన్ని నిలిపివేయడంతో పాటు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల కాలంలో ఆయన్ను పర్యటన చేయకుండా నిషేదం విధించాలని టీఆర్‌ఎల్‌డీ డిమాండ్‌ చేస్తుందని అన్నారు. రాష్ట్రీయ లోక్‌ దళ్‌ చేపట్టిన ”సామాజిక చైతన్య రథయాత్ర” తిరిగి ఈ నెల 13న కరీంనగర్‌ నుంచి నిజామాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల కొనసాగుతూ 17న ఆదిలాబాద్‌లో ముగుస్తుందని దిలీప్‌కుమార్‌ తెలిపారు. యాత్ర ద్వారా తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యతను బలోపేతం చేసి రాబోయే స్థానిక సంస్థలు, సాధారణ ఎన్నికల్లో రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి దోహదపడడం టీఆర్‌ఎల్‌డీ లక్ష్యమని అన్నారు. టీఆర్‌ఎల్‌డీ మహిళా అధ్యక్షురాలు కె.ఇందిర మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గంలో జరగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. రహదారుల విస్తరణ జరగకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ దుర్గటనలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌ పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరముందన్నారు. ఈ సమావేశంలో టీఆర్‌డీఎల్‌ హైదరబాద్‌ అధ్యక్షులు ఎంఎస్‌ బైగ్‌, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు బీరప్ప, ప్రధాన కార్యదర్శులు రిషబ్‌, విశాల్‌, మల్వేశ్‌, నరసింహరావు, సిద్దంకుమార్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -