ఈ రోజుల్లో చదువు అనేది పిల్లల జీవితాల్లో ఓ భయంగా, ఓ భారంగా, ఓ పోటీగా మారిపోయింది. ‘పాస్ అవ్వాలి, ర్యాంక్ రావాలి, ఉద్యోగం రావాలి, అప్పుడే జీవితం సెటిల్’ అనే లక్ష్యంతో నడుస్తున్న విద్యా వ్యవస్థ, నిజమైన విజ్ఞానాన్ని కాకుండా మార్కులను మాత్రమే అంగీకరించే విధంగా రూపాంతరం చెందుతోంది. చిన్నచిన్న పిల్లలకే మోయలేని బ్యాగుల బరువులతో నడుము వంగిపోయి అవస్థలు పడడం, చదువుల ఒత్తిడితో చిన్నతనంలోనే కంటి చూపు మందగించడం నేటి పిల్లలకు శాపంలా మారింది. ఇలాంటి పరిస్థితితో యువతకు చదువు పట్ల అసహనం కలుగుతోంది.
చదువు.. జీవన నైపుణ్యాన్ని కల్పించాలి కానీ ఒత్తిడిని పెంచకూడదు. కానీ ఈ రోజు పరిస్థితి చూస్తే, చదువు విద్యార్థులకు భారంగా మారింది. అది భవిష్యత్తును నిర్మించక, నిస్సారంగా మారుస్తోంది. ఒక విద్యార్థి పరీక్షలలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత సాధిస్తాడు కానీ అతనికి జీవితంలో ఎదురయ్యే చిన్న సమస్యలను కూడా ఎదుర్కునే ధైర్యం ఉండదు. అలా చాలా మంది విద్యార్థులు నేటి సమాజంలో చదువులో రాణిస్తున్నారు కానీ జీవితంలో విఫలమవుతున్నారు. ఇది మన విద్యావిధానానికి పెను సవాలుగా మారింది.
బట్టీ చదువు అంటే ఏమిటి?
బట్టీ చదువు అనేది అవగాహన లేకుండా పాఠ్యాంశాలను యాంత్రికంగా గుర్తుపెట్టుకోవడం. ఇది చిన్నపాటి మెమరీ గేమ్ మాత్రమే. దాన్ని పరీక్షలో వాంతి చేసి బయటపెడతారు. తరువాత మిగలేది శూన్యం! ఈ పద్ధతిలో చదివిన విద్యార్థులు జీవితంలోని అసలైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేరు. పరిచయ సమస్యలు, ఆచరణలో ఎదురయ్యే సవాళ్ళను తట్టుకోలేరు. దీని వలన వారు మరింత అస్థిరతకు లోనవుతారు.
బట్టీ చదువు దుష్పరిణామాలు: ఆత్మవిశ్వాస లోపం: చదివినది అర్థం కాకపోవడం వల్ల నిర్ధారణ లేకుండా ఒక నిర్ణయానికి రావడం, ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోలేకపోవడం జరుగుతుంది.
సొంత తెలివి ఉపయోగించలేరు: ప్రశ్నల వెనుక ఉన్న భావాన్ని పట్టుకోలేరు, స్వతంత్రంగా ఆలోచించలేరు.
సజనాత్మకత లోపించడం: కొత్తగా ఆలోచించగల శక్తి లేకుండా తయారవుతారు. సమస్యలపై స్వయం నిర్ణయం తీసుకునే ధైర్యం లేకుండా మారతారు.
మానసిక ఒత్తిడి: మార్కుల భయం, తల్లిదండ్రుల అంచనాలు, సమాజపు వత్తిడితో మానసిక స్థైర్యం కోల్పోతున్నారు.
చదువుకి అసలైన అర్థం ఏమిటి?
విద్య అంటే… మంచి వ్యక్తిగా తయారవడం. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం. జీవిత సమస్యలకు పరిష్కారం చూపగలగడం. విద్య అంటే ”జ్ఞానం, ఆచరణ, ఆత్మస్థైర్యం”. ఇది ఏదో పుస్తక జ్ఞానంతో పరిమితం కాక, జీవితాన్ని అర్థం చేసుకునే దిశలో ఉండాలి.
నిజమైన విద్య ఎలా ఉండాలి?
అభిరుచి ఆధారంగా కోర్సులు: ప్రతి విద్యార్థికి ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. అందరినీ ఒకే తాటిపై కట్టే ప్రయత్నం కాకుండా, ప్రతి ఒక్కరి ఆసక్తిని గుర్తించి దాన్ని అభివద్ధి చేసేలా విద్యావిధానం ఉండాలి.
జీవిత విద్య : పిల్లలకు పరీక్షల్లో ఉత్తీర్ణతకన్నా ముందుగా, జీవనంలో ఎలా నడవాలో నేర్పించాలి. ఆత్మస్థైర్యం, కమ్యూనికేషన్, నిర్ణయాలు తీసుకునే శక్తి వంటి జీవన నైపుణ్యాలు ప్రధాన పాత్ర పోషించాలి.
ప్రయోగాత్మక విద్య : పుస్తకాల నుంచి కన్నా, అనుభవ పూర్వకంగా క్షేత్ర స్థాయిలో స్వయంగా నేర్చుకునే పాఠాలే విద్యార్ధులలో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. జీవితంలో సమస్యల సాధనకు కూడా ప్రయోగాత్మక విద్య ఎంతో సహాయ పడుతుంది
విలువలతో కూడిన విద్య: విద్యార్థులలో నైతికత, మానవత, సానుభూతి వంటి విలువలు పాఠ్యాంశాలతో పాటు మిళితమై ఉండాలి. మార్కుల కన్నా మానవతా విలువలు వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దుతాయి.
తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది: మార్కులు జీవితాన్ని నిర్వచించవు. పిల్లలు మంచి మార్కులు, ర్యాంక్ సాధించకపోయిన వారిని నిందించకండి. వారి లోపాలను గుర్తించి, మానసికంగా వారిలో ధైర్యాన్ని, విశ్వాసాన్ని నింపాలి. పిల్లలను నిజమైన విజేతలగా తీర్చిదిద్దడానికి దోహదపడుతుంది.
ఉపాధ్యాయులు ఆలోచించాల్సింది : మీరు బోధించేది పాఠ్యాంశం మాత్రమే కాదు, ఓ జీవన దిశ. విద్యార్థుల్లో ఆలోచన, ప్రశ్నించే ధైర్యం, విశ్లేషణ, జ్ఞానాన్ని వినియోగించే నైపుణ్యాన్ని పెంపొందించాలి. మార్కులు పొందే విద్యార్థులు కాక, మార్గదర్శకులు తయారు చేయండి.
విద్యార్థులు గుర్తుంచుకోవాల్సింది : మీరు చదివేది పుస్తకం కాదు – ఒక జీవితాన్ని నిర్మించే సాధన. మార్కులు మీ విజయాన్ని నిర్వచించవు. మీరు ఎంతగా సమస్యలను అర్థం చేసుకుని, వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని పెంచుకుంటారో, అదే మీ నిజమైన విజయానికి మూలం. ఈ మార్పు కుటుంబం నుంచి, పాఠశాల నుంచి, విద్యావిధానం నుంచి మాత్రమే కాక ప్రధానంగా అందరి మనసుల నుంచి రావాలి. పిల్లలకు భయాన్ని కాదు, లక్ష్యం వైపు నడిపించే ధైర్యాన్ని కలిగించే చదువు అవసరం.
జి. అజయ్ కుమార్
కాలమిస్ట్
బట్టీ చదువులు భవిష్యత్తుకు చేటు
- Advertisement -
- Advertisement -