మహిళా జర్నలిస్టుపై నోరు పారేసుకున్న ట్రంప్
పెంటగాన్ కుంభకోణంపై ప్రశ్నించినందుకు ఆగ్రహం
వాషింగ్టన్ : మహిళా జర్నలిస్టులపై కస్సుబుస్సులాడే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి నోరు పారేసుకున్నారు. సైనిక దాడికి సంబంధించిన వీడియోపై ఆయన ఎబీసీ రిపోర్టర్ రాచల్ స్కాట్‌తో వాగ్వివాదానికి దిగారు. మహిళా పాత్రికేయులపై వ్యక్తిగత దాడులకు దిగడం ట్రంప్‌కు కొత్తేమీ కాదు. దీనిపై అనేక వివాదాలు నడుస్తున్నాయి. వెనిజులా ఓడలపై జరుపుతున్న దాడులకు సంబంధించి ఎందుకు మాట మారుస్తున్నారని సోమవారం విలేకరుల సమావేశంలో ట్రంప్‌ను రాచల్ స్కాట్ నిలదీశారు. దీంతో శివాలెత్తిపోయిన ట్రంప్ ఆమెపై చిందులు తొక్కారు. సెప్టెంబర్ 2వ తేదీన జరిగిన దాడికి సంబంధించిన వీడియోను విడుదల చేయాల్సిందిగా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సేథ్‌ను ఆదేశిస్తారా అని ట్రంప్‌ను రాచల్ ప్రశ్నించారు. వీడియో ఫుటేజీని విడుదల చేయడంలో తనకేమీ ఇబ్బంది లేదని గత వారం చెప్పిన ట్రంప్ అలాంటిదేమీ లేదంటూ మాట మార్చారు. ‘నేను అలా చెప్పలేదు. మీరే ఆ మాట అంటున్నారు. కానీ నేను అలా చెప్పలేదు’ అని బుకాయించారు. ‘ఇక్కడ ఉన్న వారిలో మీరు అత్యంత చెడ్డవారు. నన్ను చెప్పనివ్వండి. మీరు చాలా చెడ్డవారు. వాస్తవానికి మీరు భయంకరమైన రిపోర్టర్. మీతో ఎప్పుడూ ఇలాగే జరుగుతుంటుంది’ అంటూ ఆమెపై ఎగిరిపడ్డారు.ఒకవేళ హెగ్‌సేథ్ ఆ వీడియో ను విడుదల చేయాలని అనుకుంటే తనకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. ప్రాణాలతో జీవించి ఉన్న ఇద్దరిని లక్ష్యంగా చేసుకొని సెప్టెంబర్ 2వ తేదీన అమెరికా దాడి చేసింది. నిరాయుధులను చంపే ఉద్దేశంతో అమెరికా యుద్ధ నేరానికి పాల్పడిందని పలువురు విమర్శకులు మండిపడ్డారు. ఈ ఘటనపై సమీక్ష జరుపుతున్నానని అమెరికా ప్రభుత్వం ఇప్పటికీ చెబుతూనే ఉంది.
చెడ్డదానివి..భయాంకరమైన రిపోర్టర్‌వి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



