అభ్యర్థులపై పార్టీల ఆర్థిక హుకుం
నవతెలంగాణ – పరకాల
నానాటికీ రాజకీయాల్లో విలువలు మంటగలుస్తున్నాయి. ప్రజాసేవ, పార్టీ విధేయత అనే మాటలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. పరకాల మున్సిపల్ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల తీరు చూస్తుంటే ‘ప్రజాస్వామ్యం’ కాస్తా ‘ధనస్వామ్యం’గా మారిపోయిందని స్పష్టమవుతోంది. వార్డు కౌన్సిలర్ టికెట్ కావాలంటే కనీసం రూ. 10 నుంచి 20 లక్షల వరకు సిద్ధం చేసుకోవాలని పార్టీ అధిష్టానాలు ఆశావాహులకు అల్టిమేటం జారీ చేస్తున్నాయి.
జెండా మోసినోడికి మొండిచేయి.. డబ్బున్న వాడికే జైజేలు!
దశాబ్దాల కాలంగా పార్టీ జెండా మోసి, కష్టకాలంలో అండగా నిలిచిన సామాన్య కార్యకర్తలకు ఈ ధనబల రాజకీయం శరాఘాతంగా మారింది. “పార్టీని నమ్ముకుని ఇన్నాళ్లు కష్టపడితే, ఇప్పుడు లక్షలు చూపిస్తేనే బీ-ఫారం ఇస్తామనడం ఎంతవరకు న్యాయం?” అని సామాన్య కార్యకర్తలు కన్నీరు మున్నీరవుతున్నారు. జనరల్ వార్డులో పోటిచేసే అభ్యర్థి రూ. 20 లక్షలకు, రిజర్వ్డ్ స్థానాల్లో నేటి చేసేవారు 10 నుంచి 15లక్షలు చూపించాల్సిందేనంటు ఆయా పార్టీలో అధిష్టానాలు ఖరాఖండిగా చెప్పుతున్నట్లు విశ్వాసనీయ సమాచారం.
సర్వేల పేరుతో మాయాజాలం.. అసలు గురి ‘ఆస్తుల’పైనే!
గెలుపు గుర్రాలను ఎంపిక చేసేందుకు సర్వేలు చేస్తున్నామని పైకి చెబుతున్న ప్రధాన పార్టీల నాయకత్వం, లోలోపల మాత్రం అభ్యర్థి బ్యాంక్ బ్యాలెన్స్‌పైనే ఆరా తీస్తోంది. వార్డులో ఓటర్లను కొనేందుకు, మద్యం పారించేందుకు ఎంత ఖర్చు పెట్టగలరు? అన్నదే ఇప్పుడు ప్రధాన అర్హతగా మారింది. సీటు కోసం కొందరు ఆశావాహులు తమ స్థిరాస్తులను అమ్ముకునో, లేదా కుదువ పెట్టి మరీ నగదు సర్దుబాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరికొందరు అయిన వాళ్ల దగ్గర అందిన కాడికి అప్పులు తెస్తున్న పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రజాస్వామ్యం ఖూనీ!
డబ్బున్న వాడికే పెద్దపీట వేస్తుండటంతో, సేవా దృక్పథం ఉన్న వారు ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నారు. ఈ ‘ఖరీదైన’ రాజకీయం వల్ల రేపు గెలిచిన అభ్యర్థులు ప్రజా సమస్యల కంటే, తాము పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారన్నది బహిరంగ రహస్యం. పరకాల మున్సిపాలిటీలో సాగుతున్న ఈ ‘బీ-ఫారం’ దందా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.



