హైదరాబాద్ : వేమూరి సుధాకర్ స్మారక తెలంగాణ సబ్ జూనియర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ బాలికల డబుల్స్ అండర్-17 విభాగంలో ఆనన్య రెడ్డి-చంద్రిక జోడీ విజేతగా నిలిచారు. మంగళవారం మొయినాబాద్‌లోని గుత్తా జ్వాల అకాడమీలో జరిగిన ఈ పోటీల్లో అండర్-17 ఫైనల్లో ఆనన్య-చంద్రిక (గేమ్‌పాయింట్ అకాడమీ) జోడీ 15-13, 15-8తో అదితి-లక్ష్య (జ్వాల అకాడమీ)పై గెలిచి టైటిల్ దక్కించుకున్నారు. బాలుర డబుల్స్‌లో గౌతం-హర్ష ద్వయం, మిక్స్‌డ్ డబుల్స్‌లో మహిధర్-గ్రేస్ జంట, సింగిల్స్‌లో అఖిలేష్, మహిళల సింగిల్స్ మాన్య టైటిళ్లు సాధించారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ద్రోణాచార్య పురస్కార గ్రహీత ఎస్.ఎం ఆరీఫ్, దిగ్గజ షట్లర్ గుత్తా జ్వాల విజేతలకు ట్రోఫీలు ప్రదానం చేశారు.