ఒక అడవిలో కాకి, ఎలుక ఎంతో స్నేహంగా ఉండేవి. ప్రతి రోజు వెళ్ళి ఆహారం సంపాదించేవి. తెచ్చిన ఆహారాన్ని రెండూ కలిసి హాయిగా భుజించేవి. మిగిలిన ఆహారాన్ని ఎలుక ఎంతో భద్రంగా దాచేది. ఆహారం దొరకని రోజు దాచుకున్న ఆహారాన్ని తినేవి.
ఇలా కొన్నాళ్ళు గడిచింది. ఒక రోజు కాకి అరుస్తూ ఎలుక దగ్గరకు వచ్చింది. ”ఎందుకు ఏడుస్తున్నావు” అని అడిగింది ఎలుక.
”వర్షాకాలం వస్తుంది కదా! నేను బయటకు వెళ్లలేను. తినడానికి తిండి గింజలు లేవు. ఎలాగు బతికేది అందుకే ఏడుస్తున్నాను” అన్నది కాకి.
”ఇంత మాత్రానికే ఏడవాలా… నా కన్నంలో చాలా తిండిగింజలు దాచాను. ఇద్దరం తిందాంలే..” అని ఎంతో అన్యోన్యంగా అన్నది ఎలుక.
అయితే నేను ఒక ప్లాస్టిక్ కవర్ తెస్తాను. అందులో తిండిగింజలు దాచి పెడితే చెడిపోవు అంది కాకి. వెంటనే గాలిలో ఎగురుతున్న ఒక కవరు తెచ్చి కాకి ఇచ్చింది. దానిలో గింజలు పోసి కన్నంలోనే దాచింది ఎలుక.
”కన్నంలో అయితే నేల తేమగా ఉంటుంది. ఆహారం చెడిపోతుంది. అందుకే ఆ కవర్ సంచిని చెట్టు తొర్రలో దాచి పెడితే సురక్షితంగా ఉంటుంది” అన్నది కాకి. దాని మాటలు నమ్మి అలాగే కానివ్వు అంది ఎలుక. వెంటనే కాకి చెట్టు పైకి ఎగిరి తొర్రలో ఆ కవరును భద్రంగా దాచింది.
వర్షాకాలం ప్రారంభం కావడంతో కాకి ఎక్కడికి పోలేక ఎలుకకు తెలియకుండా చెట్టు తొర్రలోని గింజలను పూర్తిగా తినేసింది. ఎలుకకు ఆకలి వేసి తొర్రలో చూస్తే గింజలు లేవు. ఏమయ్యాయో అని ఆలోచిస్తున్నా ఎలుకకు చినిగిన కవర్ ముక్కలతో పాటు కాకి ఈకలు కనిపించాయి. వెంటనే దానికి కాకి చేసిన కపట బుద్ధి తెలిసిపోయింది .
కాకి ముఖం చాటేసేసుకుని రెండు మూడు రోజుల దాకా కనిపించలేదు. చివరకు ఒక రోజు కాకి ఏమీ ఎరగనట్లు ఎలుక దగ్గరకు వచ్చి ”బాగా ఆకలేస్తుంది. దాచిపెట్టిన ధాన్యం గింజలు తిందాం పద అని…!” అన్నది.
దాని మాటలు విన్న ఎలుక చిరాకుతో ”ఓ కాకి.! నీ నీచపు బుద్ది ఇంకా పోలే… నీచులతో స్నేహం కూడదని మా తాత చెప్పినప్పటికీ…. నీతో స్నేహం చేశా. ఈ రోజుతో నీకు నాకు చెల్లు. నీ ముఖం చూపించకు దూరంగా వెళ్ళిపో!” అంది. ఇక కాకి చేసేది లేక కావ్ కావ్ మంటూ దూరంగా ఎగిరిపోయింది.
– కోమటి రెడ్డి బుచ్చిరెడ్డి, 9441561655
చెడిన స్నేహం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES