మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాజకీయ లబ్ది కోసమే కొంత మంది ప్రభుత్వ ఆస్పత్రులపై దుష్ప్రచారం చేస్తున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. మంగళవారం బీఆర్‌ఎస్ నేతలు బస్తీ దవాఖానాలను సందర్శించి విమర్శలు చేసిన నేపథ్యంలో బుధవారం మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. బస్తీ దవాఖానాల ద్వారా ప్రతి రోజూ సుమారు 45 వేల మంది పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. అన్ని రకాల మెడిసిన్స్ బస్తీ దవాఖాన్లలో అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. డయాగస్టిక్స్ హబ్స్ ద్వారా బస్తీ దవాఖానాలకు వచ్చే పేషెంట్లకు 134 రకాల టెస్టులు చేయిస్తున్నట్టు వెల్లడించారు. 24 గంటల లోపల టెస్ట్ రిపోర్టులు పేషెంట్లకు అందజేస్తున్నామని పేర్కొన్నారు.
బస్తీ దవాఖాన్లలో మెరుగైన వైద్య సేవలు అందుతుండడంతో, గాంధీ, ఉస్మానియా హాస్పిటళ్లపై పేషెంట్ల రద్దీ తగ్గిందని వివరించారు. పేదలకు వైద్య సేవలందించే ప్రభుత్వ హాస్పిటళ్లపై రాజకీయ లబ్ది కోసం ప్రజా ప్రతినిధులే తప్పుడు ప్రచారం చేస్తూ వాటిపై నమ్మకం సన్నగిల్లేలా చేయడం దురదష్టకరమని తెలిపారు. ప్రయివేటు ఆస్పత్రులకు లబ్ది చేకూర్చే విధంగా వారు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారనీ, సరైన సమయంలో మరోసారి వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఇలాంటి కుట్రపూరిత చర్యలు ప్రభుత్వ డాక్టర్లు, సిబ్బంది మనో ధైర్యాన్ని దెబ్బతీయలేవని తేల్చిచెప్పారు. బస్తీ దవాఖాన్లలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా తమ ప్రయత్నం ఉంటుందని ప్రకటించారు.
గడువు తీరిన మందులివ్వలేదు : బీఆర్‌ఎస్ సోషల్ మీడియా వర్కర్ ఆరోపణలకు ఖండన
రసూల్‌పురా బస్తీ దవాఖానలో గడువు ముగిసిన మెడిసిన్‌ను పేషెంట్‌కు ఇచ్చారంటూ బీఆర్‌ఎస్ సోషల్ మీడియా వర్కర్ చేసిన ఆరోపణలను ఆ దవాఖానా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనిక ఖండించారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వ్యక్తి ఆస్పత్రికి వచ్చిన సమయంలో తాను ఫీల్డ్ వర్క్‌లో ఉన్నాననీ, మధ్యాహ్నం 12 గంటల తర్వాత హాస్పిటల్‌కు వచ్చానని ఆమె తెలిపారు. గడువుతీరిన మెఫెనామిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్‌ను ఆఫియా బేగం అనే పేషెంట్‌కు ఇచ్చినట్టుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, హాస్పిటల్‌లో ఉన్న మెడిసిన్ స్టాక్ మొత్తాన్ని పరిశీలించినట్టు ఆమె వెల్లడించారు. రసూల్‌పురా యూపీహెచ్‌ఎసీలో 2024 ఆగస్ట్‌లో తయారు చేసిన (బ్యాచ్ నంబర్ జి240122) మెఫెనామిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అందుబాటులో ఉన్నాయనీ, వీటి గడువు 2026 జూలై వరకు ఉందని ఆమె వివరించారు.
2025 జూలైలో ఎక్స్‌పైరీ ఉన్న మందులేవీ రసూల్‌పురా బస్తీ దవాఖానలో గానీ, రసూల్‌పురా యూపీహెచ్‌సీలో గానీ లేవని తేల్చిచెప్పారు. ఆఫియా బేగం అనే మహిళా అనారోగ్య సమస్యలతో తరచూ రసూల్‌పురా బస్తీ దవాఖాన, యూపీహెచ్‌సీలో చికిత్స తీసుకుంటారని తెలిపారు. ఈ నెల 21న కూడా ఆమె దగ్గు, జ్వరంతో బస్తీ దవాఖానకు వచ్చారని మౌనిక వెల్లడించారు. ఆమెకు ఏసిక్లో ఫెనాక్, అమాక్సిసిలిన్ మాత్రలు మాత్రమే ఇచ్చామనీ, మెఫెనామిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ తామివ్వలేదని తెలిపారు. గతంలో ఆమె చికిత్స కోసం వచ్చినప్పుడు ఇచ్చిన మెఫెనామిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వెంట తెచ్చుకుని ఉంటుందని లేదా బస్తీ దవాఖానాలపై బురదజల్లేందుకు ఎక్స్‌పైరీ మెడిసిన్‌ను ఎవరైనా బయటి నుంచి తీసుకొచ్చి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.
రాజకీయ లబ్ది కోసమే ప్రభుత్వ ఆస్పత్రులపై దుష్ప్రచారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES